– ఎన్నికల అధికారి, కలెక్టర్ భారతి హౌలీకేరీ
– వీడియో కాన్ఫరెన్స్‌లో
– ఈ.సీ.ఐ. సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితేష్ వ్యాస్
నవతెలంగాణ రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
జిల్లాలో శాసనసభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భారతి హౌలీకేరీ అన్నారు. రాష్ట్ర శాసన సభ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి బుధవారం న్యూఢిల్లీ నుంచి భారత ఎన్నికల సంఘం (ఈ.సీ.ఐ) సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితేష్ వ్యాస్ జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలింగ్ నిర్వహణ కోసం చేపట్టిన చర్యలపై ఆయా జిల్లాల వారీగా కలెక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ భారతి హౌలీకేరీ మాట్లాడుతూ కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డుల పంపిణీ ప్రక్రియ వేగవంతం చేశామని, ఓటింగ్ వివరాలతో కూడిన స్లిప్పులు కూడా ఇప్పటికే జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో పంపిణీ చేసినట్టు సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ దృష్టికి తెచ్చారు. పోలింగ్ నిర్వహణ కోసం ఈవీఎం బ్యాలెట్, పోస్టల్ బ్యాలెట్, టెండర్ బ్యాలెట్ పేపర్ల ముద్రణ పూర్తైందనీ, కమిషనింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు వీలుగా ఈ.సీ.ఐ.ఎల్ ఇంజినీర్ల బృందాలు జిల్లాకు చేరుకున్నాయని తెలిపారు. 80 ఏండ్లకు పైబడిన వృద్ధులు, 40 శాతానికి పైగా వైకల్యం కలిగిన వికలాంగులను కలుపుకుని మొత్తం 1968 మంది ఓట్ ఫ్రమ్ హౌమ్ సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు అర్హులుగా గుర్తించి, వారి ఇండ్ల వద్దకే వెళ్లి వారి ఓటును స్వీకరించేందుకు వీలుగా ప్రత్యేక పోలింగ్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి ఈ బృందాలు ఓట్ ఫ్రమ్ హౌమ్ ప్రక్రియ చేపట్టినట్టు వివరించారు. 21 వరకు 1792 మంది ఓటు హక్కు హౌమ్ ఓటింగ్ ద్వారా వినియోగించుకున్నారని, పోలీస్ సిబ్బంది 1520 మంది ఓటు హక్కు పోస్టల్ బాలెట్ ద్వారా వినియోగించుకున్నారనీ, ఈ.సీ నిబంధనలకు అనుగుణంగా పూర్తి గోప్యత పాటిస్తూ ఓటు సేకరణ నిర్వహించేలా బందోభస్తు చర్యలు తీసుకున్నామని తెలిపారు. శిక్షణా కేంద్రాల వద్దే ఫెసిలిటేషన్ సెంటర్లను నెలకొల్పి పోలింగ్ విధుల్లో నియమించిన సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. పోలీసులు సహా ఇతర ఎన్నికల విధుల్లో నియమించిన సిబ్బంది కోసం రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించిన అంశాలను ఈ.సీ దృష్టికి తెచ్చేందుకు వీలుగా అందుబాటులోకి తెచ్చిన సీ.విజిల్ యాప్ గురించి విస్తృత ప్రచారం నిర్వహిస్తూ, ఆ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాల్సిందిగా ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. జిల్లాలో సీ.విజిల్ యాప్ ద్వారా 403 ఫిర్యాదులు అందాయని, మొత్తం ఫిర్యాదులను పరిష్కరించడం జరిగిందని తెలిపారు. జిల్లా స్థాయిలోనూ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి ఫిర్యాదులను పరిష్కరిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. సువిధ పోర్టల్ ద్వారా ఎన్నికల ప్రచార సభలు, సమావేశాలు తదితర వాటి కోసం వచ్చే దరఖాస్తులను వెంటవెంటనే పరిశీలిస్తూ గడువులోపు అనుమతులు జారీ చేస్తున్నామన్నారు. పోలింగ్ నిర్వహణ కోసం రిసీవింగ్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను నెలకొల్పి పక్కాగా ఏర్పాట్లు చేశామనీ, జిల్లాకు కేటా యించిన అధికారులు ఇప్పటికే ఆయా కేంద్రాలను సందర్శించారని అన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అంకితభావంతో కృషి చేయాలనీ ఈ.సీ.ఐ సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితేష్ వ్యాస్ తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ ప్రతిమసింగ్, సీపీఓ దిలీప్ కుమార్, ఎన్నికల విభాగం సిబ్బంది సైదులు, నోడల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.