– డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు టీఎన్‌ఎస్ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మెడికల్ కౌన్సిల్ ఎన్నికలతో పాటే నర్సింగ్ కౌన్సిల్‌కు ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ నర్సింగ్ సమితి (టీఎన్‌ఎస్) డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం తెలంగాణ రాష్ట్ర మౌలిక సదుపాయాల సంస్థ చైర్మెన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ కు టీఎన్‌ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు కురుమేటి గోవర్థన్, అధ్యక్షులు ధనుంజరు వినతిపత్రం సమర్పించారు. 1964లో అమల్లోకి వచ్చిన నర్సుల చట్టం ప్రకారం…కౌన్సిల్‌కు ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ 52 ఏండ్లు గడిచినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల ద్వారా గెలిచిన అభ్యర్థులతో వృత్తిపరమైన సమస్యలు పరిష్కరించుకునే విధంగా విధివిధానాలను రూపొందించుకునే అవకాశముందని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు నిర్వహించలేదనీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఆ చట్టాన్ని ఎందుకు అమలు చేయడం లేదో అర్థం కావడం లేదని పేర్కొన్నారు.
హెచ్‌ఆర్‌సీ ఆదేశాలను ధిక్కరిస్తున్న అధికారులు
నర్సింగ్ కౌన్సిల్‌కు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆదేశాలిచ్చినా అధికారులు వాటిని ధిక్కరిస్తున్నారని వారు ఈ సందర్భంగా తెలిపారు. ఈ నెల 22న తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌కు ఎన్నికలు జరపాలంటూ హెచ్‌ఆర్‌సీ ఆదేశించిందని గుర్తుచేశారు. నర్సింగ్ కౌన్సిల్‌కు ఎన్నికలు నిర్వహించేందుకు మాత్రం ఆదేశాలెందుకివ్వలేదని ప్రశ్నించారు.