ఎన్నికల తీర్పు..

ఎన్నికల తీర్పు..ఒక ముందడుగు.. అయినా పోరు కొనసాగాల్సిందే 2024 సార్వత్రిక ఎన్నికల తీర్పు ప్రత్యేకంగా చెప్పుకోదగింది. తాము ప్రజాస్వామ్యానికీ రాజ్యాంగానికీ ఎంత విలువ ఇస్తామో ఈ తీర్పు ద్వారా ప్రజలు చాటి చెప్పారు. 2014లోనూ 2019లోనూ పరిపూర్ణ ఆధిక్యత తెచ్చుకున్న బీజేపీకి ఈ సారి ప్రజలు ఆ అవకాశం నిరాకరించారు. 303 స్థానాలున్న బీజేపీ సీట్ల సంఖ్య ఈసారి 240కి పడిపోయింది. అంటే 21 శాతం తగ్గింది. ఎన్డీయేకు 292, ‘ఇండియా’ వేదికకు 234 స్థానాలు వచ్చాయి.
మోడీ పదేండ్ల పాలన నేపథ్యంలో ఈ ఎన్నికలు జరిగాయి. ఈ పాలన మొత్తం లక్షణం నియంతృత్వ పోకడలతో హిందూత్వ మతతత్వ ఎజెండాను అమలు జరిగింది. రాజ్యాంగ వ్యవస్థలో ప్రతి అంగమూ దిగ్బంధానికి గురైంది. రాజ్యాంగ వ్యవస్థలను గుప్పిట పెట్టుకోవడానికి దారితీసింది. ఎన్నికల సన్నాహక దశలోనే ఇది ప్రతిబింబించింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా పెట్టుకుని దాడి చేశాయి. ఇద్దరు ముఖ్యమంత్రులు జైళ్ల పాలయ్యారు. కాంగ్రెస్‌, సీపీఐ(ఎం) వంటి రాజకీయ పక్షాలపై కక్ష సాధింపు సాగింది. ఎన్నికల ప్రచారంలో కూడా ప్రతిపక్షానికి సమాన అవకాశం లేకుండా పోయింది. ఈ విషయంలో ఎన్నికల కమిషన్‌ శోచనీయమైన పాత్ర పోషించింది. వెన్నెముక లేని కమిషనర్లతో నియమించబడిన ఎన్నికల కమిషన్‌ ఎన్నికల నియమావళి ఘోర ఉల్లంఘనలను శిక్షించడంలో గట్టిగా నిలబడలేక విఫలమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగాలలో ముస్లింలపై విషం కక్కుతున్నా హద్దు అదుపూ చేయలేకపోయింది. పోలింగ్‌ శాతానికి సంబంధించిన లెక్కలను క్రోడీకరించడంలో పారదర్శకత చూపించలేక అనవసర సందేహాలకూ తావిచ్చింది. ఈ కీలక రాజ్యాంగ వ్యవస్థ విశ్వసనీయతకు విఘాతమేర్పడింది. కార్పొరేట్‌ మీడియా వరణాన్ని పూర్తిగా బీజేపీ గుత్తాధి పత్యంలోకి తెచ్చేసుకుంది. సోషల్‌ మీడియాలోనూ భారీ వనరులు గుమ్మరించింది. ప్రచారంలోనూ ఓటర్లకు పంచిపెట్టడం కోసమూ రూ.వేల కోట్లు వెచ్చించింది.
సమస్యలు ముందుకు
ఈ మొత్తం ప్రచారంలో మోడీ, ఆయన హంగుదార్లు ‘ఇండియా’ వేదికలోని పార్టీల పట్ల బెదిరింపులూ మోసగింపు ఎత్తుగడలకు పాల్పడ్డారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితులలోనే ‘ఇండియా’ వేదిక పార్టీలు ఎన్నికల ప్రచారం నిర్వహించవలసి వచ్చింది. మోడీ పచ్చి మతోన్మాద పల్లవికి వ్యతిరేకంగా ప్రతిపక్షం నిరుద్యోగం, ఉద్యోగాలు, ధరల పెరుగుదల, వ్యవసాయ సంక్షోభం వంటి అంశాలను ముందుకు తెచ్చింది. హిందూత్వ శక్తుల నుంచి ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ఎదురవుతున్న ప్రమాదాలపై దృష్టి సారించేలా చేసింది. మొట్టమొదటి సారిగా రాజ్యాంగ రక్షణ అంశం విశాల ప్రజారాశులను మరీ ముఖ్యంగా దళితులను ఆకట్టుకుంది. బీజేపీ మెజార్టీ కోల్పోవడంలో ఉత్తర ప్రదేశ్‌లో దానికి తగిలిన ఎదురుదెబ్బ కీలకమైంది. అక్కడున్న 80 స్థానాలలోనూ గతంలో 62 వస్తే ప్రస్తుతం 33 మాత్రమే పొందగలిగింది. హిందూత్వ రాజకీయాలకు ఉత్తర ప్రదేశ్‌ గుండెకాయ లాంటిది. అయోధ్యలో రామమందిరం హిందూ దురభిమాన ఎజెండాకు ప్రతీకలాటిది. ఇవన్నీ వున్నా బీజేపీ ఓట్లు తొమ్మిది శాతం తగ్గిపోయాయి. నిరుద్యోగ సమస్య మూకుమ్మడి ప్రభావం, ధరల పెరుగుదల, రైతుల అసంతృప్తి, అగ్నివీర్‌ పథకంపై యువత అసంతృప్తి, పరీక్షా పత్రాల లీకేజి వంటి అంశాలే మతతత్వ సమీకరణను మించిన ప్రభావం చూపించాయి. సమాజ్‌వాది పార్టీ చాకచక్యంగా నడిపిన కుల సమీకరణ రాజకీయాలు ఇందుకు తోడైనాయి. అయోధ్యకు నెలవుగా వున్న ఫైజాబాద్‌ లోక్‌సభ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహించే బీజేపీ సభ్యుడు ఓడిపోవడం ఓటరు ఎంత దూరమైనారో కళ్లకు కట్టే కఠోర వాస్తవంగా నిలిచింది.
ఎగ్జిట్‌ ప్రహసనం
ఏడవ చివరి దశ పోలింగ్‌ ముగిశాక వెల్లువగా వచ్చిన ఎగ్జిట్‌పోల్స్‌ ఎన్డీయే గొప్ప విజయం సాధించబోతున్నదన్న చిత్రణ ఇచ్చాయి. సగటున చూస్తే బీజేపీకి కనీసంగా 367 వస్తాయని చెప్పాయి. ప్రతిపక్షాలను డీలా పడేసి పాలక పార్టీ ఆధిపత్యానికి కొమ్ము కాయడానికి ప్రయోగించిన ఆయధాలే ఇవి. మరింత లోతైన ఉద్దేశం మీడియా కార్పొరేట్‌ కూటమితో స్టాక్‌ మార్కెట్‌లో లాభాలు కొల్లగొట్టడం. దీనంతటి వల్ల ముంబాయి స్టాక్‌ ఎక్స్‌చేంజిలో మదుపరుల పెట్టుబడి రూ.14 లక్షల కోట్లు పెరిగింది.
ఏపీ, ఒడిషా పాఠాలు
పార్లమెంటుతోపాటు శాసనసభ ఎన్నికలు కూడా జరిగిన ఒడిషాలో బిజూ జనతాదళ్‌, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సిపి ఈ ఎన్నికల్లో అధికారం కోల్పోయాయి. అవి లోక్‌సభ ఎన్నికలలో దెబ్బ తినడమేగాక రాష్ట్ర ప్రభుత్వాలను కూడా పోగొట్టుకున్నాయి. ఒడిషాలోని 21 లోక్‌సభ స్థానాలలో బీజేపీ 20 స్థానాలు తెచ్చుకోవడమే గాక శాసనసభలోనూ మెజార్టీ తెచ్చుకుంది. మోడీ ప్రభుత్వంతో జతకట్టే లేదా వత్తాసునిచ్చే ప్రాంతీయ పార్టీలకు ఈ రెండు రాష్ట్రాలూ ఒక గుణపాఠం నేర్పుతున్నాయి. బీజేపీని గట్టిగా వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలు డిఎంకె, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్‌జెడి వంటివే నిలదొక్కుకుని మరింత బలోపేతమయ్యాయి.
బాహుబలి బదాబదలు
నరేంద్ర మోడీ స్వయంగానూ బీజేపీగానూ ఎంతో శ్రమించి పెంచిన బాహుబలి ప్రచార చిత్రాన్ని మొత్తంగా ఈ తీర్పు నేలకు దించింది. బీజేపీ ఇంత గట్టి దెబ్బ తిందంటే దానికి పూర్తి కారకుడు మోడీనే. దీని వెనక అసలు కుట్రదారి బీజేపీనే. ఆ పార్టీ ఎన్నికల ప్రణాళిక కూడా మోడీకే గ్యారంటీ అని నామకరణమైంది. మోడీ చుట్టూ సృష్టించబడిన అజేయత్వం కథలు కకావికలైపోయాయి. ఎన్డీయే మిశ్రమ ప్రభుత్వ ఏర్పాటుతోనైనా మోడీ, అమిత్‌షాల బరితెగింపు పోకడలకు కళ్లెం పడుతుందని ఆశించాలి. ఎన్డీయేకు మూడింట రెండు వంతుల బలమేమీ వుండబోదు. ఒకే దేశం-ఒకే ఎన్నిక వంటి అనర్థక పథకాలను తీసుకొచ్చే ఆలోచనలు దీంతో చిన్నాభిన్నమైనట్టే. మూడో దఫా అధికారంలోకి రాగానే ఏక కాలంలో ఎన్నికల వ్యవస్థ తీసుకొస్తామని అమిత్‌షా వాగ్దానం చేశారు. దానికోసం అవసరమైన అనేక రాజ్యాంగ సవరణలు తీసుకొస్తామన్న ఆయన మాట ఇక అమలు జరిగేది కాదు.
‘ఇండియా’ అనుభవాలు
ఏమైనా నిరంతరం అప్రమత్తంగా వుండటం ఇప్పటికీ అవసరమే. ఎందుకంటే నిరంకుశ హిందూత్వ లక్షణాలు బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్‌ కూటమి జన్యుధాతువుల్లోనే వున్నాయి. తమ ఎజెండాను ముందుకు నెట్టడానికి ప్రత్యక్షంగా కాకపోతే రహస్యంగా మార్గాలు నిరంతరం వారు అన్వేషిస్తూనే ఉంటారు. ఈ కారణంగానే పార్లమెంటులో, అంతకంటే ముఖ్యంగా సభ వెలుపలా సమైక్య ప్రతిపక్షం పాత్ర కీలకమవుతుంది. ‘ఇండియా’ వేదిక పార్టీలు ఒక ఉమ్మడి వేదిక ద్వారా సమన్వయాన్ని మెరుగుపర్చుకుని పనిచేయాల్సి ఉంటుంది. ‘ఇండియా’ కలయిక పార్టీల కొద్ది మాసాల అనుభవాన్ని గమనిస్తే ఒక కచ్చితమైన కూటమిగా గాక విశాల వేదికగా వ్యవహరించడం ఉపయుక్తమని తేలింది. వైవిధ్యాలనూ, పరస్పరం పోలి వుండే రాజకీయ కార్యక్రమాలు, విధానాలను వేదిక ఇముడ్చుకునే వీలు కలిగింది. ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, సమాఖ్యతత్వానికి కట్టుబాట్లు సూత్రాలుగా పనిచేయాలి. నిరంకుశ మతతత్వ ప్రమాదంపై పోరాటం ఎంత మాత్రం ముగియలేదు.
వామపక్షాలు బలోపేతం కోసం
‘ఇండియా’ వేదిక సాధించిన విజయంలో భాగస్వాములైన సీపీఐ(ఎం), వామపక్షాలు తమ తమ పార్టీల ఎన్నికల ఫలితాలను విమర్శనాత్మకంగా సమీక్షించుకోవాల్సి వుంటుంది. వామపక్షాల సీట్ల సంఖ్యలో స్వల్పమైన పెరుగుదల వచ్చింది. గత సభలో అయిదు సీట్లుండగా ఇప్పుడవి ఎనిమిదికి చేరాయి. సీపీఐ(ఎం) నాలుగు, సిపిఐ రెండు, సీపీఐ (ఎంఎల్‌) రెండు తెచ్చుకున్నాయి. కేరళలో సీపీఐ(ఎం), ఎల్‌డిఎఫ్‌లు మరిన్ని సీట్లు తెచ్చుకోగలమని భావించగా వచ్చిన ఫలితాలు నిరుత్సాహపరిచేవిగా వున్నాయి. ఇందుకు కారణాలేమిటో ఆత్మ విమర్శనా పూర్వక పరిశీలన జరగాలి. లోపాలను గుర్తించాలి. రానున్న రోజుల్లో వామపక్షం మరింత బలోపేతం కావడం అత్యంత ప్రాధాన్యత గల అంశం. ఎందుకంటే హిందూత్వ కార్పొరేట్‌ శక్తుల కూటమిపై సమరం మరింత ఉధృతం కావడం అనివార్యం.
(జూన్‌ 9 ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)

Spread the love