– ఇండ్ల స్థలాల విషయంలోనూ సర్కారు సానుకూలం : హెచ్‌యూజే ప్రతినిధులతో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జర్నలిస్టు రైల్వేపాసుల పునరుద్ధరణకు తనవంతు కృషి చేస్తానని చేవెళ్ళ ఎంపీ డాక్టర్ జి.రంజిత్‌రెడ్డి అన్నారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చే విషయంలోనూ, రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని వెల్లడించారు. మంగళవారం తన నివాసంలో హైదరాబాద్ యూనియన్ ఆప్ జర్నలిస్ట్స్ (హెచ్‌యూజే) ప్రతినిధి బృందం ఆయన్ను కలిసింది. ఈ సందర్భంగా పలు అంశాలను వారు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. కొవిడ్ కాలం నుంచి జర్నలిస్టులకు రాయితీ పాసులను రైల్వేశాఖ ఆపేసిందనీ, ఇప్పటికీ పాస్‌లు పునరుద్ధరించలేదనీ వివరించారు. ఎంపి స్పందిస్తూ, పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర రైల్వేమంత్రి అశ్వనీ వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. పాత్రికేయుల రైల్వే పాసులు పునరుద్ధరించాలంటూ లేఖ కూడా రాస్తానని తెలిపారు. అన్ని జిల్లాల్లో జర్నలిస్టులకు ప్రభుత్వం ఇండ్లస్థలాలు ఇస్తుందని,గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జర్నలిస్టులకూ ఇండ్ల స్థలాల విషయంలో సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని తెలిపారు. ఎంపీ కలిసిన వారిలో హెచ్‌యూజే ప్రెసిడెంట్ అరుణ్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ గండ్ర నవీన్, ట్రెజరర్ బట్టిపాటి రాజశేఖర్, వైస్ ప్రెసిడెంట్లు సాగర్, వనపర్తి, బయ్యా దామోదర్, రమేష్ తదితరులు ఉన్నారు.