ఎమర్జెన్సీ అలర్ట్‌

నవతెలంగాణ – హైదరాబాద్:  దేశవ్యాప్తంగా కొంతమంది మొబైల్‌ యూజర్లకు ఈ రోజు మధ్యాహ్నం ఓ ‘ఎమర్జెన్సీ అలర్ట్‌ ’ సందేశం వచ్చింది. ‘తీవ్ర పరిస్థితి’ అన్న అర్థంతో ఆ ఫ్లాష్‌ మెసేజ్‌ ఉంది. దీంతో అది ఎక్కడి నుంచి వచ్చిందో.. ఎందుకు వచ్చిందో తెలియక వారంతా గందరగోళానికి గురయ్యారు. అయితే, దీనికి కంగారు పడాల్సిన అవసరం లేదు..! దాన్ని కేంద్ర ప్రభుత్వమే పంపిందట. అందులో భయపడాల్సేందేమీ లేదు. ఎమర్జెన్సీ అలర్ట్‌ సిస్టమ్‌ టెస్టింగ్‌లో భాగంగా ఈ మెసేజ్‌ వస్తోంది. ఇప్పటికే పలుమార్లు పలు ప్రాంతాల ప్రజలకు ఇలాంటి మెసేజ్‌లు రాగా.. తాజాగా మరోసారి ఈ సందేశం వచ్చింది.
‘Emergency alert: Severe’ పేరుతో వచ్చిన ఈ సందేశంలో.. ‘‘టెలికమ్యూనికేషన్‌ విభాగానికి  చెందిన సెల్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ పంపించిన నమూనా టెస్టింగ్‌ మెసేజ్‌ ఇది. దీన్ని పట్టించుకోకండి. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ రూపొందించిన పాన్‌-ఇండియా ఎమర్జెన్సీ అలర్ట్‌ సిస్టమ్‌ను పరీక్షించేందుకు ఈ మెసేజ్‌ను పంపించాం. విపత్కర పరిస్థితుల్లో ప్రజలను హెచ్చరించేందుకు ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రజా భద్రతను మరింత మెరుగుపరుస్తుంది’’ అని రాసి ఉంది. తమ ఫోన్లకు వచ్చిన ఈ ఫ్లాష్‌ మెసేజ్‌ను కొంతమంది యూజర్లు నెట్టింట పోస్ట్‌ చేస్తున్నారు.

Spread the love