నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణలో ఈనెల 15వ తేదీలోపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందని భావించారు. కానీ, స్థానిక ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరోసారి కులగణన సర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సర్వేలో పాల్గొనని వారికి ఈనెల 16 నుంచి 28 వరకు అవకాశం కల్పించింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని స్పష్టం చేసింది. దీంతో రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందాకే ఎన్నికలు నిర్వహించే అవకాశముంది.
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన సామాజిక కులగణన సర్వేలో 1,03,889 మంది ఎన్యుమరేటర్లు పాల్గొన్నారు. 96.9శాతం (3.50 కోట్ల మంది) మంది సర్వేలో పాల్గొని వివరాలు అందించారు. 3.1శాతం (16లక్షల మంది) వివిధ కారణాల వల్ల వివరాలు అందించలేదు.