ఫెంగల్‌ తుపాన్‌ ఎఫెక్ట్‌

Effect of Fengal Typhoon– తమిళనాడు, పుదుచ్చేరిలో పంటలకు భారీ నష్టం
చెన్నై : ఫెంగల్‌ తుపాను కారణంగా తమిళనాడు, పుదుచ్చేరిలో పంటలు తీవ్రంగా నష్టపోయాయి. తమిళనాడులోని విల్లుపురం, కళ్లకురిచ్చి, తిరువణ్ణామలై జిల్లాలోనే దాదాపు 1,29,000 హెక్టార్లలో పంటలు నీటి మునిగాయని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ సోమవారం తెలిపారు. ఫెంగాల్‌ తుపాను నష్టంపై సమగ్ర నివేదికను కేంద్రానికి సమర్పిస్తామని చెప్పారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తరువాత, పొలాల్లో నీరు ఇంకిపోయిన తరువాత పంట నష్టంపై సమగ్ర అంచనా వేసి, నష్టపోయిన వారందరికీ సాయం అందిస్తామని చెప్పారు. తమళ నాడులో ఫెంగల్‌ తుపాను కారణంగా సోమవారం కూడా వర్షాలు కురిసాయి. విల్పురం జిల్లాలో సోమవారం భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. వంతెనలు, రోడ్లు మునిగిపోయాయి. రైల్వే ట్రాక్‌లపై కూడా నీరు నిలిచి పోవడంతో కొన్ని రైళ్లను రద్దు చేశారు. ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. క్రిష్ణగిరి జిల్లాలోని ఊతరగరై, పోచంపల్లి తాలుకాల్లో భారీ వర్షాలకు రోడ్లపై నీరు ఉద్రృతంగా ప్రవహించింది. జాతీయ రహదారులకు అనుసంధానం తెగి పోయిం ది. ఉత్తంగరై హైవేపై పక్కన నిలిపి ఉంచిన బస్సులు వరద నీటిలో కొట్టుకుని పోయాయి. ఈ రెండు తాలుకాల్లో మంగళవారం కూడా విద్యా సంస్థలకు సెలవు లు ప్రకటించారు. ఈ జిల్లాల్లో అన్నామలై యూనివర్శిటీ పరీక్షలను వాయిదా వేసింది. పుదుచ్చేరిలోనూ పంటలు నీట మునిగాయని, వర్షాల కారణంగా నలుగురు మరణించారని ముఖ్యమంత్రి ఎన్‌ రంగసామి తెలిపారు. సహాయక చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు ఒక్కొరికి రూ 5 లక్షల చొప్పున పరిహారం అందచేస్తామని చెప్పారు. అలాగే ప్రజా పంపిణీ వ్యవస్థ కింద 3.54 లక్షల కుటుంబాలకు ఒక్కొరికి రూ 5 వేలు సహాయం అందచేస్తామని ప్రకటించారు. బ్యాంక్‌ ఖాతాలకు నేరుగా జమ చేస్తామని తెలిపారు. అలాగే ఈ నెల 3, 5 తేదీల్లో జరగాల్సిన పరీక్షలను పుదుచ్చేరి యూనివర్శిటీ రద్దు చేసింది. తాజా తేదీలను త్వరలో ప్రకటిస్తామని అసిస్టెంట్‌ రిజిస్టార్‌ తెలిపారు. అయితే ఈ నెల 6 నుంచి జరగాల్సిన పరీక్షలు యథావిధిగా జరుగుతాయని చెప్పారు.
ఉత్తర కేరళకు రెడ్‌ అలర్ట్‌ జారీ
ఫెంగాల్‌ తుఫాను కారణంగా కేరళలో గణనీయమైన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) సోమవారం హెచ్చరిక జారీ చేసింది. మంగళవారం నాటికి ఈ అల్పపీడనం ఉత్తర కేరళ, కర్ణాటక మీదుగా అరేబియా సముద్రం వైపు కదులుతున్నందున భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఐదు ఉత్తరాది జిల్లాలు-కాసరగోడ్‌, కన్నూర్‌, వాయనాడ్‌, కోజికోడ్‌, మలప్పురానికి రెడ్‌ అలర్ట్‌లు జారీ చేసింది. పాలక్కాడ్‌, త్రిసూర్‌, ఇడుక్కి, ఎర్నాకులం జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌, కొట్టాయం, అలప్పుజా, పతనంతిట్టలకు ఎల్లో అలర్ట్‌ ప్రకటించారు.
బెంగుళూరులో ఆగని వర్షాలు
ఫెంగల్‌ తుఫాను కారణంగా బెంగళూరు ముంపునకు గురైంది. తుపానుతో బెంగళూరులో ఆదివారం సాయంత్రం నుండి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాలు జలమయ్యాయి. సోమవారం కూడా రోడ్లపై నీరు నిలిచిపోవడం ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఐఎండి అధికారుల సమాచారం ప్రకారం మంగళవారం కోస్టల్‌ కర్ణాటక, దక్షిణ ఇంటీరియర్‌ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలల్లో మంగళవారం కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.
అల్పపీడనంగా బలహీన పడిన తుపాను
ఫెంగల్‌ తుపాను సోమవారం ఉదయం 5:30 గంటల సమయంలో అల్పపీడనంగా బలహీనపడిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం మంగళవారం నాటికి ఉత్తర కేరళ, కర్ణాటక తీరాల్లో తూర్పు-మధ్య అరేబియా సముద్రంలో కలిసి పోయే అవకాశం ఉందని తెలిపింది. ఈ కారణంగా మంగళవారం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.

Spread the love