ఇథనాల్‌ చిచ్చు కర్షకుల జీవితాల్లో ఆందోళన

Ethanol spills are a concern in farmers' lives–  పొలం రక్షణ కోసం పోరాటం
–  ఇథనాల్‌ ఫ్యాక్టరీని రద్దు చేయాలని డిమాండ్‌
– పంటలు నాశనం..పర్యావరణానికి హానికరం
–  కొనసాగుతున్న దిలావర్‌పూర్‌, గుండంపల్లి రైతుల పోరాటం
–  వ్యర్థాలతో పంటలు ఎలా వేయాలని ఆవేదన
వ్యవసాయమే జీవనాధారంగా బతుకున్న వారి జీవితాల్లో ఇథనాల్‌ ఫ్యాక్టరీ నిర్మాణం చిచ్చురేపుతోంది. ఇన్నేండ్లు పొలాల్లో పంటలు వేసుకొని జీవనం సాగిస్తున్న కర్షకుల బతుకుల్లో ఒక్కసారిగా ఆందోళన రేగుతోంది. పచ్చని పంట పొలాల మధ్య ఇథనాల్‌ ఫ్యాక్టరీ నిర్మాణం వారి ఆందోళనకు కారణమవుతోంది. పంట పొలాలను నాశనం చేసే ఈ పరిశ్రమను ఇక్కడ్నుంచి తరలించాలని స్థానిక రైతులు పెద్దఎత్తున ఆందోళన చేపడుతున్నారు. ఈ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌, గుండంపల్లి రైతులు నెల రోజులుగా ఆందోళన బాటపట్టారు. కొన్ని రోజుల కిందట ఫ్యాక్టరీ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారగా.. 60మంది రైతులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా అనుమతులు ఇచ్చి రైతులకు నిద్ర లేకుండా చేసింది. ఇథనాల్‌ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వెనక్కు తీసుకుంటామని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పింది. అయినా నిర్మాణ పనులు జరుగుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారికంగా ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతున్నారు. వీరికి వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలతో పాటు చుట్టుపక్కల గ్రామాల రైతులు మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి ‘నవతెలంగాణ’ బృందం వెళ్లింది. రైతులను పలుకరించింది.
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి, దిలావర్‌పూర్‌
పచ్చని పంట పొలాల్లోకి రసాయన పరిశ్రమలు రావడం రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌ మండల కేంద్రంతోపాటు గుండంపల్లి గ్రామాల మధ్య సుమారు 42 ఎకరాల్లో ఇథనాల్‌ పరిశ్రమ నిర్మితమవుతోంది. తొలుత రైతుల నుంచి భూమి సేకరించిన సమయంలో ఇక్కడ గోదాములు, రైస్‌ మిల్లులు నిర్మిస్తామని చెప్పడంతోనే మిన్నకుండిపోయారు. కానీ ఇక్కడ ఇథనాల్‌ ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతోంది. మరోపక్క ఫ్యాక్టరీ నిర్మాణంపై ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టలేదని రైతులు చెబుతున్నారు. ఆ తర్వాత ఈ పరిశ్రమ ప్రారంభమైతే చుట్టుపక్కల పొలాలపై ప్రభావం పడుతుందని.. వ్యర్థాలతో పర్యావరణానికి హాని కలిగించడంతో పాటు దుర్వాసన వస్తుందని, జీవ వైవిధ్యానికి అవరోధంగా మారుతుందని భావించిన రైతులు పరిశ్రమ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుత నారాయణపేట జిల్లా మరికల్‌ మండలం చిత్తనూరులో ఉన్న ఇలాంటి పరిశ్రమను రైతులు వెళ్లి పరిశీలించారు. అక్కడి భూములను చూశారు. అక్కడ ఈ పరిశ్రమ చుట్టుపక్కల సమీప పొలాల్లోకి దుర్వాసన కారణంగా పనులు చేసేందుకు కూలీలు ఎవరూ రావడం లేదని తెలుసుకున్న రైతులు ఇక్కడ ఇథనాల్‌ పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాటాన్ని ప్రారంభించారు. సుమారు ఆరు నెలల నుంచి వివిధ రూపాల్లో నిరసన కొనసాగుతోంది.
గ్రామాల్లో శాంతియుత నిరసన
దిలావర్‌పూర్‌, గుండంపల్లి గ్రామాల మధ్య నిర్మితమవుతున్న ఈ పరిశ్రమ చుట్టుపక్కల సుమారు 2వేల ఎకరాల్లో పంట పొలాలు ఉన్నాయి. భవిష్యత్‌లో ఈ పొలాలకు హాని జరు గుతుందనే కారణంగా ఈ ఫ్యాక్టరీ రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ రెండు గ్రామాల ప్రజలు ప్రతి నిత్యం నిరసన తెలుపుతున్నారు. ఊరంతా ఒక్కటై నిరసన గళం వినిపిస్తున్నారు. ఫ్యాక్టరీకి సమీపంలోనే గోదావరి నది ఉండటంతో అక్కడ్నుంచి నీటిని తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయని చెబుతున్నారు. రైతులకు అండగా సీపీఐ(ఎం)తో పాటు వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపి నిరసనలో భాగస్వాములవుతున్నాయి.
అన్యాయంగా కేసులు నమోదు చేశారు
పరిశ్రమను రద్దు చేయాలని కోరుతూ శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ఫ్యాక్టరీ వద్దకు వెళ్లాం. పోలీసులు లాఠీచార్జి చేశారు. అక్కడే ఓ వాహనానికి ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. ఫ్యాక్టరీ వాళ్లే విధ్వంసం సృష్టించినట్టు ప్రచారం జరుగుతోంది. కానీ రైతులపై అన్యాయంగా కేసులు నమోదు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులపై మోపిన కేసులను వెనక్కి తీసుకోవాలి.
రైతు భోజారెడ్డి, గుండంపల్లి
కాలుష్యంతో పంటలు నాశనం
తమ జీవితాల్లో ఈ ఫ్యాక్టరీ నిర్మాణం అవరోధంగా మారుతోంది. ఈ పరిశ్రమ నుంచి వెలువడే కాలుష్యం కారణంగా పంటలు నాశనమయ్యే పరిస్థితి ఉంటుంది. చిత్తనూరులో ఉన్న పరిశ్రమకు వద్దకు వెళ్లి ప్రత్యక్షంగా చూశాం. దుర్వాసన కారణంగా సమీప పొలాల్లోకి కూలీలు ఎవరూ రావడం లేదు. ఇప్పటికే వివిధ కారణాలతో పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. ఈ పరిశ్రమతో మరింత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంటుంది. శాంతియుతంగా నిరసన తెలిపిన రైతులపై అన్యాయంగా కేసులు నమోదు చేశారు.
రైతు విజరుకుమార్‌, దిలావర్‌పూర్‌

Spread the love