– పాడి పంటలను ఎంకరేజ్ చేయాలి : మంత్రులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నుమాయిష్ సందడి మొదలైంది. నాంపల్లిలో ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 84వ అఖిల భారత వస్తు పారిశ్రామిక ప్రదర్శనశాల (నుమాయిష్)ను మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులు శుక్రవారం ప్రారంభించారు. జనవరి 1న ప్రారంభం కావాల్సిన నుమాయిష్‌ను మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిచెందడంతో ప్రభుత్వం సంతాప దినాలుగా ప్రకటించడంతో రెండ్రోజులు ఆలస్యంగా ప్రారంభించారు. జమ్మూ, ఇతర రాష్ట్రాలకు సంబంధించివి ఇక్కడే ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో లభిస్తాయని మంత్రి పొన్నం తెలిపారు. గతంలో ఎనిమల్ కాంపిటీషన్ జరుగుతుండేదని దానిని మళ్లీ ప్రారంభించాలని కోరారు. పాడి పంటలను సైతం ఎంకరేజ్ చేయాలన్నారు. ప్రభుత్వ సహకారంతో మరింత అభివృద్ధి చేయాలన్నారు. విద్యా సంస్థలను మరింత ప్రోత్సహించాలన్నారు. తమ ప్రాంతంలో గిరిజనులు ఉన్నారని, ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా అక్కడ కూడా ప్రదర్శన ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రస్తుతం 28 విద్యా సంస్థలు ఉన్నాయని, వచ్చే నుమాయిష్‌లోగా 30 విద్యా సంస్థలను చేయాలని కోరారు. అనంతరం ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షులు మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. గత ఏడాది నుమాయిష్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారని తెలిపారు. ఎగ్జిబిషన్ ద్వారా సోసైటీ చాలా కళాశాలలు సక్సెస్‌పుల్‌గా నడుపుతోందని చెప్పారు. ఒక ఎన్‌జీవోగా సొసైటీ నడుపుతున్నారని చెప్పారు. సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రకటించుకున్నామని, కమలా నెహ్రౌ పాలిటెక్నిక్ కాలేజీతోపాటు ఇంజినీరింగ్ కాలేజీని వచ్చే ఏడాది ప్రారంభించుకోబోతున్నామని అన్నారు. ప్రతి రోజూ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు, వారాంతాలు, సెలవు రోజుల్లో రాత్రి 11 గంటల వరకు నుమాయిష్ ప్రదర్శన కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ విహెచ్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మెన్ మెట్టు సాయి కుమార్, గౌరవ ఉపాధ్యక్షులు కె.నిరంజన్, గౌరవ కార్యదర్శి బి.సురేందర్ రెడ్డి, గౌరవ సంయుక్త కార్యదర్శి డీ.మోహన్, గౌరవ కోశాధికారి డా.బి.ప్రభాశంకర్, మేనేజింగ్ కమిటీ సభ్యులు అశ్వక్ హైదర్, డా.డి.గంగాధర్‌రావు, సతీష్ నాయక్, బీ.ఎన్.రాజేశ్వర్, అశ్విన్ మార్గం, అజరు కుమార్, యం.చంద్రశేఖర్, మిలింద్ గద్వాల్కర్, డా.బి.మురళి మోహన్, డా.బీ.వెంకటేశ్వర్, అడ్వజైర్ డా.యం.సురేష్ రాజ్, కన్వీనర్ డి.సురేష్ కుమార్, పీఆర్‌వో రవీయాదవ్ పాల్గొన్నారు.
నిజాం కాలంలో మొదలైన నుమాయిష్
1938లో నిజాం కాలంలో మొదలైన నుమాయిష్‌కు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ నలుమూలల నుంచి సందర్శకులు తరలివస్తారు. సందర్శకులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలూ తీసుకున్నారు. సీసీ కెమెరాలు, భద్రతా బలగాలతో పాటు సందర్శకులు మైదానంలో తిరిగేందుకు ఏర్పాట్లు చేశారు. జమ్మూకశ్మీర్ డ్రై ఫ్రూట్స్, హ్యాండ్ క్రాఫ్ట్స్, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్ నుంచి హస్తకళ వస్తువులు ప్రదర్శనలో ఉంటాయి. దేశంలోని అత్యుత్తమ బ్రాండ్ల ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు అన్ని రకాల స్టాల్స్ అందుబాటులో ఉంటాయి.