– ఖనిజ సంపదపై కేంద్రం కుట్ర : పౌర హక్కుల సంఘం నేత, ప్రొఫెసర్ జి.హరగోపాల్
నవతెలంగాణ-హిమాయత్ నగర్
ఆదివాసీలను అడవి నుంచి దూరం చేసేందుకే కేంద్రం బూటకపు ఎన్‌కౌంటర్లు చేస్తున్నదని పౌర హక్కుల సంఘం నేత, ప్రొఫెసర్ జి.హరగోపాల్ అన్నారు. ప్రకృతిని దోపిడీ చేసి, ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్ బస్తర్‌లో జరుగుతున్న ఎన్‌కౌంటర్లపై హైదరాబాద్ హైదర్‌గూడలోని ఎన్‌ఎస్‌ఎస్‌లో శుక్రవారం ప్రజా సంఘాలు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఆపరేషన్ కగార్ పేరిట బూటకపు ఎన్‌కౌంటర్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీలకు భూమిపై హక్కును రాజ్యాంగం కల్పించిందని, ఆ హక్కును కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్‌గఢ్ బీజేపీ ప్రభుత్వం కాలరాస్తున్నాయని విమర్శించారు. మావోయిస్టు రహిత దేశంగా మారుస్తామని కేంద్ర హౌంశాఖ మంత్రి అమిత్‌షా మాట్లాడుతున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి విఘాతమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలతో చర్చలు జరపాలని, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని సూచించారు. ఇప్పటివరకు జరిగిన ఎన్‌కౌంటర్లు అన్నీ ప్రభుత్వ హత్యలేనని, ఆపరేషన్ కగార్ హత్యాకాండను వెంటనే నిలిపివేసి చర్చలు జరపాలని కోరారు. ఆదివాసీ ప్రజలకు సంఘీభావంగా పౌర సమాజం అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నారాయణరావు, పీయూసీఎల్ అధ్యక్షులు బాలకిషన్ రావు, ప్రధాన కార్యదర్శి జయ వింధ్యాల తదితరులు పాల్గొన్నారు.