పైపైకి గుడ్డు ధర

Egg price on top– మధ్యాహ్న భోజనంలో గుడ్డు బంద్‌ !
– ప్రభుత్వమిచ్చేది రూ.5.. మార్కెట్లో ధర రూ.7
– ఏడు నెలలుగా బిల్లులు రాని పరిస్థితి
– నిరసనగా నార్కట్‌పల్లి మండలంలో గుడ్డు బంద్‌ చేసిన నిర్వాహకులు
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను బలోపేతం చేస్తూ, విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచడంతోపాటు బడి బయట పిల్లలు పాఠశాలలకు వచ్చేలా చేయడం మధ్యాహ్న భోజన పథకం లక్ష్యం. విద్యార్థులకు విద్యతోపాటు మధ్యాహ్నం నాణ్యమైన పౌష్టికాహార భోజనం అందించాలని ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. నిర్వహణ బాధ్యతలను స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించింది. అయితే, నానాటికీ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆ భోజన ఖర్చుకు సంబంధించి మెనూ మాత్రం పెంచడం లేదు. మధ్యాహ్న భోజనంలో వారానికి మూడ్రోజులు విద్యార్థులకు గుడ్లు పెట్టాల్సి ఉంది. ప్రస్తుతం కూరగాయలు, గుడ్ల ధరలు పెద్దఎత్తున పెరిగాయి. గుడ్డు రూ.7కు చేరింది. ప్రభుత్వం గుడ్డుకు కట్టిచ్చేది మాత్రం రూ.5. అంటే, అదనంగా నిర్వాహకులపై రూ.2 భారం పడుతోంది. ఆ బిల్లు కూడా ఏడు నెలలుగా ఇవ్వకపోవడంతో భోజనంలో గుడ్డు బంద్‌ అయ్యింది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 3143 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో లక్ష 76,659 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. నల్లగొండ జిల్లాలో మొత్తం 1483 పాఠశాలల్లో.. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు 229, ప్రాథమికోన్నత పాఠ శాలలు 126, ప్రాథమిక పాఠశాలలు 1128 ఉన్నాయి. 70 వేల 18 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. సూర్యా పేట జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 700, ప్రాథమికోన్నత పాఠశాలలు 81, ఉన్నత పాఠశాలలు 217 ఉన్నాయి. విద్యార్థులు 66,999 మంది ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం పాఠశాలలు 662 ఉండగా అందులో 39642 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ విద్యార్థులందరికీ వారానికి మూడ్రోజులు మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారం కోసం గుడ్డును అందిస్తున్నారు.
పెరుగుతున్న గుడ్డు ధర
గుడ్డు ధర రోజు రోజుకూ పెరిగిపోతోంది. పౌల్ట్రీ ఫారమ్స్‌లో గుడ్డు రూ.6.50 పైసలు ఉండగా, బహిరంగ మార్కెట్లో రూ.7కు అమ్ముతున్నారు. ప్రతిరోజూ పౌల్ట్రీ ఫామ్స్‌లోనే రూ.10 నుంచి 20 పైసలు పెరుగుతోంది. మార్కెట్లో రిటైల్‌గా కిరణా షాపుల్లో రూ.8కి కూడా అమ్ముతున్నారు. మధ్యా హ్న భోజనంలో విద్యార్థులకు వారానికి మూడుసార్లు గుడ్డు పెట్టేందుకు ప్రభుత్వం ఒక్కో గుడ్డుకు రూ.5 ఇస్తోంది. కానీ మార్కెట్లో గుడ్డు ధర రూ.7 నుంచి 8 రూపాయలుంది. దీంతో నిర్వాహకులు అదనంగా రెండ్రూపాయలు కలిపి గుడ్డు పెట్టాల్సి వస్తోంది.
ఏడు నెలలుగా ఆగిన బిల్లులు
కూరగాయల బిల్లుతోపాటు కోడిగుడ్ల బిల్లును ప్రభుత్వం ప్రత్యేకంగా అందిస్తోంది. అయితే, ఏడు మాసాలుగా మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు కోడిగుడ్ల బిల్లు చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. మధ్యాహ్న కార్మికుల ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే కావడంతో.. అప్పులు చేసి విద్యార్థులకు పౌష్టికాహారం పెడుతున్నారు. కిరాణా షాపుల్లో ఉద్దెర ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే బిల్లు ఇవ్వకపోగా.. ప్రస్తుతం ధర కూడా భారీగా పెరగడంతో దాదాపు పది రోజులుగా నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో గుడ్లు బంద్‌ చేశారు.
బిల్లులు చెల్లించకపోతే.. ఎలా పెట్టాలి బత్తిని సరిత, మధ్యాహ్న భోజన కార్మికురాలు
ప్రతి విద్యార్థికీ మధ్యాహ్న భోజనంలో వారానికి మూడుసార్లు గుడ్లను వడ్డించాల్సి ఉంది. ప్రభుత్వం మార్కెట్‌ ధర ప్రకారం గుడ్డు ధరను ఏజెన్సీలకు చెల్లించడం లేదు. ప్రభుత్వం ఇచ్చేదానికి అదనంగా ప్రతి విద్యార్థికీ రెండు రూపాయలు మధ్యాహ్న భోజన కార్మికులు భరించాల్సి వస్తోంది. నార్కట్‌పల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 266 మంది విద్యార్థు లు ఉన్నారు. వీరి కోసం ప్రభుత్వం చెల్లించే బిల్లుకు అదనంగా ప్రతి రోజూ 660 రూపాయలు మే ము భరిస్తున్నాం. ఒకవైపు ప్రభుత్వం సకాలంలో బిల్లు చెల్లించకపోవడం, మరోవైపు రోజురోజుకూ పెరుగుతున్న గుడ్ల ధరతో అప్పుల పాలయ్యాం. దీంతో ప్రభుత్వానికి నిరసన తెలియజేసేందుకు పది రోజుల నుంచి మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనంలో గుడ్డు పెట్టడం బంద్‌ చేశాం. ఇకనైనా ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు సకాలంలో, మార్కెట్‌ ధరలకు అనుగుణంగా బిల్లులు చెల్లించాలి.

Spread the love