పొగ లేదు… మంట కనిపించదు… అయినా ఊరూవాడా ఎంత కోలాహలం… ఎంత కలకలం! మాటల్లో సూరేకారం… చూపుల్లో భాస్వరం… ఏమాత్రం తగ్గినా మొదటికే మోసం… పదవికే గండం! అందుకే, ప్రత్యర్థులపై విమర్శల లక్ష్మీబాంబులు పేలుతున్నాయి. ఆవేశాల తారాజూవ్వలు నింగికెగుస్తున్నాయి. పంచ్‌ల రాకెట్లు రయ్యిన దూసుకొస్తున్నాయి. ఆహా! ఏమి భాగ్యము… ఎంతటి అదృష్టము… ధరల దరువుల మోత పట్టదు… టపాసులతో పర్యావరణం పాడవుతుందన్న చింత లేదు… అదేమిటో కాదండోయ్… ఎన్నికల దీపావళి సంబరం! నేతల లోగిళ్ల నుంచి జనం వాకిళ్ల వరకు ధగధగలాడిపోతున్న ఓట్ల పండగ వైభోగం! ఆలోచించి చూడాలేగానీ… ప్రజాస్వామ్య భారతంలో ఎన్నికల రోజులను మించిన పర్వదినాలేమి ఉంటాయి? పైగా, పొంగే ‘సుర’గంగలు, చవులూరించే భోజనాలు, కదిలివచ్చే కాసులమూటలు, ఎవరికి ఏది అడిగితే దాన్ని క్షణాల్లో ప్రసాదించే నాయక దేవుళ్లు… ఆహో, దేశంలో ఓట్ల జాతరను మించిన వేడుక మరేమైనా ఉందా?
ఉప్పు కప్పురాల రుచుల జాడవేరు అన్నాడు వేమన. అలాగే ఇండియాలో అయిదేళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల తీరే వేరు.. ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న ఈ ఎన్నికలు సెమీ ఫైనల్స్. ఇందులో దెబ్బతింటే… ఫైనల్ ఆశలు గల్లంతే అనే బెంగ వాటి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అందుకే ఇది ఆయా పక్షాలకు జీవన్మరణ సమస్య… యుద్ధం గెలిచి తీరాల్సిందిగా తయారైంది. కాబట్టే నాయకులు శిబి చక్రవర్తికి పెద్దన్నలుగా మారుతున్నారు. కర్ణున్ని ఆవాహన చేసుకొని.. వాగ్దానాల వర్షం కురిపిస్తున్నారు. నోట్లకట్టలను గుట్టలుగా వెదజల్లుతున్నారు. కాయ్ రాజా కాయ్… గెలుపు వరించిందో ఒకటికి పది… పదికి వంద! మరి ఓడిపోతే… దానిదేముందీ… అనుభవమొస్తుంది. ఎక్కడ తప్పు జరిగిందో అర్థమవుతుంది. వహ్వా వాట్ ఏ స్పోర్టివ్ నెస్? వచ్చే ఎన్నికల్లో పక్కవాడికన్నా మరికాస్త ఎక్కువ సొమ్ము గుమ్మరించి మరోసారి అదష్టాన్ని పరీక్షించుకోవచ్చు. లేదా… ఏకంగా మరో పార్టీలోకి దూకేసి ఏదో ఒక పదవిపై కర్చీఫు వేసుకోవచ్చు. అదీ కుదరకపోతే పాలకపక్షానికి బేషరతు మద్దతు ఇస్తూ హాయిగా కాంట్రాక్టులతో కాలం గడిపేయవచ్చు. రాజకీయ పరమార్థం అదే కదా!
అటు మిజోరాంలో ఎన్నికలు ముగిశాయి. ఛత్తీస్‌గఢ్‌లో తొలి విడత పూర్తయింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సివుంది. ఆనక పార్లమెంటుకే కాక, పంచాయతీలు, మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు, ఎమ్మెల్సీలు… అబ్బో… ముందుముందు దేశంలో నిత్యం ఎన్నికల దీపావళే! అయితే, పండుగనాడు పాతిక వేల రూపాయల టపాసులు కాల్చినా చివరికి మిగిలేది బూడిదే. మతాబులు కాలుతున్నంతసేపూ ఉండే ఆ ఆనందమూ, ఆ వెలుగులన్నీ క్షణ భంగురాలే. ఎన్నికల దీపావళి తంతూ అంతే! అంతిమంగా ఓటేసిన ప్రజలకు దక్కేవి నేతల శుష్క వాగ్దానాలూ… శూన్య హస్తాలే!
అప్పటి రాజులు, చక్రవర్తుల మాదిరిగా ఇప్పుడు నాయకులకూ నిత్యం ఎన్నికల యుద్ధాలతోనే సరిపోతోంది. కాకపోతే అప్పట్లో సామ్రాజ్యాధిపతి తన శక్తియుక్తులతో ప్రత్యర్థి సామ్రాట్టును ఓడిస్తే సరిపోయేది. సాధారణ ప్రజలకు అందులో ఎలాంటి భాగస్వామ్యమూ లేదు. మరి ఎన్నికల గోదాలో… ప్రజలే తమ బలం అని నాయకులు చెప్పుకోవాలి. వారి సంక్షేమమే తమ ధ్యేయమని ఊదరగొట్టాలి. ఆ మాయదారి మాటలను జనాలే స్వయంగా నమ్మి తమను గెలిపించేలా చేసుకోవాలి. ఆ తర్వాత అధికారాన్ని, ఐశ్వర్యాన్ని అనుభవించడంలో అప్పటి రాజులకు, ఇప్పటి తరాజులకు పెద్దగా తేడా ఏమీ ఉండదనుకోండి! జనాన్ని ఏమార్చడంలో ఆమూలాగ్రం పండిపోయిన నేతలు తిమ్మిని బమ్మి చేసేస్తున్నారు. ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియని అయోమయంలోకి ప్రజలను తోసేస్తున్నారు. అంతేకాదు, అమ్మాయిలను లైంగికదాడి చేసి, హత్యలు చేసి, శిక్షలు పడ్డవాళ్ళను దయాళులై విడుదల చేస్తున్న పరిపాలకులు, ఈ ఘటనలకు కారణమేమిటో, ఎలా నివారిస్తారో చెప్పాల్సిన బాధ్యత వుంది. ఆడపిల్లలను చులకనగా, వివక్షతతో చూసే వాళ్లందరూ నేటి నరకాసురులుగానే భావించాలి. ఈ దుర్మార్గ మానసికతకు కారణమవుతున్న రాక్షసాన్ని అంతమొందించకుండా సమాజ జీవితంలో దీపావళి వెలుగు ఎక్కడుంటుంది!
పురాణాల ప్రకారం ఆనాడు సత్యభామ ఎదురుగా ఉన్నది ఒక్కడే నరకాసురుడు. మరి ఎన్నికల రణ రంగంలో ఓటరు ముందు ఎందరో నేతాసురులు. తెలివిగా వ్యవహరించకపోతే గెలిచేదేవరైనా ఓడేది మాత్రం ఓటరే. ఓటు అనే వజ్రాయుధాన్ని వాడి నేతాసురల భరతం పట్టి ప్రజాస్వామ్యాన్ని గెలిపించిన నాడే నిజమైన దీపావళి.