– ఎప్పుడూ ఆ పదవి ఏకగ్రీవమే..
– 50 ఏండ్లలో తొలిసారి పోటీ
– పార్లమెంట్ చరిత్రలో మూడోసారి
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
లోక్‌సభ స్పీకర్ పదవికి నేడు ఎన్నిక జరగనుంది. ఎన్డీఏ అభ్యర్థిగా ఓం బిర్లా ఏకగ్రీవం అవుతారని భావించిన బీజేపీ, దాని భాగస్వామ్య పార్టీలకు ప్రతిపక్ష ఇండియా ఫోరం ఊహించని షాక్ ఇచ్చింది. కేరళ నుంచి ఎనిమిది సార్లు ఎంపీగా గెలిచిన కొడికున్నిల్ సురేష్‌ను ఇండియా ఫోరం స్పీకర్ అభ్యర్థిగా బరిలోకి దింపింది. మంగళవారం ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లాతో పాటు, ప్రతిపక్ష ఇండియా ఫోరం అభ్యర్థిగా కె.సురేష్ మంగళవారం తన నామినేషన్ దాఖలు చేశారు. కాగా 50 ఏండ్ల తర్వాత మళ్లీ లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది.
ఎప్పటిలాగే స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీఏ ప్రయత్నించింది. మంగళవారం ఉదయం స్పీకర్ ఎన్నికకు సహరించాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ప్రతిపక్ష ఇండియా ఫోరం నేతలను కోరారు. అయితే, స్పీకర్ ఎన్నికకు ప్రతిపక్ష ఇండియా ఫోరం ఓ మెలిక పెట్టింది. డిప్యూటీ స్పీకర్ ప్రతిపక్షాలకు ఇస్తే, స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరిస్తామని రాహుల్ గాంధీ తెలిపారు. దీంతో డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చేందుకు సిద్ధపడలేదు. అందువల్ల ఇండియా ఫోరం సభ్యులతో రాజ్‌నాథ్ సింగ్ జరిపిన చర్చల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ప్రతిపక్ష ఇండియా ఫోరం కూడా స్పీకర్ పదవికి పోటీకి దిగింది. అయితే 2019-24 మధ్య లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ లేకుండానే మోడీ సర్కార్ లోక్‌సభను నిర్వహించింది.
ఇది మూడోసారి..
స్వతంత్ర భారతదేశంలో 1952లో తొలిసారి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అప్పుడు లోక్‌సభ, రాజ్యసభ ఏర్పాటు అయ్యాయి. అదే ఏడాది తొలిసారి స్పీకర్ పదవికి ఎన్నిక జరిగింది. అందులో శంకర్ శాంతారామ్ (55 ఓట్లు)పై మౌలాంకర్ (394 ఓట్లు) విజయం సాధించారు. 1976లో జగన్నాథ్ రావుపై బలిరామ్ భగత్ 344 ఓట్లతో గెలుపొందారు. ఆ తర్వాత ఎప్పుడూ లోక్‌సభ స్పీకర్ పదవి ఏకగ్రీవమే అయింది. మళ్లీ ఇప్పుడు స్పీకర్ పదవికి ఎన్నిక జరుగుతోంది. అంతకు ముందు స్వాతంత్య్రానికి పూర్వం 1925 ఆగష్టు 24న అప్పటి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించారు. తర్వాత కాలంలో అదే పార్లమెంట్‌కు మారింది. ఆ ఎన్నికల్లో టి.రంగాచారియార్ (56)పై స్వరాజ్య పార్టీ అభ్యర్థి విఠల్‌భారు జె.పటేల్ (58) స్పీకర్‌గా కేవలం రెండు ఓట్లతోనే గెలుపొందారు. 1925-46 మధ్య ఆరుసార్లు స్పీకర్ పదవికి ఎన్నికలు జరిగాయి. చివరిగా 1946లో స్పీకర్ పదవికి ఎన్నిక జరిగింది. అప్పుడు కాంగ్రెస్ నేత జీవీ మౌలాంకర్ ఎన్నిక అయ్యారు. ఆ తర్వాత స్వాతంత్య్రం రావడంతో తాత్కాలిక పార్లమెంట్‌కు కూడా ఆయనే స్పీకర్‌గా కొన్నేండ్లు ఉన్నారు.
సభలో ప్రాతినిధ్యం లేని ప్రధాన పార్టీలు
18వ లోక్‌సభలో కొన్ని ప్రధాన పార్టీలు ప్రాతినిధ్యం పొందలేక పోయాయి. అందులో తెలంగాణలోని బీఆర్ఎస్, ఒరిస్సాలోని బీజేడీ, తమిళనాడులోని అన్నాడీఎంకే, ఉత్తరప్రదేశ్‌లోని బీఎస్పీ, హర్యానాలోని జేజేపీి, జమ్మూకాశ్మీర్‌లోని పీడీపీ వంటి పార్టీలకు లోక్‌సభ ప్రాతినిధ్యంలో లేదు.
కూటముల బలాబలాలు
లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో సభలోని అధికార, ప్రతిపక్షాల బలాబలాలపై చర్చ జరుగుతోంది. 543 మంది సభ్యుల్లో ప్రస్తుతం 542 మంది ఎంపీలు ఉన్నారు. రాహుల్ గాంధీ గెలుపొందిన రెండో స్థానం కేరళలోని వయనాడ్‌కు రాజీనామా చేశారు. దీంతో ఒక స్థానం ఖాళీగా ఉంది. అయితే 542 మంది ఎంపీల్లో ఎన్డీఏకు లోక్‌సభలో 293 మంది ఎంపీల బలం ఉండగా, ఇండియా బ్లాక్‌కు 233 మంది ఎంపీల బలం ఉంది. ఏ కూటమికీ చెందని సభ్యులు 16 మంది ఉన్నారు. అందులో మహారాష్ట్రలోని సాంగ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఇండిపెండెంట్ ఎంపీ విశాల్ పాటిల్ కాంగ్రెస్‌లో చేరారు. దీంతో ఆయన మద్దతు కూడా ఇండియా ఫోరంకే ఉంటుంది. బీహార్ నుంచి ఎన్నికైన పప్పు యాదవ్ కూడా ఇండియా ఫోరం అభ్యర్థికి ఓటు వేసే అవకాశం ఉంది. ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) చంద్రశేఖర్ ఆజాద్ కూడా ఇండియా ఫోరం అభ్యర్థికే మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు విప్ జారీ చేశాయి. బుధవారం ఉదయం 11 గంటలకే సభ్యులంతా సభకు హాజరుకావాలని సూచించాయి.