అటో.. ఇటో.. ఎటో..!

Ato.. Ato.. Ato..!– కాంగ్రెస్సా..? కాషాయమా..?
– గందరగోళంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
– మరికొద్ది కాలం వేచిచూసే ధోరణి
– మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో మారుతున్న రాజకీయ సమీకరణాలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో దశాబ్దకాలం పాటు రాష్ట్రం, జిల్లా, మండలాలు, స్థానిక సంస్థల్లో తిరుగులేని అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌, ప్రస్తుతం పార్టీ ఫిరాయింపుల జోరుతో ఎదురీదుతోంది. ముఖ్య నాయకులు గులాబీ గూటిని వదలగా.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా మరికొంత మంది కీలక నేతలు సైతం అదే దారిలో నడిచేందుకు రెడీ అవుతున్నారు. అయితే కాంగ్రెస్‌లోకి వెళ్లాలా..? కాషాయం కండువా కప్పుకోవాలా..? అనే డైలామాలో కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉంటే, టీడీపీలో చేరేందుకు మరికొందరు ఎమ్మెల్యేలు సన్నాహాలు చేస్తున్నట్టు చర్చ నడుస్తోంది. కాంగ్రెస్‌లోనా, బీజేపీలోనా, టీడీపీలోనా అనేది కాసేపు పక్కనపెడితే, కారు దిగడం మాత్రం దాదాపు ఖాయంగా కనిపిస్తుండటంతో జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
పడిపోతున్న బలం
రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోవడం, ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడం, తదితర రాష్ట్ర స్థాయి పరిణామాలు జిల్లా రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో బీఆర్‌ఎస్‌దే అధికారం, హవా.. ప్రస్తుతం కూడా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే కొనసాగుతున్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ (బీఆర్‌ఎస్‌) ఐదు ఎమ్మెల్యే సీట్లు దక్కించుకోగా.. అనంతరం పార్టీ ఫిరాయింపులతో ఆ పార్టీ బలం మరింత పెరిగింది. పలువురు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఆయా మండలాలు, నియోజకవర్గాల్లోని కీలక నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రస్తుతం కూడా జిల్లాలోని అన్ని అసెంబ్లీ సీట్లు బీఆర్‌ఎస్‌ దక్కించుకున్నా.. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలతో అధికారం లేకపోవడంతో నిరాశే మిగిలింది. ఇక మల్కాజిగిరి పార్లమెంట్‌ సీటును కూడా గెలువలేకపోవడంతో పాటు ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో అవిశ్వాసాల పరంపర కొనసాగింది. పలువురు మున్సిపల్‌ చైర్మెన్లు, చైర్‌పర్సన్లు, మేయర్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ గూటికి చేరడంతో జిల్లా వ్యాప్తంగా బీఆర్‌ఎస్‌కు బలం పడిపోయింది.
సురక్షిత పార్టీలవైపు మొగ్గు..
రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి ఏడాది కూడా గడవకముందే.. జిల్లాలో రాజకీయ హడావుడి మొదలైంది. రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు గట్టి దెబ్బ తగలడంతో ఆ పార్టీ నాయకులు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌లో చేరితే జిల్లాలో అధికారం కొనసాగించొచ్చనీ, భవిష్యత్‌కు బాటలు వేసుకోవచ్చనే ఆలోచనతో ఆ పార్టీ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. అయితే జిల్లా రాజకీయాలపై పూర్తి అవగాహన ఉన్న మాజీ ఎమ్మెల్యేలు మలిపెద్ది సుధీర్‌రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, మాజీ జెడ్పీ చైర్మెన్‌ శరత్‌చంద్రారెడ్డి వారిని పార్టీలో చేరకుండా అడ్డుపడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్‌కు తలుపులు మూసుకుపోవడంతో కొందరు బీజేపీ, మరికొందరు టీడీపీ తలుపు తడుతున్నట్టు చర్చ నడుస్తోంది. కాంగ్రెస్‌ ఒకప్పటి మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి సీఎం కావడంతో అభినందనల పేరుతో ఆయనకు ఇప్పటికే కొందరు టచ్‌లోకి వెళ్లినట్టు సమాచారం. తమ నియోజకవర్గాలు, డివిజన్లు, మండలాల్లో పరిస్థితులను బేరీజు వేసుకుంటున్నారు.
తెర వేసేందుకే ఎర్రవెల్లికి..?
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, మరికొందరు ముఖ్య నేతలు ఎక్కువ మంది పార్టీ మారేందుకు సిద్ధం కాగా, పూర్వ పరిస్థితులు వెంటాడుతున్న కారణంగా కొంతమందికి పార్టీ మార్పు ఇబ్బందిగా ఉంది. కాంగ్రెస్‌కు దారి లేక బీజేపీ, టీడీపీలోకి వెళ్లేందుకు సమాయత్తమైన కొందరు ఇటీవల శామీర్‌పేటలోని ఓ ఫాంహౌస్‌లో భేటీ అయినట్టు అప్పట్లో పుకార్లు షికారు చేశాయి. ఆ భేటీలో కీలక నిర్ణయం తీసుకుంటారని ఆశించినా, అక్కడి ప్రతికూల వాతావరణం నిర్ణయాన్ని దూరం చేసినట్టుగా తెలిసింది. దాంతో కొద్ది రోజులు వేచి చూడాలనే కొందరి సూచనకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలు ప్రస్తుతానికి తలొగ్గినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఎర్రవెల్లిలో ఉన్న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను జిల్లాలోని ఐదుగురు ఎమ్మెల్యేలు కలిశారు. పార్టీ మార్పుపై విస్తృత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్‌తో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
ముఖ్య కార్యక్రమాలకు దూరం
కాగా ఇటీవల జీహెచ్‌ఎంసీ మేయర్‌పై అవిశ్వాసం పెట్టడానికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు హాజరు కాకపోగా.. ఆ మరుసటి రోజు నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబును కలవడం ఆశ్చర్యానికి గురి చేసింది. దాంతో ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు.. అయితే అటా..? ఇటా..? ఎటనేది..? తేల్చుకోలేపోతున్నారని ప్రచారం జరుగుతోంది.
తెరపైకి టీడీపీ..
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, తెలంగాణపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి సారించడంతో మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో మరోసారి టీడీపీ పార్టీ తెరపైకి వచ్చింది. మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి లాంటి వారికి కాంగ్రెస్‌, బీజేపీలోకి వెళ్లేందుకు డోర్లు మూసుకుపోవడంతో మాతృ పార్టీ టీడీపీ వైపు చూస్తున్నట్టు చర్చ నడుస్తోంది. పార్టీ జాతీయాధ్యక్షులు చంద్రబాబును సైతం కలిసేందుకు ప్రయత్నించగా.. అపాయిట్‌మెంట్‌ దొరకలేదు. దాంతో ఇటీవల చంద్రబాబు హైదరాబాద్‌కు వచ్చిన సమయంలో మల్లారెడ్డి కలిసి పార్టీలో జాయిన్‌ అవుతారని అంతా భావించినా జరగలేదు. మామ దారిలోనే అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి సైతం వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. ఎవరు ఏ పార్టీలో చేరుతారో తెలియాలంటే అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు వేచి చూడాల్సిందే.

Spread the love