కేంద్రం రూ.30 వేల కోట్లు ఆపినా.. బోర్లకు మీటర్లు పెట్టం

– మంత్రి హరీశ్‌ రావు
– జర్నలిస్టులకు ఇండ్ల పట్టాల పంపిణీ
– నవతెలంగాణ -పాపన్నపేట/కొల్చారం
కేంద్ర ప్రభుత్వం రూ.30 వేల కోట్లు ఆపినా.. రైతుల బోర్లకు మీటర్లు పెట్టమని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు స్పష్టంచేశారు. సోమవారం మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం రామతీర్థం గ్రామంలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను మంత్రి ప్రారంభించి లబ్దిదారులకు అందజేశారు. అంతకుముందు పాపన్నపేటలో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ, పశు వైద్యశాల, లింగయ్యపల్లిలో పంచాయతీ భవనం, ఏడుపాయలలో నూతనంగా నిర్మించిన యాగశాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 14 నుంచి రాష్ట్ర ప్రభుత్వం నూతన కార్యక్రమైన న్యూట్రిషన్‌ కిట్ల పంపిణీకి శ్రీకారం చుడుతుందని వెల్లడించారు. అన్ని సౌకర్యాలతో ఇల్లు కట్టి ఇచ్చింది కేసీఆర్‌ ప్రభుత్వమేనని తెలిపారు. ఈ నెలాఖరిలోగా ఇంటి జాగా ఉన్న వారికి గృహలక్ష్మి పథకం ద్వారా ఇల్లు కట్టుకొనేందుకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. డబ్బులు కూడా నేరుగా వారి బ్యాంకు ఖాతాలోనే జమ అవుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి, ఇప్కో డైరెక్టర్‌ దేవేందర్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్టులకు ఇండ్ల పట్టాల పంపిణీ
మెదక్‌ జిల్లా కొల్చారం మండలంలో అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ చేశారు. ఏడుపాయల హరిత హౌటల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రి హరీశ్‌ రావు, జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా, నర్సాపూర్‌ ఎమ్మెల్యే చిలుముల మదన్‌ రెడ్డి, మెదక్‌ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌ రెడ్డి హాజరయ్యారు. జర్నలిస్టుల సంఘం కొల్చారం మండల అధ్యక్షులు కాశం శ్రీనివాస్‌, జర్నలిస్టులు పట్లోరి వెంకటేశం, నీలకంఠి రమేష్‌, మిద్దె లక్ష్మీనారాయణ, అప్సర్‌, అశోక్‌, అనిల్‌, జీఎల్‌ కుమార్‌, సంతోష్‌ కుమార్‌, యాదగిరి, లక్ష్మీనారాయణ గౌడ్‌, మల్లేశం, నాగరాజు గౌడ్‌, పెంటయ్య, గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love