– రెండు తీర్మానాలు, మూడు బిల్లులకు ఆమోదం
– చర్చల్లో పాల్గొన్న 59 మంది సభ్యులు
– ముగిసిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు
– శాసనసభ నిరవధిక వాయిదా
– సెషన్ మొత్తానికీ గైర్హాజరైన ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఆద్యంతం ఆసక్తికరంగా, అంతకుమించి హాట్‌హాట్‌గా కొనసాగిన రాష్ట్ర అసెంబ్లీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. శనివారం సాగునీటి రంగంపై శ్వేతపత్రం విడుదల, దానిపై రోజు మొత్తం సుదీర్ఘంగా చర్చ కొనసాగిన అనంతరం రాత్రి 8.20 గంటల సమయంలో సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ప్రకటించారు. ఈనెల 8న ప్రారంభమైన సమావేశాలు… మొత్తం ఎనిమిది రోజులపాటు కొనసాగాయి. ఎనిమిదిన ఉభయ సభలనుద్దేశించి రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందర్ రాజన్ ప్రసంగించారు. ఆమె ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై 9న చర్చను చేపట్టారు. ఈనెల 10న రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను సభలో ప్రతిపాదించింది. మరుసటి రోజైన ఆదివారం అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. సోమవారం పున:ప్రారంభమైన సమావేశాలు శనివారం వరకూ కొనసాగాయి. గవర్నర్ ప్రసంగంపై చర్చ, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రతిపాదన, కేఆర్ఎమ్బీకి ప్రాజెక్టులను అప్పగించబోమంటూ తీర్మానం, కుల గణనపై తీర్మానం, సాగునీటి రంగంపై శ్వేతపత్రం తదితరాంశాలు ఈ సెషన్లో హైలెట్‌గా నిలిచాయి. ఆయా సందర్భాల్లో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు కొనసాగాయి. బీఆర్ఎస్ సభ్యులు కడియం శ్రీహరి, తన్నీరు హరీశ్‌రావు, పల్లా రాజేశ్వరరెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులు అధికారపక్షంపై విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ నుంచి కొత్తగా ఎన్నికైన పాడి కౌశిక్‌రెడ్డి సభలో వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. మరోవైపు సభ కొనసాగినన్ని రోజులు ముఖ్యమంత్రి రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, జూపల్లి కృష్ణారావు తదితరులు ప్రధాన ప్రతిపక్షంపై ఎదురుదాడికి దిగారు. సీఎం రేవంత్ తనదైన శైలిలో బీఆర్ఎస్ సభ్యులపై సెటైర్లు వేశారు. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌నుద్దేశించి, ఆయన నల్లగొండ సభలో చేసిన వ్యాఖ్యలపైనా ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
మొత్తం మీద 8 రోజులు కొనసాగిన (గవర్నర్ ప్రసంగం చేసిన రోజు మినహాయిస్తే) శాసనసభ సమావేశాల్లో 59 మంది సభ్యులు వివిధ అంశాలపై ప్రసంగించారు. సభలో 45.32 గంటలపాటు కార్యకలాపాలు కొనసాగాయి. కేఆర్ఎమ్బీకి కృష్ణా ప్రాజెక్టులను అప్పగించబోమంటూ ఒక తీర్మానం, కులగణనపై మరో తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. మూడు బిల్లులకు సభ ఓకే చెప్పింది. ఒక అంశంపై (సాగునీటి పారుదల రంగం) లఘు చర్చను చేపట్టారు. సభలో అధికార కాంగ్రెస్‌కు 64 మంది, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కు 39, బీజేపీకి 08, ఎంఐఎంకు 7, సీపీఐకి ఒక్కరేసి సభ్యులున్నట్టు స్పీకర్ ప్రకటించారు. గత డిసెంబరులో నిర్వహించిన సమావేశాలకు ప్రమాణ స్వీకారం చేయని కారణంగా రాలేకపోయిన మాజీ సీఎం కేసీఆర్, ప్రమాణ స్వీకారం చేసిన (ఈనెల ఒకటిన ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు) తర్వాత జరిగిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలకూ డుమ్మా కొట్టటం గమనార్హం. మరోవైపు కేఆర్ఎమ్బీ వ్యవహారంపై బీఆర్ఎస్ నల్లగొండలో సభలో నిర్వహించిన రోజే (ఈనెల 13)… ప్రభుత్వం కూడా మేడిగడ్డ పర్యటనను చేపట్టింది. అధికార కాంగ్రెస్‌తోపాటు ఎంఐఎం, బీజేపీ, సీపీఐ ఎమ్మెల్యేలు, పలువురు ఎమ్మెల్యేలు ఈ పర్యటనలో పాల్గొన్నారు. పోటాపోటీగా నిర్వహించిన ఈ రెండు కార్యక్రమాల్లో మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ చేసిన రాజకీయ విమర్శలు, వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.