ఎలైట్‌లో హైదరాబాద్‌ అడుగు!

ఎలైట్‌లో హైదరాబాద్‌ అడుగు!– రంజీ ట్రోఫీ ప్లేట్‌ ఫైనల్లో మనోళ్లు
– సెమీస్‌లో నాగాలాండ్‌పై ఏకపక్ష విజయం
హైదరాబాద్‌ : ఏడాది విరామం అనంతరం రంజీ ట్రోఫీ ఎలైట్‌ లీగ్‌లోకి హైదరాబాద్‌ అడుగుపెట్టింది. ఉప్పల్‌ స్టేడియంలో నాగాలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో ఇన్నింగ్స్‌ 68 పరుగుల తేడాతో హైదరాబాద్‌ ఏకపక్ష విజయం నమోదు చేసింది. రంజీ ట్రోఫీ ప్లేట్‌ గ్రూప్‌ ఫైనల్లోకి ప్రవేశించి.. ఎలైట్‌లో స్థానం సొంతం చేసుకుంది. 13 వికెట్ల ప్రదర్శనతో స్పిన్నర్‌ తనరు త్యాగరాజన్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 206 పరుగులకే కుప్పకూలిన నాగాలాండ్‌.. ఫాలోఆన్‌లో 188 పరుగులే చేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 20/1తో మూడో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన నాగాలాండ్‌..సుమిత్‌ కుమార్‌ (86), రూపెరో (59) అర్థ సెంచరీలతో నాగాలాండ్‌ ఆ మాత్రం పరుగులైనా చేయగలిగింది. 58.3 ఓవర్లలో 188 పరుగులకే చేతులెత్తేసింది. స్పిన్నర్‌ తనరు త్యాగరాజన్‌ ఆరు వికెట్లతో మాయజాలం చేయగా, కెప్టెన్‌ తిలక్‌ వర్మ మూడు వికెట్లు పడగొట్టాడు. తన్మరు అగర్వాల్‌ (164), తిలక్‌ వర్మ (101) సెంచరీలతో తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్‌ 462/8 పరుగుల భారీ స్కోరు సాధించింది. గ్రూప్‌ దశ మ్యాచ్‌లో హైదరాబాద్‌కు రెండు రోజుల్లోనే తలొంచిన నాగాలాండ్‌.. సెమీఫైనల్లో మూడు రోజుల పాటు పోటీ ఇవ్వటం గమనార్హం. మరో సెమీఫైనల్లో మిజోరంపై మేఘాలయ 6 వికెట్ల తేడాతో గెలుపొంది టైటిల్‌ పోరుకు చేరుకుంది. ఉప్పల్‌ స్టేడియం వేదికగా ఫిబ్రవరి 17 నుంచి రంజీ ట్రోఫీ ప్లేట్‌ లీగ్‌ ఫైనల్‌ జరుగనుంది.
హెచ్‌సీఏ అధ్యక్షుడి అభినందన : రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌ తిరిగి ఎలైట్‌ గ్రూప్‌లోకి అడుగుపెట్టడంతో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్‌ రావు క్రికెటర్లను అభినందించారు. నాగాలాండ్‌తో సెమీస్‌ విజయం అనంతరం కెప్టెన్‌ తిలక్‌ వర్మతో ఫోన్‌లో మాట్లాడిన జగన్‌మోహన్‌ రావు బాగా ఆడారని కితాబిచ్చారు. 13 వికెట్లతో మెరిసిన తనరు త్యాగరాజన్‌ను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.

Spread the love