చేనేత సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలి

చేనేత సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలి– ధాన్యం కొనుగోళ్ల తరహాలో చేనేత వస్త్రాల కొనుగోళ్లు ఉండాలి
– చేనేతను నిర్వీర్యం చేసిన కేంద్రం : చేనేత సంఘం రాష్ట్ర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు శాంతికుమార్‌, మురళీధర్‌
నవతెలంగాణ -నల్లగొండ
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి, వాటిని బలోపేతం చేయాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వనం శాంతికుమార్‌, గంజి మురళీధర్‌ అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమరయ్య భవన్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి చూపిస్తున్న చేనేత రంగాన్ని కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వీర్యం చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాలు ప్రకటించకపోగా కాస్తో కూస్తో చేనేతకు ఉపయోగపడే హ్యాండ్లూమ్‌ బోర్డును, పవర్‌లూమ్‌ బోర్డును, మహాత్మాగాంధీ బున్కల్‌ యోజన పథకాన్ని రద్దు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత రంగంపై జీఎస్టీ విధించి మరింత ఇబ్బందులకు గురిచేసిందన్నారు. 2013 ఫిబ్రవరిలో జరిగిన సహకార సంఘాల ఎన్నికల ఐదు సంవత్సరాల కాలపరిమితి ముగిసినా.. ఎన్నికలు జరపకుండా పర్సనల్‌ ఇన్‌చార్జీలతో నెట్టుకొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నెలలకు ఒకసారి పర్సనల్‌ ఇన్‌చార్జీల నియామకాన్ని పొడిగించుకుంటూ ఇప్పటికి తొమ్మిది సార్లు పొడిగించడం వల్ల సహకార సంఘాలు నిర్వీర్యమైపోతున్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అన్ని సహకార సంఘాలకు బడ్జెట్లో నిధులు కేటా యించి సంఘాల బలోపేతానికి చర్యలు తీసుకో వాలని డిమాండ్‌ చేశారు.
సహకార సంఘాల, మాస్టర్‌ వీవర్స్‌ దగ్గర కోట్లాది రూపాయల విలువ కలిగిన వస్త్రాల నిల్వలు పేరుకుపోయా యని, మగ్గాలు నడపలేక చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తక్షణమే ధాన్యం కొనుగోలు కేంద్రాల తరహాలోనే చేనేత వస్త్రాల కొనుగోళ్లను ప్రభుత్వం చేపట్టాలని డిమాండ్‌ చేశారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన త్రిఫ్ట్‌ ఫండ్‌, చేనేత మిత్ర పథకాలకు నిధులు కేటాయించి షరతులు లేకుండా అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ కార్యాలయాలు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌, గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫారాలకు చేనేత వస్త్రాలు అందజేసి కార్మికులకు పని కల్పించి ఆదుకోవాలని కోరారు. చేనేత కార్మికులకు వర్క్‌ షెడ్‌తో కూడిన ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలన్నారు. చేనేత సహకార సంఘాలకు, చేనేత కార్మికుల బ్యాంకు రుణాలు మాఫీ చేసి వెంటనే 80 శాతం సబ్సిడీ ద్వారా రూ.2లక్షల రుణాలు ఇవ్వాలని కోరారు. చేనేత రంగ అభివృద్ధికి బడ్జెట్లో రూ.2000 కోట్లు కేటాయించి ఖర్చు చేయాలన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ పవర్‌లూమ్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, చేనేత కార్మిక సంఘం నాయకులు రాపోలు రాములు, రాపోలు వెంకన్న, కర్నాటి శ్రీరంగం, గడ్డం దశరథ, వలిగొండ మధు, బొల్లు రవీంద్ర కుమార్‌, శివ తదితరులు ఉన్నారు.

Spread the love