– కుటుంబమంతా ఒకేసారి వేలిముద్రలతో ఇబ్బందులు
– సుదూర ప్రాంతాల్లో ఉంటున్న వారు రాక తప్పని స్థితి
– సాధ్యం కాకపోతే రేషన్‌కార్డుల్లో నుంచి వారి పేరు కట్
– ఈ నెలాఖరు గడువు.. దసరా వరకు పొడగించాలని విజ్ఞప్తులు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ సర్కారు రేషన్‌కార్డులపై తీసుకున్న నిర్ణయం లబ్దిదారులను ఇక్కట్లకు గురిచేస్తోంది. అస్సలైన లబ్దిదారులను గుర్తించేందుకు ఈకేవైసీ (నో యువర్ కస్టమర్) ని పూర్తి చేసేందుకు సిద్ధమైంది. ఇది రేషన్‌కార్డుదారులను ఇబ్బందుల పాలుజేస్తోంది. బోగస్ రేషన్‌కార్డుల ఏరివేతతో పాటు రేషన్ సరుకుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్వాగతించాల్సిందేనైనా.. కుటుంబసభ్యులందరూ ఒకేసారి కేవైసీ పూర్తి చేయాలనడంతో ఇబ్బందికర స్థితి ఏర్పడింది. ఈనెలాఖరు లోగా కేవైసీ పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులకు తెలంగాణ పౌరసరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 11వ తేదీ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా సాంకేతిక కారణాలతో ఒకటి, రెండురోజులు వాయిదా పడింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ ప్రక్రియపై విమర్శలు వస్తున్నాయి. దసరా సెలవుల వరకు పొడగించాలని లబ్దిదారులు విజ్ఞప్తులు చేస్తున్నారు.
అందరూ దుకాణానికి వెళ్లాలంటే అయ్యేపనిలా లేదు..
రాష్ట్రంలో రేషన్‌కార్డున్న కుటుంబసభ్యుల్లో ఎవరు వెళ్లినా వేలిముద్ర వేసి రేషన్ తీసుకుంటున్నారు. కార్డుల్లో ఎంతమంది పేర్లుంటే అందరికీ సరుకులు ఇస్తున్నారు. కుటుం బసభ్యుల్లో ఎవరైనా చని పోయినా, పెండ్లిండ్ల్లై వేరే చోటకు వెళ్లినా వారి పేర్లను రేషన్‌కార్డుల్లో నుంచి తొలగించడం లేదు. ఇంట్లో ఎవరో ఒకరు వెళ్లి వీరందరి పేర్ల మీద రేషన్ తీసు కుంటున్నారు. ఈ నేపథ్యంలో రేషన్ సరుకుల పంపిణీలో పారదర్శకత కోసం ప్రభుత్వం కేవైసీ ప్రక్రియ చేపట్టింది. ఇంతవరకూ బాగానే ఉన్నా అందరూ రేషన్‌దుకాణానికి వెళ్లి వేలముద్రలు వేయాలనడంతో సుదూర ప్రాంతాల్లో ఉన్నవారు రావడం ఇబ్బందికరంగా మారింది. కాబట్టి దసరా సెలవుల సమయంలో ఈ ప్రక్రియ చేపడితే హాస్టల్స్, వివిధ ప్రాంతాల్లో ఉంటున్న విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఈకేవైసీ కాకపోతే రేషన్ కట్టే..!
కుటుంబ యజమానితో పాటు రేషన్‌కార్డులో పేరున్న వాళ్లందరూ సమీప రేషన్ దుకాణానికి వెళ్లి ముద్రలు ఇవ్వాల్సి ఉంటుంది. రేషన్‌డీలర్లు ఈ-పాస్ మిషన్‌లో వేలిముద్రలు తీసుకుంటారు. వేలిముద్ర వేసినప్పుడు వారి ఆధార్‌కార్డు నంబర్‌తో పాటు రేషన్‌కార్డు నంబర్ డిస్ప్లే అవుతుంది. ఆ తర్వాత గ్రీన్‌లైట్ వచ్చి కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది.
ఒకవేళ అప్పుడు రెడ్‌లైట్ వస్తే ఆధార్ నంబర్‌తో రేషన్‌కార్డు నంబర్ మ్యాచ్ కావడం లేదని కేవైసీ రిజెక్టవుతుంది. ఇలాంటి సందర్భాల్లో రేషన్‌కార్డు నుంచి సంబంధిత లబ్దిదారు పేరును తొలగిస్తారు. రేషన్ సరుకులు ఒక యూనిట్ అంటే ఒకరికి కట్ చేస్తారు. కేవైసీ కోసం కుటుంబ సభ్యులందరూ ఒకేసారి రేషన్ దుకాణానికి వెళ్లి వేలిముద్రలు ఇవ్వాలనే నిబంధనతోనే అసలు సమస్య వచ్చిపడింది. ఏదైనా కారణంతో కుటుంబసభ్యుల్లో ఎవరైనా వెళ్లకపోతే.. ఫ్యామిలీ నుంచి వారు విడిపోయినట్టుగా భావించి వారి పేర్లను రేషన్‌కార్డు నుంచి తొలగిస్తారు.
రేషన్‌కార్డుంటే ఒక్క రేషనే కాదు..
ఖమ్మం జిల్లాలో 4,11,206 రేషన్‌కార్డులున్నాయి. ఇంకా రెండు లక్ష మందికి పైగా రేషన్కార్డులందాల్సి ఉంది. ప్రస్తుత రేషన్‌కార్డుదారులకు 11,36,226 యూనిట్ల రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. ఒక్కొక్కరికీ (ఒక్కో యూనిట్) 6 కేజీల చొప్పున బియ్యం ఇస్తున్నారు. రేషన్‌కార్డు ద్వారా వచ్చే బియ్యం కన్నా కూడా ప్రభుత్వం వైపు నుంచి అనేక ప్రయోజనాలు లబ్దిదారులు పొందుతున్నారు.
విద్యా, వైద్యం వంటి వాటిలో రాయితీలు లభిస్తున్నాయి. రేషన్ ఉపయోగించుకోవడం లేదనే పేరుతో వారి పేర్లను కార్డుల్లో నుంచి తొలగిస్తే పేద, మధ్యతరగతి ప్రజలు నష్టపోయే ప్రమాదం ఉందని పలువురు అంటున్నారు. కాబట్టి సెలవుల సమయంలో ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలని కోరుతున్నారు.
పిల్లల చదువుకు ఆటంకం
మా పాప భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని గురుకులంలో చదువుతోంది. రేషన్‌కార్డుల్లో ఉన్నవారందరూ వేలిముద్ర వేయాల్సిందేనని డీలర్ చెబుతు న్నారు. కుటుంబసభ్యులందర్నీ రేషన్ దుకాణానికి రమ్మంటే పాపను తీసుకురావాల్సి వస్తుంది. పిల్లల చదువుకు ఆటంకం ఏర్పడుతుంది కాబట్టి ఇలాంటి పనులు దసరా సెలవుల్లో పెట్టుకుంటే బాగుంటుంది.
– బండి సుజాత, సింగరాయపాలెం, కొణిజర్ల
కార్డుంటే వేలిముద్ర తప్పనిసరి..
రేషన్‌కార్డులో ఉన్న ప్రతి ఒక్కరూ కేవైసీకి కోసం సంబంధిత రేషన్ దుకాణాలకు వెళ్లి వేలిముద్ర ఇవ్వాల్సిందే. రేషన్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ఈ ప్రక్రియ చేపట్టింది. ఈనెలాఖరు వరకు కేవైసీకి అవకాశం ఉంది.
– శ్రీలత, ఖమ్మం జిల్లా పౌరసరఫరాల అధికారి
అక్టోబర్ చివరి వరకు గడవు పొడగించాలి…
అక్టోబర్ చివరి వరకు రేషన్‌కార్డుల కేవైసీ గడువు పొడిగించాలి. అటుఇటుగానీ సమయంలో ఇలాంటి ప్రక్రియ చేపట్టడం వల్ల దూరప్రాంతంలో ఉన్న విద్యార్థులు, ఇతరులు ఇబ్బంది పడతారు. కొత్త రేషన్‌కార్డులు ఇవ్వక పదేండ్లవుతోంది. అనేక మందికి పెండ్లిండ్లయ్యాయి. పిల్లలు పుట్టారు. ఈ పేర్లేవీ రేషన్‌కార్డుల్లో నమోదు కాలేదు. కొత్త కార్డులు ఇవ్వకపోగా పాత కార్డుల రేషన్ కట్ చేసే ప్రయత్నం సరికాదు.
– నున్నా నాగేశ్వరరావు, సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి