ఇయూ విస్తరణ అవశ్యం !

– ప్రధాన విధాన సమీక్ష అవశ్యమన్న ఈయూ చీఫ్‌
బ్రస్సెల్స్‌ : రాబోయే కాలంలో యురోపియన్‌ యూనియన్‌ విస్తరించాల్సిన అవసరం, అవకాశం వుందని ఈయూ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉర్సులా వాన్‌డెర్‌ లేయన్‌ అన్నారు. 30కి పైగా సభ్య దేశాలతో ఇయు ఇంకా ఎదగాలని, అందుకు సన్నద్ధం కావాలని అన్నారు. ఇయులో చేరేందుకు ఉక్రెయిన్‌, మాల్దోవా, ఇంకా పశ్చిమ బాల్కన్స్‌లోని కొన్ని దేశాలు వరుసలో వేచి చూస్తున్నాయి. 27దేశాలతో ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య బ్లాక్‌గా ఇయు వున్నప్పటికీ కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో ముఖ్యంగా ఏకాభిప్రాయం అవసరమైన వాటిల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సర్వ సాధారణంగా విదేశాంగ విధానం, వలసల నిర్ణయాలు వంటి వాటికి వ్యతిరేకంగా పోలెండ్‌, హంగరీ వంటి దేశాలు ఓటు వేస్తుండడంతో తరచుగా ఇయు నుండి ఆగ్రహావేశాలను ఎదుర్కొంటున్నాయి. పశ్చిమ బాల్కన్స్‌లో రష్యా ప్రభావం పట్ల ఆందోళనలు వ్యక్తమవుతన్నా ఇయులోకి ద్వారాలు మాత్రం తెరిచే వున్నాయి. కొన్ని దేశాలైతే సంవత్సరాల తరబడి వేచి చూస్తున్నాయి. ‘మన యూనియన్‌ను సంపూర్ణం చేయడంపై కసరత్తును పూర్తి చేయాలని చరిత్ర చెబుతోంది.” అని వాన్‌డెర్‌ లేయన్‌ వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్‌లోని స్టాస్‌బర్గ్‌లో ఆయన ఇయు ఎంపీలతో మాట్లాడారు. ఆర్థికం, ఇంధనం, వ్యవసాయం లేదా వలసలు వంటి రంగాల్లో కమిషన్‌ విధానపరమైన సమీక్ష జరుపుతుందని చెప్పారు. ఒక వేళ విస్తరణ జరిగిన పక్షంలో విధానపరంగా తీసుకోవాల్సిన మార్పులు, చేర్పులు ఏమిటన్నవాటిని పరిశీలిస్తుందన్నారు. యురోపియన్‌ యూనియన్‌, పార్లమెంట్‌, కమిషన్‌ ఎలా పనిచేస్తున్నాయో సమీక్షించాలనుకుంటున్నామని చెప్పారు. అలాగే మన బడ్జెట్‌ భవితవ్యంపై కూడా చర్చించాల్సిన అవసరం వుందన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుత్ను నేపథ్యంలో ఈ ప్రాంతమంతా దాని ప్రభావం వ్యాప్తి చెందుతున్న వేళ సభ్యత్వమనేది చాలా కీలకంగా మారిందని యురోపియన్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు చార్లెస్‌ మైఖేల్‌ వ్యాఖ్యానించారు.

Spread the love