నవతెలంగాణ – ఢిల్లీ
దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాల్లో అధిక ఉష్ణోగ్రత, వడగాలులకు ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్..తదితర రాష్ర్టాల్లో వడగాలులకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఎండ వేడిమి, ఉష్ణోగ్రతల తాకిడికి రైలు పట్టాలు సైతం మెత్తబడుతున్నాయి. లక్నో దగ్గర్లోని నిగోహన్ రైల్వే స్టేషన్ వద్ద శనివారం సాయంత్రం లూప్ లైన్ మీదకు నీలాంచల్ ఎక్స్‌ప్రెస్ రైలు రాగా, మెత్తబడిన రైలు పట్టాలు పక్కకు జరిగాయి. రైలు తీవ్రమైన కుదుపులకు లోనైంది. లోకో పైలట్ అప్రమత్తతతో రైలును వెంటనే నిలిపివేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పిందని అక్కడి రైల్వే సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. ఒడిశా బాలాసోర్ దుర్ఘటన తర్వాత కూడా, లూప్ లైన్ల నిర్వహణను రైల్వే శాఖ సీరియస్‌గా తీసుకోవటం లేదని విమర్శలు వెలువడుతున్నాయి. ట్రాక్ నిర్వహణ సరిగా లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఫొటోలు, వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పట్టాలు పక్కకు జరిగిన విషయాన్ని లోకో పైలట్ గుర్తించకుంటే, ఒడిశా బాలాసోర్‌లో జరిగినట్టు మరో రైలు దుర్ఘటన జరిగి ఉండేదని సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. రైల్వే ట్రాక్ నిర్వహణ సరిగా లేక అనేక రైళ్లు పట్టాలు తప్పుతున్నా, కేంద్రం దీనిపై దృష్టిపెట్టడం లేదన్న విమర్శలున్నాయి.