ఏడాదిలోగా ఏమైనా జరగొచ్చు.. ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు

నవతెలంగాణ – హైదరాబాద్
బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆపై కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత తొలిసారి నిన్న పాలకుర్తి వచ్చిన ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యారు. వారితో మాట్లాడుతూ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. గెలుపోటములు సహజమన్న ఆయన.. కార్యకర్తలు ఓపిగ్గా ఉండాలని కోరారు. తాను పాలకుర్తిని వదిలి వెళ్లే ప్రసక్తే లేదని, అందరికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఏడాదిలోగా ఏమైనా జరగొచ్చంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్లలో నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేసినట్టు చెప్పారు. ప్రజాతీర్పును గౌరవిస్తున్నానన్న ఆయన తనపై విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి యశస్వినికి శుభాకాంక్షలు తెలిపారు.

Spread the love