ఎలక్ట్రిక్‌ బస్సులతో పర్యావరణ పరిరక్షణ రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్

– మియాపూర్‌లో ‘ఈ-గరుడ’ పేరుతో ఎలక్ట్రిక్‌ ఆర్టీసీ ఏసీ బస్సులు ప్రారంభం
– హైదరాబాద్‌-విజయవాడ మధ్య ప్రతి 20 నిమిషాలకూ ఒక్క బస్సు
నవతెలంగాణ-మియాపూర్‌
పర్యావరణ పరిరక్షణకు ఎలక్ట్రిక్‌ బస్సులు ఎంతగానో ఉపయోగపడతాయని రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు అన్నారు. రంగారెడ్డి జిల్లా మియాపూర్‌ క్రాస్‌ రోడ్స్‌ సమీపంలోని పుష్పక్‌ బస్‌ పాయింట్‌ వద్ద మంగళవారం ‘ఈ-గరుడ’ పేరుతో ఎలక్ట్రిక్‌ ఆర్టీసీ ఏసీ బస్సులను ఆర్టీసీ చైర్మెన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ రెడి, ఎండీ వీసీ సజ్జనార్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సంద్భంగా వారు మాట్లాడుతూ.. అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు, హైటెక్‌ హంగులతో అందుబాటులోకి తెస్తున్న ఈ కొత్త ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులకు ‘ఈ-గరుడ’గా సంస్థ నామకరణం చేసిందని తెలిపారు. హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో ప్రతి 20 నిమిషాలకో ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సు నడిపేలా ప్రణాళిక రూపొందిం చామన్నారు. రాబోయే రెండేండ్లలో కొత్తగా 1860 ఎలక్ట్రిక్‌ బస్సులను అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు. వాటిలో 1300 బస్సులను హైదరాబాద్‌ సిటీలో, 550 బస్సులను సుదూర ప్రాంతాలకు నడుపుతామని తెలిపారు. హైదరాబాద్‌లో 10 డబుల్‌ డెక్కర్‌ బస్సులను త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. 12 మీటర్ల పొడవు గల ఈ ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులు.. హైటెక్‌ హంగులతో ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించినట్టు వివరించారు. 41 సీట్ల సామర్థ్యం గల ఈ బస్సుల్లో ప్రతి సీటు వద్ద మొబైల్‌ చార్జింగ్‌ సౌకర్యంతో పాటు రీడింగ్‌ ల్యాంప్‌లను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, రీజనల్‌ మేనేజర్‌ శ్రీధర్‌, డీఆర్‌ఎం రాజు, బీఆర్‌ఎస్‌ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love