ఎన్నికల ప్రేమ

Sampadakiyamతెలంగాణ మినహా మిగిలిన నాలుగు (రాజస్థాన్‌, ఛత్తీస్‌ గఢ్‌, మధ్యప్రదేశ్‌, మిజోరం) రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఈనెల 30తో తెలంగాణలోనూ పోలింగ్‌ ముగియనుంది. ఈ నేపథ్యంలో ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్‌ అలవికాని హామీలు కుమ్మరించాయి. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ కూడా భారీగానే హామీలు గుప్పించింది. ఈ హామీల అమలుకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందనే దానిపై చర్చలు ఎలా ఉన్నా… రెక్కలు ముక్కలు చేసుకొని ఆరుగాలం కష్టించి పనిచేసే అన్నదాతపై పాలక పార్టీలు నాటకాలు షురూ చేశాయి, జాతీయస్థాయిలో ఇదొక రాజకీయ సమస్యగా మారడంతో ప్రధాన పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వ్యవసాయంపైనా, రైతులపైనా ఇప్పటిదాకా ఎన్నో హామీలు ఇచ్చిన మోడీ ప్రభుత్వం మళ్లీ పాతపాటనే వల్లెవేస్తూ రైతును మళ్లీ అగాధంలోకి నెట్టేందుకు సిద్ధమవుతోంది.
తొమ్మిదిన్నరేండ్ల కాలంలో ఏనాడూ రైతుల గురించి బీజేపీ ప్రభుత్వం ఆలోచించలేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో లబ్దిపొం దడం కోసం ఎక్కడాలేని ప్రేమను ఒలకబోస్తోంది. స్వామి నాథన్‌ సిఫారసుల ఆధారంగా పంట ఉత్పత్తులకు కనీస మద్దతుధర చట్టం, రుణ విమోచన చట్టం, తదితర డిమాండ్ల సాధ నకు రైతుసంఘాలు, కార్మికసంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 26 నుంచి 28 వరకు మూడు రోజుల పాటు దేశవ్యాప్త ఆందోళనలు జరిగాయి. మూడు రైతు వ్యతిరేక నల్లచట్టాలను వెనక్కి తీసుకో వాలని ఏడాదిపాటు రైతులు ఢిల్లీలో ఆందోళనలు జరిగిన ప్పుడు.. ఆ నిరసనలు ప్రపంచాన్ని తాకిన విషయం తెలిసిందే. ఆ పోరాటం మాటల్లో చెప్పలేనిది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతులు వెనుతిరగలేదు. ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. అయితే ఆ సమయంలో చేసిన ఒప్పందాలను కేంద్రం అమలు చేయ లేదు. ‘కనీస మద్దతు ధర చట్టం’ అమలు చేస్తామని ఇచ్చిన హామీ ఇప్పటివరకు అతీగతీ లేదు. కేసులు ఎత్తివేయలేదు. ఈ సమయంలో మళ్లీ నిరసనలు తీవ్ర స్థాయికి చేరితే రాబోవు సార్వత్రిక ఎన్నికలకు బీజేపీకి పెద్ద దెబ్బే తగిలే ప్రమాదం ఉంది. దాని నష్టనివారణ కోసం రాష్ట్రాల శాసనసభ ఎన్నికలపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. పీఎం కిసాన్‌సమ్మాన్‌ నిధి కింద ఇస్తున్న ఆర్థిక సాయాన్ని పెంచుతా మని చెప్పడం అందులో భాగమే. వరి ప్రధాన పంటగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో రుణమాఫీపై రెండు పార్టీలు వాగ్దానాలు చేశాయి. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం క్వింటాలు ధాన్యానికి రూ. 2,600ల కనీస మద్దతు ధర ఇవ్వగా దానికంటే ఐదు వందల రూపాయలు ఎక్కువ ఇస్తానని బీజేపీ ప్రకటించింది. గత రెండేండ్లుగా పెండింగులో ఉన్న ధాన్యం సేకరణ బోనస్‌ను కూడా చెల్లిస్తామంటోంది. కాంగ్రెస్‌ కూడా క్వింటాలు ధాన్యాన్ని రూ.3,200కు కొనుగోలు చేస్తానంటోంది. రాజస్థాన్‌లో స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు కనీస మద్దతు ధరను అమలు చేసేందుకు చట్టాన్ని తీసుకొస్తానని అధికార కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. బీజేపీ రైతుల పిల్లలకు ఉచిత విద్య కల్పిస్తామని, గోధు మలపై ఎంఎస్‌ పీ కంటే అదనంగా రూ.2,700 బోనస్‌ ఇస్తానని తెలిపింది. మధ్యప్రదేశ్‌లో క్వింటాలు గోధుమలకు రూ.2,700, ధాన్యానికి రూ. 3,100 ఎంఎస్‌పీ ఇస్తానని చెప్పింది. తెలంగాణ లోనూ మద్దతు ధరపై హామీ ఇచ్చింది. హామీలు ఇవ్వడం తప్పుకాదు. వ్యవసాయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్య తీవ్రత ఏ స్థాయిలో ఉందో రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలే నిదర్శనం. ఇప్పటి దాకా కేంద్రంలో పాలించిన పార్టీలు కానీ, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాషాయ ప్రభుత్వం గానీ రైతులు, వ్యవసాయ గురించి పట్టించుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నది స్పష్టం.
రుణమాఫీపైనా, ఉచితాలపైనా హేళనగా మాట్లాడిన బీజేపీ మ్యానిఫెస్టోల్లో చేర్చిన డిమాండ్లను అమలు చేస్తారనేది గ్యారంటీ ఉందా? కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కానీ, ఆయా రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు కానీ రైతులకు చేసింది శూన్యం. స్వామినాధన్‌ కమిటీ సిఫారసులను అమలు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పి 2014లో అధికారంలోకి వచ్చింది మోడీ ప్రభుత్వం. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న ప్రధాని రైతుకు ఇస్తానని ప్రకటించిన రైతు సాయంలోనే కోత పెట్టారు. ఈ కాలంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాలతో రైతు ఆదాయమే పడిపోయింది. కార్పొరేట్‌ కంపెనీలు ప్రభుత్వ బ్యాంకుల నుంచి తీసుకున్న రూ. 15.32 లక్షల కోట్ల రుణాలను రద్దు చేసిన మోడీ.. రైతుల రుణాలు మాఫీ చేయలేదు. విదేశీ కంపెనీలకు కావలసిన రీతిలో సకల సౌకర్యాలు కల్పిస్తున్న కేంద్రం.. అన్నదాతకు ఇచ్చిన డిమాండ్లను అమలు చేయడం లేదు. డిసెంబర్‌ 2021లో చేసుకున్న ఒప్పందాలను అమలు చేయాలని రైతు సంఘాలు పట్టు బట్టినా ఈ రోజు వరకు పట్టించుకోని మోడీ ప్రభుత్వం.. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ఇస్తామని చెప్పడమంటే మోడీ, ఆయన పార్టీ చెబుతున్న దాంట్లో వాస్తవం ఎంతుందో అర్థమవుతోంది. ఉచిత విద్యుత్‌ అవసరం లేదని వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలంటూ విద్యుత్‌ సంస్కరణలు తెచ్చి రాష్ట్రాలపై ఒత్తిడి చేస్తున్న మోడీ .. రైతుల కోసం ఏదో చేస్తారనుకోవడం భ్రమే అవుతుంది.

Spread the love