కులవృత్తులకు ప్రోత్సాహం

Encouragement to caste workers– గీత కార్మికుల భద్రతకు కాటమయ్య రక్షణ కవచం
– తాటి, ఈత వనాలు పెంచేందుకు ప్రణాళికలు
– ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వేగవంతం చేస్తాం
– స్కిల్‌ యూనివర్సిటీల ఏర్పాటు
– ప్రపంచ పర్యాటక కేంద్రంగా రంగారెడ్డి జిల్లా
– హయత్‌నగర్‌ వరకు మెట్రో
– ఓడిపోయి ఫామ్‌హౌజ్‌లో ఉన్నవారు రాష్ట్రానికి చేసిందేమీ లేదు : ‘కాటమయ్య రక్షణ కవచం’ పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
‘గౌడన్నల కులవృత్తిని కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. కులవృత్తులపై ఆధారపడిన సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా.. మీ పిల్లలను ఉన్నత చదువులు చదివించండి.. వాళ్లను ఉన్నతాధికారులుగా తీర్చిదిద్దండి. రాష్ట్ర పునర్నిర్మాణంలో వారు భాగస్వాములు కావాలి. చట్టాలు రూపొందించే స్థాయికి మీ పిల్లలు ఎదగాలి. బలహీన వర్గాలు పాలకులుగా మారాలంటే చదువే ఏకైక మార్గం’ అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. గీత కార్మికుల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘కాటమయ్య రక్షణ కవచం’ అందిస్తుందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ పరిధిలోని లష్కర్‌గూడలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ‘కాటమయ్య రక్షణ కవచం’ పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం ప్రారంభించారు. సేఫ్టీ కిట్స్‌తో తాటి చెట్లు ఎక్కిన గీత కార్మికులతో సీఎం ముచ్చటించారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కాటమయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు.
పౌరుషానికి, పోరాటానికి మారుపేరు గౌడన్నలని, సర్వాయి పాపన్న, ధర్మభిక్షం లాంటి మహా నాయకులు మనకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఎవరెస్టు ఎక్కిన వారి అనుభవంతో రక్షణ కవచం కిట్లు తయారీ చేయించామని తెలిపారు. బలహీన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్‌ పార్టీ కృషి చేస్తోందని చెప్పారు. వైఎస్‌ఆర్‌ హయాంలో బలహీన వర్గాల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తీసుకొచ్చారని, దాన్ని మళ్లీ పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వ భూముల్లో తాటి, ఈత చెట్లు పెంచేలా చర్యలు చేపట్టేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. రాష్ట్రంలో వన మహౌత్సవంలో భాగంగా తాటి, ఈత చెట్ల పెంపకం చేపట్టాలని మంత్రి జూపల్లికి సూచించారు. చెరువు గట్లపై కూడా మొక్కలు నాటేలా ఇరిగేషన్‌ విభాగంతో మాట్లాడాలని మంత్రి శ్రీధర్‌ బాబుకు తెలిపారు. ఔటర్‌ రింగ్‌ రోడ్‌, ఫార్మా ఇండిస్టీ, అంతర్జాతీయ ఎయిర్‌ పోర్ట్‌ తెచ్చింది కాంగ్రెస్‌ కాదా..? ఎవరు తెచ్చారో ఓడిపోయి ఫౌమ్‌హౌస్‌లో ఉన్నోళ్లు సమాధానం చెప్పాలని అన్నారు. వారు తెచ్చిందల్లా రాష్ట్రానికి డ్రగ్స్‌, గంజాయి తప్పా ఏమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్‌ పని అయిపోయిందని అన్నవాళ్లే.. ఇప్పుడు వాళ్ల వైపు ఎంతమంది ఉన్నారో లెక్కపెట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారు. తెలంగాణ అభివృద్ధిలో భాగంగా కాంగ్రెస్‌కు మద్దతుగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వస్తున్నారని, మీరు ప్రభుత్వాన్ని పడగొడతామంటే ప్రభుత్వాన్ని నిలబెట్టాలని వాళ్లు వస్తున్నారని స్పష్టం చేశారు. పదేండ్లపాటు రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ పాలకులు తెలంగాణను అప్పులకుప్పగా మార్చారన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ ముందుకెళ్తోందన్నారు. త్వరలోనే హయత్‌నగర్‌కు మెట్రో రాబోతుందని, ఇందుకు సంబంధించి అన్ని ప్రణాళికలు పూర్తయ్యాయని ప్రకటించారు. ఫార్మా కంపెనీల కోసం సేకరించిన భూమిలో వివిధ యూనివర్సిటీలు, మెడికల్‌ టూరిజం, పరిశ్రమలు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. న్యూయార్క్‌ నగరంతో పోటీ పడేలా మహేశ్వరంలో ఒక అద్భుతమైన నగరం నిర్మించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. అద్భుతమైన రాచకొండ ప్రాంతాన్ని ఫిల్మ్‌ ఇండిస్టీకి అణువుగా మార్చబోతున్నామని చెప్పారు. రంగారెడ్డి జిల్లాకు మహర్దశ రాబోతోందని, ప్రపంచంలోనే అద్భుతమైన పర్యాటక కేంద్రంగా జిల్లాను తీర్చిదిద్దుతామని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, జూపల్లి, శ్రీధర్‌ బాబు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బూర వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్‌ శశాంక తదితరులు హాజరయ్యారు.

Spread the love