ఎన్నికల సిబ్బందికి శిక్షణాలు ఇవ్వాలి

– రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలి.రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్.
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్, ఇతర ఉన్నతాధికారులతో కలసి హైదరాబాద్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సోమవారం  జిల్లా ఎన్నికల అధికారులు, అదనపు కలెక్టర్ లతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన   మాట్లాడుతూ నియోజక వర్గాల వారీగా పోలింగ్ కేంద్రాల వివరాలు అలాగే బిఎల్వోలు  ఎప్పటికప్పుడు ఓటరు నమోదు  పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. నియోజక వర్గాల వారీగా పెండింగ్ లో ఉన్న 6,7,8 ఫారాలను పూర్తి చేయాలన్నారు. థర్డ్ జెండర్, మహిళలు, 18-19 ఏళ్ల ఓటర్ల నమోదు ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని అన్నారు. ప్రతి వారం పొలిటికల్ పార్టీ సమావేశాలను ఏర్పాటు చేయాలని సూచించారు. స్వీప్ కార్యక్రమాలకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితాలోని డూప్లికేట్ ఓటర్లను తొలగించాలని అలాగే ప్రతి రోజు ఓటర్ల జాబితాపై రిపోర్ట్ పొందుపరచాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎపిక్ కార్డులు 120436 అప్ లోడ్ కాగా ఇప్పటివరకు 120301 కార్డులు పంపిణీ జరుగుతున్నదని, ఎన్నికల నిర్వహణ ఏర్పాటుకు సిబ్బందిని సిద్ధం చేస్తున్నామని అలాగే తుది జాబితా తర్వాత వచ్చిన ఫామ్ 6,7,8 లు  మొత్తం 20980 అందాయని త్వరగా పరిశీలన చేస్తున్నామని తెలిపారు. స్వీప్ కార్యక్రమాల పై ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్లు అలాగే సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో  అదనపు కలెక్టర్ ఏ. వెంకట్ రెడ్డి, ఆర్.డి.ఓ లు కోదాడ సూర్యనారాయణ, సూర్యాపేట కృష్ణయ్య, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాస రాజు, ఆయా నియోజక వర్గాల  తహశీల్దార్లు, డి.టి.లు  తదితరులు పాల్గొన్నారు.
Spread the love