ప్రాణాలు తీస్తున్న పర్యావరణ మార్పులు

ఆసియాపై తీవ్ర ప్రభావం
– రెండో అత్యధిక మరణాలు భారత్‌లోనే
– మొదటి స్థానంలో బంగ్లాదేశ్‌
– ఆర్థిక నష్టమూ భారీస్థాయిలోనే
– ప్రపంచ వాతావరణ సంస్థ నివేదిక
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు మరణశాసనాలను రాస్తున్నాయి. ఈ అనూహ్య మార్పులు విపత్తులు, మానవ మరణాలకు కారణమవుతున్నాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 1970-2021 మధ్య ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మరణాలు చోటు చేసుకున్నాయి. వాతావరణ మార్పుల ప్రభావం ఆసియా ఖండం పైనే అధికంగా చూపింది. ఇక్కడ మొత్తం 9.38 లక్షలకు పైగా మరణాలు సంభవించాయి. ఇందులో 1.38 లక్షలకు పైగా మరణాలతో భారత్‌ రెండో స్థానంలో ఉన్నది. పొరుగు దేశం బంగ్లాదేశ్‌ 5.20 లక్షలకు పైగా మరణాలతో మొదటి స్థానంలో ఉన్నది. వాతావరణ మార్పుల ప్రభావం ఆర్థిక వ్యవస్థ పైనా పడి తీవ్ర నష్టాన్ని ఏర్పర్చింది.
‘వాతావరణ, నీటి తీవ్రతల కారణంగా మరణాలు మరియు ఆర్థిక నష్టాల స్థితి’ పేరుతో ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) విడుదల చేసిన ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఆయా ఖండాలు, ప్రాంతాలలో చోటు చేసుకున్న విపత్తులు, మరణాల గురించి ఈ నివేదిక వెల్లడించింది.
ఆసియాలో అధికం
ఈ నివేదిక సమాచారం ప్రకారం.. 1970 నుంచి 2021 మధ్య పర్యావరణ మార్పులతో సంభవించిన మరణాలతో ప్రపంచవ్యాప్తంగా ఆసియా ఖండం తీవ్రంగా ప్రభావితమైంది. 3,612 విపత్తులలో 9,84,263 మరణాలు ఇక్కడ చోటు చేసుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సంభవించిన వాతావరణ మార్పుల మరణాలలో ఇది 47 శాతం. అలాగే, ఇక్కడ రూ. 1.15 కోట్ల కోట్లు (33 శాతం) ఆర్థిక నష్టం సంభవించింది.
ఆసియా తర్వాత ఆఫ్రికా.. సోమాలియాలో అధికం
ఆసియా తర్వాత ఆఫ్రికా అధికంగా ప్రభావిత మైంది. ఇక్కడ 1839 విపత్తులలో 7,33,585 మరణాలు చోటు చేసుకున్నాయి. ఆర్థిక నష్టం రూ. 3.55 లక్షల కోట్లకు పైగా నమోదైంది. 95 శాతం మర ణాలు కరువుల కారణంగానే చోటు చేసుకున్నాయి. తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థి తుల కారణం గా ఆఫ్రికా దేశం సోమాలియాలో అత్యధికంగా 4 లక్షల మరణాలు చోటు చేసు కున్నాయి.
ఒక్క యూఎస్‌లోనే రూ. 1.40 కోట్ల కోట్లు నష్టం
ఉత్తర అమెరికా, మధ్య అమెరికా, కరీబియన్‌ లలో 2107 విపత్తులు సంభవిం చగా.. 77,454 మరణాలు చోటు చేసుకున్నాయి. రెండు ట్రిలి యన్ల ఆర్థిక నష్టం వాటిల్లింది. ప్రపంచవ్యాప్తం ఆర్థిక నష్టం 46 శాతంతో ఈ ప్రాంతాల లోనే చోటు చేసుకోవటం గమనార్హం. ఈ కాలంలో యూఎస్‌ఏ రూ. 1.40 కోట్ల కోట్లు నష్టాన్ని చవి చూసింది. దక్షిణమెరికాలో 58,484 మర ణాలు, రూ. 9.53 లక్షల కోట్లు నష్టం వాటిల్లింది. నైరుతి పసిఫిక్‌లో 66,951 మరణాలు, రూ.15.37 లక్షల కోట్లు నష్టం ఏర్పడింది. ఇక యూరప్‌లో మొత్తం 1784 విపత్తులలో 1,66,492 మర ణాలు, రూ.46.50 లక్షల కోట్ల ఆర్థిక నష్టం ఏర్పడింది.
భారత్‌లో 1.38 లక్షలకు పైగా మరణాలు
ఇలాంటి మరణాల్లో భారత్‌ 1,38, 377 మరణాలతో రెండో స్థానంలో ఉన్నది. 5,20,758 మరణాలతో బంగ్లాదేశ్‌ మొదటి స్థానంలో ఉండటం గమనార్హం. ఆ తర్వాతి స్థానాల్లో మయన్మార్‌ (1,38,666 మరణాలు), చైనా (88,457)గా ఉన్నాయి. ఇక ఈ ఆసి యా దేశాల్లో విపత్తుల సంఖ్య చైనాలో అత్యధికంగా 740గా ఉన్నది. ఆ తర్వాతి స్థానాల్లో భారత్‌(573),బంగ్లాదేశ్‌ (281) లు ఉన్నాయి.

Spread the love