కేసీఆర్‌తోనే తండాలకు రాజ్యాధికారం: మంత్రి ఎర్రబెల్లి

Thandas have the power of kingship only with KCR: Minister Errabelli– కాంగ్రెస్‌ నాయకుల మాటలు నమ్మొద్దు
– సంక్షేమంలో దేశానికే దీటుగా ‘తెలంగాణ’
నవతెలంగాణ-పెద్దవంగర
సీఎం కేసీఆర్‌ తోనే రాష్ట్రంలోని గిరిజనులకు రాజ్యాధికారం సిద్ధించిందని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. తండా బాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల పరిధిలోని లొట్లబండ తండా, బంగారు చెలిమి తండా, కాండ్య తండా, రెడ్డికుంట తండా, రాజామాన్‌ సింగ్‌ తండా, పడమటి తండా నాయక్‌ తండాల్లో సుడిగాలి పర్యటన చేపట్టారు. ఇంతకుముందు మంత్రి ఎర్రబెల్లికి నాయకులు డప్పు చప్పుల్లు, కోలాటాలు బతుకమ్మ లతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి అనంతరం నిర్వహించిన సమావేశాల్లో ఎంపీపీ ఈదురు రాజేశ్వరి, జెడ్పీటీసీ జ్యోతిర్మయి సుధీర్‌ తో కలిసి మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో గోస పడ్డాం.. కేసీఆర్‌ సారథ్యంలో సొంతంగా రాష్ట్రాన్ని సాధించాం.. ఆ ఫలాలు నేడు అనుభవిస్తున్నాం.. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచిందన్నారు. ఐక్యంగా ఉన్న గిరిజనుల్లో వర్గీకరణ పేరుతో కాంగ్రెస్‌ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఒక్కో గ్రామానికి కోటి రూపాయలతో అనేక అభివృద్ధి పనులతో సంక్షేమ కార్యక్రమాలతో గతంలో కనీవినీ ఎరగని రీతిలో తండాలను సైతం గ్రామాలకు ధీటుగా అభివద్ధి పరచిన ఘనత చరిత సీఎం కేసీఆర్‌ గారికి దక్కుతుందన్నారు. గిరిజనుల ఆదివాసీల ఏండ్ల గోసను సీఎం కెసిఆర్‌ ఎడబాపితే, గిరిజనులకు రిజర్వేషన్లు పెంచి వారి అభివద్ధికి బి.ఆర్‌.ఎస్‌ ప్రభుత్వం పాటుపడుతుంటే, ఎస్టీలలో వర్గీకరణ చిచ్చుకు కాంగ్రెస్‌ కుట్ర పన్నుతోందని మంత్రి ఎర్రబెల్లి విమర్శించారు. కాంగ్రెస్‌ ని నమ్ముకుంటే నట్టేట మునిగినట్లే!. కాంగ్రెస్‌ ను తరిమి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అన్నదమ్ముల్లా కలిసి వున్న ఎస్టీల్లో వర్గీకరణ చిచ్చు పెట్టడానికి కాంగ్రెస్‌ కుట్రపన్నుతోందన్నారు. రైతుల నడ్డి విరవడానికి 3 గంటల కరెంటు చాలంటోంది. 24 గంటల కరెంటు కావాలా? 3 గంటల కరెంటు కావాలా? 3 పంటల బిఆర్‌ ఎస్‌ కావాలా? ప్రజలు తేల్చుకోవాలి. ప్రజల్ని విభజించి పాలించే కుట్రలు పన్నుతున్న కాంగ్రెస్‌ నేతలను మన నియోజకవర్గంలో కాలు పెట్టనివ్వవద్దు. తరిమి కొట్టి మనల్నిమనం కాపాడుకోవాలి. మన కోసం పాటుపడుతున్న సీఎం కెసిఆర్‌ కు, నాకు అండగా నిలవాలి. అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. కష్టాల్లో సుఖాల్లో మీతో నేను ఉన్నాను. ఎప్పుడూ ముఖం తెలియని వాళ్ళు మీ దగ్గరకు వస్తున్నారు. ఈ ఎన్నికలు అయిపోతే వారు వెళ్ళిపోతారు. మనమే ఎప్పటికీ ఇక్కడే ఉంటాం అని ఆయన అన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ ఈదురు రాజేశ్వరి, జడ్పీటీసీ శ్రీరామ్‌ జ్యోతిర్మయి, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, మండల అభివద్ధి కమిటీ చైర్మన్‌ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ, మండల సీనియర్‌ నాయకులు శ్రీరామ్‌ సుధీర్‌, మండల ప్రధాన కార్యదర్శి శ్రీరామ్‌ సంజరు కుమార్‌, నాయకులు కేతిరెడ్డి సోమనరసింహా రెడ్డి, జాటోత్‌ నెహ్రు నాయక్‌, సర్పంచులు తారా పూల్‌ సింగ్‌, పద్మ దేవేందర్‌, కేతిరెడ్డి దీపిక, ధరావత్‌ బీమా నాయక్‌, గుగులోతు పటేల్‌ నాయక్‌, చింతల భాస్కర్‌ రావు, ధరావత్‌ రాజేందర్‌ నాయక్‌, ఎంపీటీసీ సభ్యులు ఏదునూరి శ్రీనివాస్‌, బానోత్‌ రవీందర్‌ నాయక్‌, ఈరెంటి అనురాధ శ్రీనివాస్‌, బానోత్‌ విజయ సోమన్న, తంగళ్ళపల్లి మల్లికార్జున చారి, పసులేటి వెంకట్రామయ్య, తదితరులు పాల్గొన్నారు.

Spread the love