– 9 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోని హుస్నాబాద్
– అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌గౌడ్
నవతెలంగాణ-కోహెడ
ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న నన్ను గెలిపిస్తే మండలంలోని ఎర్రగుంటపల్లి గ్రామాన్ని దత్తత తీసుకొని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌గౌడ్ అన్నారు. ఆదివారం మండలంలోని వరికోలు, రాంచంద్రాపూర్, వింజపల్లి, ఎర్రగుంటపల్లి, గొట్లమిట్ట, నారాయణపూర్ గ్రామాలలో ఆయన ప్రజా ఆశీర్వాద యాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో గుర్తించి అసెంబ్లీలో చర్చించే సత్తా తనకు ఉందని కాబట్టి కాంగ్రెస్ పార్టీ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. గత 9 సంవత్సరాలుగా ఇక్కడి ప్రాంతం అభివృద్ధిలో కుంటుపడిపోయిందన్నారు. ఆరు గ్యారంటీ హామీలతో మీ ముందుకు వస్తున్నానని తప్పక ఆశీర్వదించాలన్నారు. అలాగే మండలంలో ఒక్క డబుల్ బెడ్‌రూం ఇల్లు కూడ ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేశారన్నారు. ఈ ఎన్నికలలో ప్రజలు బీఆర్‌ఎస్‌కు తగిన గుణపాఠం చెబుతారన్నారు. అనంతంరం ఆయా గ్రామాలలో పలువురు సర్పంచ్‌లు, ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమాలలో పార్టీ మండల అధ్యక్షుడు మంద ధర్మయ్య, ఉమ్మడి జిల్లా ఇంఛార్జీ బస్వరాజు శంకర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు చింతకింది శంకర్, నాయకులు దొమ్మాట జగన్‌రెడ్డి, శెట్టి సుధాకర్, దూలం శ్రీనివాస్, రాచూరి శ్రీనివాస్, లింగం, ననువాల ప్రతాప్‌రెడ్డి, రఫీ, తదితరులు పాల్గొన్నారు.