‘ఉపాధి’ పరిరక్షణపై మ్యానిఫెస్టోల్లో చేర్చాలి’

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని పరిరక్షిస్తామనీ, బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయిస్తామని అన్ని రాజకీయ పార్టీలూ వచ్చే ఎన్నికల సందర్భంగా తమ మ్యానిఫెస్టోల్లో చేర్చాలని దళిత బహుజన ఫ్రంట్‌ జాతీయ కార్యదర్శి పి.శంకర్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఢిల్లీలోని రాజారామ్మోహన్‌రారు హాల్‌లో నరేగా సంఘర్ష్‌ మోర్చా జాతీయ మొదటి మహాసభలు ప్రారంభమ య్యాయి. పి.శంకర్‌ మాట్లాడుతూ..అఖిల భారత వ్యకాస, ఐఎఫ్‌టీయూ, ఏఐటీయూసీ, అమొజన్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఉపాధి హామీల పోరాటానికి మద్దతు ప్రకటించాయని తెలిపారు.ఎన్‌ఎంఎంఎస్‌ను రద్దు చేయాలనీ, ఆధార్‌ సీడింగ్‌ పేరుతో వేతనాల జాప్యాన్ని నివారించాలనీ, నిధులను పెంచాలని, పట్టణ పేదలకు ఉపాధి హామీ పనులు కల్పించాలని మహాసభ డిమాండ్‌ చేసిందని చెప్పారు. ఉపాధి చట్టాన్ని ఎత్తివేసేందుకు మోడీ సర్కారు కుట్ర చేస్తున్నదని విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌లో నిధులు తగ్గిస్తూ, కూలీలకు పనులు చూపకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ఆన్‌లైన్‌ హాజరు, అధార్‌ సీడింగ్‌, పనులను డ్రోన్‌ కెమెరాలతో నిఘా పెడుతూ ఉపాధి హామీ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నదన్నారు. ఆలస్య వేతనాలకు నష్ట పరిహారం, పనులు చూపకపొతే నిరుద్యోగభృతి చెల్లించడం లేదన్నారు. తెలంగాణలో ఐదు లక్షల కూలీల కుటుంబాల జాబ్‌కార్డులను ఆటోమెటిక్‌గా తొలగించడం ఉపాధి హామీ చట్టాన్ని ఉల్లంఘించడమేన్నారు. అవినీతిని ఆరికట్టేందుకు సామాజిక తనిఖీలు చేపట్టడం లేదన్నారు. 200 రోజుల పనిదినాలు, రోజుకు రూ.800 వేతనం, పనిప్రదేశాల్లో హక్కుగా కనీస సౌకర్యాల ఏర్పాటు హామీలను మ్యానిఫెస్టోల్లో పెట్టాలన్నారు. ఉపాధి హామీ చట్ట పరిరక్షణ చాప్టర్‌ను అన్ని రాజకీయ పార్టీలకూ అందజేస్తామని తెలిపారు. సభలో డీబీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శులు దాసరి ఎగొండ స్వామి, పులి కల్పన, చుంచు రాజేందర్‌, తదితరులు పాల్గొన్నారని తెలిపారు.

 

Spread the love