– పొరపాటు దొర్లితే సరిదిద్దుకోవాలి
– ఉద్దేశపూర్వకంగా తప్పు చేస్తే సస్పెండ్ చేస్తాం : పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆన్‌లైన్ గ్రీవెన్స్‌లో మంత్రి సీతక్క
– ఉద్యోగుల సమస్యలను శ్రద్ధగా విన్న ఉన్నతాధికారులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలోని అధికారుల సర్వీసు సమస్యలు, పెండింగ్ ఫైల్స్‌ను వీలైనంత త్వరలో పరిష్కరిస్తామని ఆ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ(సీతక్క) హామీనిచ్చారు. విధి నిర్వహణలో పొరపాట్లు దొర్లితే సరిదిద్దుకోవాలని సూచించారు. ఉద్దేశపూర్వకంగా తప్పు చేసి ప్రభుత్వం మీద రుద్దాలని చూస్తే సస్పెండ్ చేస్తామనీ, అవసరమైతే సర్వీసు నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. శుక్రవారం ఆన్‌లైన్‌లో మంత్రి సీతక్క పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో గ్రీవెన్స్‌డే నిర్వహించారు. సచివాలయం నుంచి సమావేశానికి హాజరు కావల్సి వున్నా.. ములుగులో గవర్నర్ పర్యటన నేపథ్యంలో ప్రయాణంలోనే ఆన్‌లైన్ ద్వారా రెండు గంటల పాటు ఉద్యోగుల సమస్యలను మంత్రి విన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..పీఆర్‌ఆర్‌డీ శాఖలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి వినూత్న పద్ధతిని అవలంబిస్తున్నామన్నారు. శాఖ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలు తక్షణం తీసుకుంటామనీ, మంత్రివర్గం, పై స్థాయిలో పరిష్కారం కావాల్సిన సమస్యలను నివేదించి పరిష్కారానికి కృషిచేస్తామని హామీనిచ్చారు. ఉద్యోగుల సర్వీస్ మ్యాటర్, సమస్యల ఫైళ్లను పెండింగ్‌లో పెట్టొద్దని ఉన్నతాధికారులను ఆదేశించారు. కొందరు అధికారులు అనాలోచితంగా వ్యవహరించడాన్ని తప్పుబట్టారు. మంచిర్యాలలో పింఛన్ కట్ చేయడం సరిగాదన్నారు. విచక్షణ మానవత్వం లేకుండా కొందరు సిబ్బంది పనిచేయడాన్ని తప్పుబట్టారు. ఇష్టమొచ్చినట్టు నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వం మీద రుద్దితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమస్యలను మంత్రికి, ఉన్నతాధికారులకు నివేదించిన వారిలో పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఎంపీడీఓలు, డీపీఓలు, ఇంజినీర్లు, డీఆర్డీఓలు, అన్ని స్ధాయిల అధికారులున్నారు. ఆన్‌లైన్ గ్రీవెన్స్‌లో సీతక్కతో పాటు ఆ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, డైరెక్టర్ సృజన, ఈఎన్సీలు కృపాకర్ రెడ్డి, కనకరత్నం ఉన్నారు.