– ఇద్దరు ఉగ్రవాదులు హతం
నవతెలంగాణ- శ్రీనగర్: కశ్మీర్‌లోని కుల్గామ్‌లో భారత బలగాలకు ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. ఒకపక్క రాజౌరీ జిల్లాలో 48 గంటలుగా ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతుండగానే కుల్గామ్‌లోని కుజ్జర్ ప్రాంతంలో ఉగ్రవాదుల అలజడిపై పక్కా సమాచారంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగారు. కార్డాన్ సెర్చ్‌లో భాగంగా కుల్గామ్‌లో ఉగ్రవాదుల కోసం గాలిస్తుండగా ఉన్నట్టుండి మాపై కాల్పులు జరపగా వెంటనే అప్రమత్తమై ఎదురు కాల్పులు జరిపామని ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారని వారి మృతదేహాలను కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపాయి కశ్మీర్ పోలీస్ వర్గాలు. ఇదిలా ఉండగా రాజౌరీ జిల్లాలోని కలకోట్ అటవీప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారం అందడంతో భారత బలగాలు కార్డన్ సెర్చ్ మొదలుపెట్టాయి. ఈ సెర్చ్ ఆపరేషన్ ఇప్పటికే మూడోరోజుకు చేరుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు పారా కమాండోలతో పాటు మరో ముగ్గురు సైనికులకు గాయపడ్డారు. దీంతో భారత భద్రతా బలగాలు అప్రమత్తమై ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు..