– ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాలి
– లక్ష్యసాధన దిశగా సాగాలి : దేశ ప్రజలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
న్యూఢిల్లీ : స్వాతంత్య్రం సిద్ధించి 75ఏండ్లు పూర్తి చేసుకుని అజాదీ కా అమృత మహోత్సవ్ కాలంలో వున్న మన దేశం విశిష్టమైన గొప్పతనాన్ని, వైవిధ్యభరితమైన సంస్కృతిని చాటిచెబుతూ మనం ఈ పండుగను జరుపుకుంటున్నామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఈ 75వ గణతంత్ర దినోత్సవం ఎంతో ప్రత్యేకమైనదని, విశిష్టమైనదని వ్యాఖ్యానించారు. భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె శనివారం రాత్రి దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. భారతదేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థ పశ్చిమ దేశాల్లోని ప్రజాస్వామ్య భావన కన్నా చాలా ప్రాచీనమైదని అందుకే భారత్‌ను ప్రజాస్వామ్య మాతృకగా పిలుస్తారని ఆమె కొనియాడారు. అనేక ప్రతికూలతలను, అడ్డంకులను, సవాళ్ళను దాటుకుంటూ సాగిన 75ఏండ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని రాష్ట్రపతి తన ప్రసంగంలో వివరించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఆమె ప్రముఖంగా పేర్కొన్నారు. ఆర్థిక, సైన్స్, అంతర్జాతీయ సంబంధాలు సహా పలు రంగాల్లో భారత్ సాధించిన పలు విజయాలను ఈ సందర్భంగా ఆమె వివరించారు. మన మౌలిక విలువలు, సిద్ధాంతాలు, సూత్రాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సి వుందన్నారు. ప్రజాస్వామ్యం అంటేనే వైవిధ్యభరితమైన సంస్కృతీ సంప్రదాయాలు, విశ్వాసాలు, ఆచారాలని అన్నారు. ఈ వైవిధ్యతను మనం ఆచరిస్తేనే సమానత్వం సిద్ధిస్తుందన్నారు. లింగ సమానత్వం దిశగా కూడా మనం పురోగతి సాధించామన్నారు. చారిత్రక మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ఆమోదించిందన్నారు. నారీ శక్తి వందన్ అభియాన్ మహిళా సాధికారతకు విప్లవాత్మకమైన సాధనంగా మారుతుందన్నారు.
ఆత్మనిర్భర్ కోసం రైతుల కృషి
గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించిన 75ఏండ్ల తర్వాత కూడా దేశంలోని పలు ప్రాంతాలు దారిద్య్రంలో వున్నాయని, ఆకలి బాధలను ఎదుర్కొంటున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మన విశ్వాసం చెక్కు చెదరలేదన్నారు. ఆ పరిస్థితులను అధిగమించేందుకు మనం అనేక చర్యలు, తీర్మానాలు చేపట్టామన్నారు. ముఖ్యంగా ఆహార ధాన్యాలు, ఇతర పంటల విషయంలో మన దేశం స్వయం సమృద్ధి సాధించేందుకు మన రైతాంగం చెమటోడ్చి నిరంతరంగా శ్రమించిందని అన్నారు. మన కార్మికులు కఠోర శ్రమతో మన తయారీ రంగాన్ని, మౌలిక వసతులను మరింత మెరుగైన రీతిలో వుండేలా తీర్చిదిద్దారన్నారు. ఈ రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో మనం చొరవలు తీసుకుంటున్నామన్నారు.
ఎస్‌సీ, ఎస్‌టీ కమ్యూనిటీల అభివృద్ధికి ప్రభుత్వం నిర్దిష్ట చర్యలు తీసుకుంటోందని చెప్పారు. వారి సామాజిక, ఆర్థిక అభ్యున్నతి కోసం ప్రత్యేకంగా పథకాలు రూపొందించిందన్నారు. ప్రాధమిక అవసరాలను ఒక హక్కుగా మార్చడం ద్వారా సంక్షేమం అన్న భావననే ప్రభుత్వం పునర్నిర్వచించిందన్నారు. సాహసోపేతమైన, దార్శనికత, ఆర్థిక బలంతో రాబోయే కాలంలో కూడా మన పురోగతి ఇదే వేగంతో కొనసాగుతుందన్నారు.
పటిష్టమైన ఆర్థిక వ్యవస్థతో వచ్చిన ఆత్మ విశ్వాసంతో మనం ముందుకు వెళుతున్నామన్నారు. ఇటీవలి కాలంలో ప్రధాన దేశాల ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ జిడిపి వృద్ధిరేటు కొనసాగుతోందన్నారు. సమాజంలోని బలహీన వర్గాల వారికి ఉచిత ఆహారం అందించే పథకాలను కరోనా మహమ్మారి కాలంలో అమలు చేశామని, ఆ తర్వాత కూడా ప్రభుత్వం ఆ పథకాల పరిధిని పెంచి, అమలును కొనసాగిస్తోందని రాష్ట్రపతి పేర్కొన్నారు.
ప్రస్తుత అమృత కాలంలో కనివినీ ఎరుగని సాంకేతిక మార్పులు ఎదురవుతున్నాయని, కృత్రిమ మేథస్సు, మెషిన్ లెర్నింగ్ వంటి అధునాతన సాంకేతిక చొరవలు పతాక శీర్షికల నుండి మన రోజువారీ జీవితాల్లోకి వచ్చేశాయని ఆమె పేర్కొనానరు. రాబోయే భవిష్యత్తులో ఆందోళన చెందే అంశాలు, అవకాశాలు సృష్టించే రంగాలు కూడా అనేకం వున్నాయన్నారు. ముఖ్యంగా యువతను దృష్టిలో పెట్టుకుంటే వారు సరికొత్త సరిహద్దులను అన్వేషిస్తూ ముందుకు సాగిపోతున్నారన్నారు. వారి మార్గంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగిస్తూ వారికి మార్గం సుగమం చేయడమే మన ముందున్న కర్తవ్యమని అన్నారు. వారి విశ్వాసమే రేపటి భారతాన్ని నిర్మిస్తుందని ఆమె ఆకాంక్షించారు. యువత మనస్సులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులే మన జాతి నిర్మాతలను ఆమె అభిప్రాయపడ్డారు. మౌనంగా పనిచేసుకుంటూ దేశానికి మరింత మెరుగైన భవితవ్యాన్ని అందించేందుకు ఇతోధికమైన సేవలందించే మన రైతాంగం, కార్మికులకు కచ్చితంగా మనందరం కృతజ్ఞులమై వుండాలని రాష్ట్రపతి పేర్కొన్నారు. చివరగా ఇటువంటి పర్వదినాన మనసాయుధ బలగాలకు, పోలీసులు, పారా మిలటరీ బలగాలకు భారత్ అభివాదం చేస్తోందన్నారు. వారి ధైర్యసాహసాలే లేకపోతే ఈనాడు మనం లేమని వ్యాఖ్యానించారు. చివరగా మనందరం మనం కృషి చేయగలిగే రంగాల్లో కృషి చేస్తూ, దేశానికి ఇతోధికంగా సేవలందిస్తూ, నిబద్ధతతో వ్యవహరిస్తూ లక్ష్యాల సాధన దిశగా సాగాలని కోరారు.