ఫ్రాన్స్‌ ప్రధాని పదవికి ఎలీసబెత్‌ బోర్నే రాజీనామా

నవతెలంగాణ – పారిస్‌ : నూతన ఇమ్మిగ్రేషన్‌ చట్టంపై నెలకొన్న రాజకీయ గందరగోళం మధ్య ఫ్రెంచ్‌ ప్రధాని ఎలీసబెత్‌ బోర్న్‌ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. కొత్త ప్రధానిని నియమించాలన్న ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మాక్రాన్‌ ఆకాంక్షను పేర్కొంటూ.. ఆయన అభ్యర్థన మేరకు రాజీనామా చేసినట్లు బోర్నే ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ రాజీనామాతో రానున్న రోజుల్లో కొత్త ప్రభుత్వాన్ని నియమించడానికి మాక్రాన్‌కి మార్గం సుగమమైంది. మాక్రాన్‌ రెండవసారి తిరిగి అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత 2022 మేలో బోర్నే ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. నియమితులయ్యారు. ఆమె ఫ్రాన్స్‌ రెండవ మహిళా ప్రధాని. బోర్నే రాజీనామాను ఆమోదించినట్లు మాక్రాన్‌ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు బోర్నే తన విధుల్లో కొనసాగుతారని ఆప్రకటన పేర్కొంది. మాక్రాన్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద వలస వ్యతిరేక చట్ట సవరణ బిల్లుకి పార్లమెంటు గతేడాది డిసెంబర్‌లో ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఇతర చర్యలతో పాటు కొంతమంది విదేశీయులను బహిష్కరించే ప్రభుత్వ సామర్థ్యాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా మాక్రాన్‌ ప్రభుత్వం ఈ వివాదాస్పద బిల్లుని ఆమోదించింది. పార్లమెంట్‌ దిగువ సభలో ఈ బిల్లుకి అనుకూలంగా 349, వ్యతిరేకంగా 186 ఓట్లు వచ్చాయి. దిగువ సభలో సాధారణ మెజారిటీ లేని మాక్రాన్‌ ప్రభుత్వం పునరుజ్జీవనోద్యమ పార్టీ, మితవాద లా రిపబ్లికన్‌లతో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో మాక్రాన్‌ సొంత పార్టీ నుండి వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ చర్య భవిష్యత్తులో ముఖ్యమైన బిల్లులను ఆమోదించడంలో బోర్నే ప్రభుత్వ సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తాయి.  అలాగే గతేడాది పెన్షన్‌ మార్పులతో బోర్నె దేశవ్యాప్తంగా నిరసనలను ఎదుర్కొన్నారు. పదవీ విరమణ వయస్సును 62 నుండి 64 ఏళ్లకు పెంచే బిల్లు ఏప్రిల్‌లో చట్టరూపం దాల్చడంతో దేశవ్యాప్తంగా పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో  ఓ టీనేజ్‌పై పోలీసుల కాల్పుల కారణంగా చెలరేగిన ఆందోళనలను కూడా ఎదుర్కోవలసి వచ్చింది.

Spread the love