అంతుచిక్కని ఓటరు నాడి

Elusive voter nerve– లెక్కలమీద లెక్కలు…అయోమయంలో నేతలు
– సామాజిక తరగతుల వారీగా ఓటింగ్‌పై కసరత్తు
– బీఆర్‌ఎస్‌ ఓటు ముంచేదెవరినో?
– ఇంటలిజెన్స్‌ వర్గాలకు మిస్టరీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఇన్నిరోజులు ప్రచారపర్వంలో మునిగితేలిన నేతలు ఇప్పుడు గెలుపోటముల అవకాశాలపై లెక్కలేసుకుంటున్నారు. లెక్కల మీద లెక్కలేసుకుంటున్నా అంతుచిక్కని ఓటరు నాడితో నేతలు అయోమయంలో పడ్డారు. తేల్చుకోలేక సతమతం అవుతున్నారు. సైలెంట్‌ ఓటింగ్‌ ఎవరి కొంపముంచుతుందో అన్న భయాందోళనలకు గురవుతున్నారు. కేసీఆర్‌ బస్సు యాత్రతో జనాల కదలికను బట్టి బీఆర్‌ఎస్‌ కూడా రంగంలో ఉన్నదన్న సంకేతం బలంగా వెళ్లింది. ఏమైందో ఏమోగానీ చివరి రెండు రోజుల్లో కథంతా మారిపోయింది. ఇప్పుడు చాలా నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌కు సొంత పార్టీ క్యాడర్‌ కూడా ఓటెయ్యలేదనే చర్చ నడుస్తున్నది. బీఆర్‌ఎస్‌ నుంచి బదిలీ అయిన ఓటు తమ కొంప ఎక్కడ ముంచుతుందో అన్న హైరానాకు కాంగ్రెస్‌, బీజేపీ నేతలు గురవుతున్నారు. ఏడెనిమిది నియోజకవర్గాల్లో ఓటింగ్‌ ఒన్‌సైడ్‌ జరిగి గెలుపోటములు ఎవరిదనే అంచనాకు ఇంటలిజెన్స్‌ నిఘా వర్గాలు వచ్చాయి. కానీ, మిగతా వాటిలో ఏంటనేది తేల్చడం కష్టంగా మారింది. గెలుపోటములు నిర్ణయించే మార్జిన్‌ ఐదు శాతం లోపే ఉండటంతో స్వింగ్‌ ఓటు ఎటువైపు మరలిందనేది తేలటం లేదు. ఎవరి వైపు మొగ్గు చూపారో చెప్పడానికి ఓటర్లు కూడా ఇష్టపడట్లేదు. దీంతో నియోజకవర్గాల్లో ఓటింగ్‌ సరళి ఏంటి? ఏయే ప్రాంతాల్లో ఎక్కువ పోలింగ్‌ నమోదైంది? అక్కడి స్థానిక పరిస్థితులు ఎవరికి అనుకూలంగా ఉన్నాయి? సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎవరి వైపు ఓటర్లు మొగ్గు చూపారు? అనే దానిపై ఆయా వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఇంటలిజెన్స్‌ అధికారులకు కూడా ఓటరు నాడి అంతుచిక్కడం లేదు. ఓటర్లకు తెలియకుండానే వారు ఎవరివైపు మొగ్గుచూపారనే దాన్ని రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజలు పిచ్చాపాటి మాట్లాడుకోవడంపైనా దృష్టిపెట్టారు. ‘రాష్ట్రంలో పోలింగ్‌ సరళిని బట్టి చూస్తే తొమ్మిది నియోజకవర్గాల్లో నెక్‌ టూ నెక్‌ ఎన్నికలు జరిగాయి. ఆ నియోజకవర్గాల్లో పోటీ హోరాహోరిగా ఉంది. ఎవరు గెలిచినా తక్కువ మెజార్టీతో గెలిచే అవకాశముంది. ఈ విషయం ఉన్నతాధికారులకు చెబితే అస్సలు ఒప్పుకోవడం లేదు. ఈ విషయం అందరూ చెబుతారు. ఎవరికి గెలుపు అవకాశాలున్నాయనే విషయంపై కచ్చితత్వంతో తెలుపండి అంటూ వారు ఆదేశాలు జారీ చేశారు. దీంతో మంగళవారం ఓ రౌండ్‌ తిరిగాం. అయినా, ఓ నిర్ధారణకు రాలేకపోయాం. ఈ రోజు మరోసారి నియోజవర్గం మొత్తం మళ్లీ ఆరా తీస్తున్నాం’ అని ఓ ఇంటలిజెన్స్‌ అధికారి చెప్పడం కొసమెరుపు. వారంతా హోటళ్లు, పార్కులు, ఆయా ప్రాంతాల్లోని చౌరస్తాల్లో యువత నుంచి పండు ముసలి వరకు కనిపించిన వారినల్లా ఓటు ఎవరికి వేశారనే అంశంపై ఆరా తీస్తున్నారు.
బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులు కూడా ఓటింగ్‌ సరళిపై పోలింగ్‌ కేంద్రాల వారీగా సమీక్షించుకుంటున్నారు. ఆ పోలింగ్‌ కేంద్రంలో ఎన్ని ఓట్లు పోలయ్యాయి? ఎవరెవరు ఓటేశారు? ఆ ఓటు ఎక్కడ పడే అవకాశముంది? యువత ఏమనుకుంటున్నారు? గ్రామాలు, పట్టణాల్లోని తమ సామాజిక తరగతి వారు ఓటు వేశారా? లేదా? ఏయే అంశాల్లో వెనుకబడ్డాం?’ ఇలా అన్ని అంశాలపై గ్రామం, బూతు వారీగా నేతలను పిలిపించుకుని అభ్యర్థులు లెక్కలు తీస్తున్నారు. చాలా చోట్ల బీఆర్‌ఎస్‌ ఓటింగ్‌ తమ వైపు మొగ్గుచూపిందనీ, జాతీయ అంశాలు, దేశభద్రత, మోడీ హవాతో తమ పార్టీకి అధిక సీట్లు వస్తాయని బీజేపీ అభ్యర్థులు ఆశల్లో తేలియాడుతున్నారు. గ్రేటర్‌లో పోలింగ్‌ శాతం గత ఎన్నికలతో పోలిస్తే పెరిగినప్పటికీ అంతిమంగా ఇంచుమించు 50 శాతం వరకే నమోదు కావడం వారిని కలవర పెడుతున్నది. మొన్నటి ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ వైపు మొగ్గుచూపిన ఏపీ సెటిలర్లు తమ సొంత రాష్ట్రంలో ఓటు వేయడానికి వెళ్లటం, రుణమాఫీ ఆగస్టు 15న చేస్తామనే ప్రకటన, పంట నష్టం డబ్బులు పోలింగ్‌ ముందు రైతుల ఖాతాల్లో వేయడం, వంద రోజుల అభివృద్ధి కార్యక్రమాల అమలు లాంటి అంశాలు తమకు పెద్ద ఎత్తున లాభించబోతున్నాయని కాంగ్రెస్‌ నేతలు ధీమాతో ఉన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా గత ఎన్నికల కంటే పెరిగిన పోలింగ్‌ శాతం కాంగ్రెస్‌ వ్యతిరేక ఓటు బ్యాంకు అనీ, అది తమ వైపు నిలిచిందని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. కాదు..కాదు…తమ పార్టీ ఎమ్మెల్యేలు ఛాలెంజ్‌గా తీసుకుని ఓటర్లను పోలింగ్‌ బూత్‌ వరకు రప్పించడంలో విజయవంతం అయ్యారనీ, ఆ ఓటింగ్‌ తమకు అనుకూలంగా పడ్డదనే ధీమాలో కాంగ్రెస్‌ అభ్యర్థులున్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థులు లెక్కల మీద లెక్కలేసుకుంటూ నెత్తులు పీక్కుకుంటున్నా..అంతిమ ఫలితం కోసం జూన్‌ నాలుగో తేదీ వరకు వేచిచూడాల్సిందే. అప్పటి వరకూ ఈ టెన్షన్‌ పడాల్సిందే. పోలింగ్‌కు, ఫలితాల తేదీకి మధ్య ఇంత వ్యవధి ఉండటంతో ప్రజలు కూడా రిజల్ట్‌ కోసం ఇన్ని రోజులు వేచి చూడాలా? అంటున్నారు.

Spread the love