నవతెలంగాణ – జ్యూరిచ్ : 84 ఏళ్ల తర్వాత స్విట్జర్లాండ్‌లో మళ్లీ కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించింది. రివల్యూషనరీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ స్విట్జర్లాండ్ పేరుతో బెర్న్‌లోని బర్గ్‌డోర్ఫ్‌లో నిర్వహించిన 342 మంది ప్రతినిధుల సమావేశంలో స్థాపించబడింది. డెర్సు హేరి కార్యదర్శిగా ఎన్నికయ్యారు. సామ్రాజ్యవాద యుద్ధం, ద్రవ్యోల్బణం, వాతావరణ సంక్షోభం, పాలస్తీనా సమస్య ఈ సదస్సులో ప్రధాన అంశాలుగా ఉన్నాయి. స్విస్ యూనివర్సిటీల్లో జరుగుతున్న పాలస్తీనా అనుకూల నిరసనలకు పూర్తి మద్దతు ఇవ్వాలని, నిరసనలను మరింత ఉధఅతం చేయాలని ఆర్కేపీ నిర్ణయించింది. పాలస్తీనాకు అనుకూలంగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఉద్యమాలకు సహకరించే లక్ష్యంతో పార్టీ తదుపరి సదస్సును జూన్ 10 నుంచి 15 వరకు నిర్వహించాలని కూడా సమావేశం నిర్ణయించింది. కాగా, 1921లో స్విట్జర్లాండ్‌లో తొలిసారిగా కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. ఆ సమయంలో పార్టీలో దాదాపు 6 వేల మంది సభ్యులు ఉన్నారు. 1940లో స్విస్ ప్రభుత్వం పార్టీని నిషేధించడంతో పాటు రద్దు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసినందుకే ఈ చర్య తీసుకున్నారని, పార్టీ భావజాలం వల్ల కాదని ఫెడరల్ కోర్టు ఆ తర్వాత తీర్పునిచ్చింది. కమ్యూనిస్ట్ పార్టీలోని చాలా మంది సభ్యులు సోషల్ డెమోక్రటిక్ పార్టీతో కలిసి పనిచేశారు. 1945లో ప్రభుత్వం సంస్థలపై నిషేధాన్ని ఎత్తివేసింది. ఎస్పితో విలీన చర్చలు విఫలమవడంతో, 1944లో వర్కర్స్ పార్టీలో కమ్యూనిస్టుల కొత్త సామూహిక ఉద్యమం ఉద్భవించింది.