నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల : దేవుడిని కూడా ఈ దేశంలో రాజకీయాలు చేస్తున్నారు. ఎన్నికలో దేవుడిని వినియోగించుకోవడం మంచి పద్ధతి కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవుడు కొందరికే సొంతం అన్నట్లుగా కొందరు వ్యవహరిస్తున్నారు. దేశంలో 6 శాస్త్రాలు, 18 పురాణాలు, 12 ద్వాదశ లింగాలు, 18 జ్యోతి లింగాలు, నాలుగు వేదాలు, నలుగురు జగద్గురులు ఉన్నారు. వాళ్ల చేతుల మీదుగా రామాలయం విగ్రహ ప్రతిష్టాపన చేయాల్సి ఉండగా రాజకీయాల కోసం దేవుడిని ఉపయోగిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. పవిత్ర భారత దేశంలో రాజకీయాల్లో దేవుళ్లను అడ్డం పెట్టుకొని మార్కెటింగ్ చేస్తున్నారని విమర్శించారు. మేము ప్రశ్నిస్తే మేము హిందువులకు వ్యతిరేకం అంటున్నారు. హిందుత్వాన్ని విశ్వసించే వారు ఆలోచన చేయాలన్నారు. దేవాలయ నిర్మాణం పూర్తి కాలేదు అని జగద్గురువులు చెబుతున్నా వారి మాటలు ఎవరు పట్టించుకోవడం లేదన్నారు. అనాడు రాజీవ్ గాంధీ యే రాముడి చరిత్ర వెలికి తీశారని గుర్తు చేశారు. వేములవాడ అభివృద్ధిపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామన ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.