– పరేడ్ గ్రౌండ్‌లో ఉత్సవాలను అడ్డుకునే కుట్ర
– 17న అమిత్ షా రాక, మూడు రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం : జి.కిషన్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాలను నిర్వహించాలని నిర్ణయిస్తే దాన్ని అడ్డుకునేలా కాంగ్రెస్ కుట్ర పన్నుతున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పరేడ్ గ్రౌండ్ వేడుకలకు ముఖ్య అతిథిగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా హాజరవుతారనీ, తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర సీఎంలకు కూడా ఆహ్వానం పంపామని తెలిపారు. ఓవైసీ అనుమతి ఉంటేనే సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 17 కార్యక్రమానికి హాజరవుతారని విమర్శించారు. హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయానికీ, విమోచన దినోత్సవానికి అవినాభావ సంబంధం ఉందన్నారు. మన పూర్వీకుల త్యాగాలను స్మరించుకునేలా జాతీయ జెండాను ఎగురవేసి విమోచన ఉత్సవాలు నిర్వహించాలని రాష్ట్రంలోని సర్పంచులందరికీ లేఖలు రాస్తున్నానని చెప్పారు. విమోచన దినోత్సవం ముస్లింలకు వ్యతిరేకమంటూ కొందరు అసత్య ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. నిజాం పాలనలో ముస్లింలపై కూడా అనేక అరాచకాలు జరిగాయనీ, షోయబుల్లా ఖాన్, తుర్రేబాజ్ ఖాన్, అల్లావుద్దీన్, లాంటి వారిని కిరాతకంగా చంపారని గుర్తు చేశారు. హైదరాబాద్ స్వతంత్య్ర పోరాటాన్ని, చరిత్రను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తొక్కిపెట్టిందని విమర్శించారు.