– ఆగస్టు 3వ తేదీ లోగా పేర్లు నమోదు చేసుకోవాలి
– గోడ ప్రతుల ఆవిష్కరణ
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన ఆవిష్కరణలకు (ఇన్నోవేషన్స్) కు ప్రోత్సాహం అందిస్తుందని ఇన్నోవేషన్ సెల్ కోఆర్డినేటర్ సందీప్ రాజ్ అన్నారు. నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని మండల కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.అందులో భాగంగానే కమ్మర్ పల్లిలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. మండల పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఇన్నోవేషన్స్ పై అవగాహన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఇన్నోవేషన్ సెల్ కోఆర్డినేటర్ సందీప్ రాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు రైతులకు విద్యార్థులకు ఉపయోగపడే నూతన ఆవిష్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించడమే లక్ష్యంగా ఇన్నోవేషన్ సెల్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఇందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా నలుమూలల్లో ఉన్న అన్ని గ్రామాల ప్రజలకు ఈ కార్యక్రమం పై పంచాయితీ కార్యదర్శులు మిగతా అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా సిరిసిల్లలో నేత కార్మికులకు ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు మల్లేష్ అనే వ్యక్తి “ఆసు యంత్రాన్ని” కనిపెట్టాడని దానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం ఇచ్చి పేటెంట్ సైతం ఇప్పించిందని గుర్తు చేశారు. అదేవిధంగా మల్లేష్ కనిపెట్టిన ఆసు యంత్రానికి జాతీయ వ్యాప్తంగా గుర్తింపు ఇవ్వడంతో పాటు ఇప్పుడు అతను దేశంలోని ప్రముఖ సూక్ష్మ తరహా పారిశ్రామికవేత్తలలో ఒకరుగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందించిందన్నారు. రైతులకు రాత్రిపూట పాములు, ఇతర కీటకాలతో ఏర్పడే ఇబ్బందులను అధిగమించేందుకు విద్యార్థులు ప్లాస్టిక్ పైపుతో ఒక ఆవిష్కరణను ఏర్పాటు చేశారని ప్లాస్టిక్ పైపులో ఒక వైబ్రేటర్, మరో లైటు చిన్న బ్యాటరీతో ఈ ఆవిష్కరణ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
దీనిని రాత్రి పూట ఉపయోగించడం వల్ల పొలం గట్లపై వైబ్రేషన్ ఏర్పడి పాములు తేళ్లు ఇతర కీటకాలు రైతులకు కాటు వేయకుండా ఉంటాయని అదేవిధంగా వెలుతురు ఉండడం వల్ల రైతు ప్రయాణం సులభంగా సాగుతుందని గుర్తు చేశారు. ఇలాంటి ఆవిష్కరణలు ఏది ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని ఇందుకు ఈ ఆగస్టు మూడవ తేదీ లోపు తమ పేర్లు ఎంపీడీవో కార్యాలయంలో నమోదు చేసుకోవాలని సూచించారు. దీనికోసం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం వెబ్ పోర్టల్ ను ఏర్పాటు చేసిందని, అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాలలో సంబంధిత వాల్ పేపర్స్ ఏర్పాటు చేసేలా పంచాయతీ కార్యదర్శులకు గోడ ప్రతులు పంపిణీ చేస్తున్నామన్నారు. ఇందులో ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే అప్లికేషన్ వస్తుందని తెలిపారు. ఈ అప్లికేషన్ లో గ్రామస్తులు కనిపెట్టిన ఆవిష్కరణ యొక్క ఫోటోలు రెండు నిమిషాల వీడియోను అప్లోడ్ చేయవచ్చని, తద్వారా వారిని ఆగస్టు 15వ తేదీన జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రత్యేక ప్రదర్శన శిబిరానికి ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. అందులో పాల్గొని ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఆవిష్కరణలకు రాష్ట్రస్థాయికి పంపడం జరుగుతుందని, అక్కడ కూడా ఎంపిక అయితే వారికి పేటెంట్ ఇప్పించడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం రుణ సదుపాయం కల్పించి ప్రోత్సాహాన్ని అందిస్తుందని అన్నారు. అన్ని స్థాయిల అధికారులు గ్రామాల్లో ఉన్న ఇన్నోవేటర్స్ ను గుర్తించి స్టార్టప్ లను, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలని, పూర్తి వివరాలకు ఎంపీడీవో ద్వారా తమ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ సిబ్బందిని సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజ శ్రీనివాస్, మండల తహసిల్దార్ ఆంజనేయులు, మండల పంచాయతీ అధికారి సదాశివ్, మండల పరిషత్ కార్యాలయ సూపరిండెండెంట్, ఏపీఎం కుంట గంగాధర్, పంచాయతీ కార్యదర్శులు, ఐకెపి సిబ్బంది, ఉపాధి హామీ, వ్యవసాయ శాఖ, తదితర శాఖల సిబ్బంది పాల్గొన్నారు.