ఐఐటీల్లో చదివినా కొలువుల్లేవ్‌

 – 38 శాతం నిరుద్యోగులే
– ఈ ఏడాది మొత్తం 23 ఐఐటీ క్యాంపస్‌ల్లో ఎనిమిది వేల మందికి ఉద్యోగలేమి
– దేశంలో 61 శాతం పీజీ విద్యార్థులకు దక్కని ఉద్యోగం
– ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఐఐటీలకు ప్రత్యేక స్థానం ఉంది. ఐఐటీల్లో చదివిన వారికి మంచి ఉద్యోగాలు, లక్షల్లో వేతనాలు ఉంటాయని విన్నాం. కానీ, ప్రస్తుతం నిరుద్యోగం పెరగడంతో అందుకు భిన్నమైన పరిస్థితులు వెలుగుచూస్తున్నాయి. మన దేశంలోని ఐఐటీల్లో విద్యనభ్యసించిన విద్యార్థుల్లో ఈ ఏడాది దాదాపు 38 శాతం మందికి క్యాంపస్‌ ఉద్యోగాలు దక్కలేదు. దేశంలో 61 శాతం పోస్ట్‌ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు దక్కలేదు. ఐఐటీ కాన్పూర్‌ పూర్వ విద్యార్థి ధీరజ్‌ సింగ్‌ సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా సేకరించిన సమాచారంలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది మొత్తం 23 ఐఐటీ క్యాంపస్‌ల్లో దాదాపు 8 వేల మంది (38శాతం) ఐఐటీ విద్యార్థులకు ఉద్యోగాలు దక్కలేదని తేలింది. 2024లో 21,500 మంది విద్యార్థులు ఉద్యోగాల కోసం నమోదు చేసుకోగా, కేవలం 13,400 మంది మాత్రమే ఉద్యోగాలు సాధించారు. మిగతా వారు (38 శాతం) ఇంకా కొలువుల కోసం అన్వేషిస్తున్నట్టు వెల్లడైంది. రెండేండ్ల క్రితం నాటితో పోలిస్తే ఈ పరిస్థితి దాదాపు రెట్టింపు అయినట్టు ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. పాత తొమ్మిది ఐఐటీల్లో ఈ ఏడాది 16,400 మంది విద్యార్థులు ఉద్యోగాల కోసం నమోదు చేసుకోగా, వారిలో 6,050 (37 శాతం) మందికి ఇంకా ఉద్యోగాలు దక్కలేదు. కొత్తగా ఏర్పాటు చేసిన 14 ఐఐటీల్లో అయితే ఈ పరిస్థితి మరింత క్షీణించింది. 5,100 మంది ఉద్యోగాల కోసం నమోదు చేసుకోగా, ఇంకా 2,040 మందికి కొలువులు రాలేదని తేలింది. గతేడాది ఖరగ్‌పూర్‌ ఐఐటీల్లో 33 శాతం మంది విద్యార్థులకు ఉద్యోగాలు దక్కలేదని ధీరజ్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఉద్యోగ నియామకాల్లో సంక్షోభ పరిస్థితుల కారణంగా ఇంకా ఉద్యోగాలు రాని విద్యార్థులు ఒత్తిడి, ఆందోళన, నిస్సహాయతతో ఉన్నారని ఆయన తెలిపారు. ”ఉద్యోగాలు రాని విద్యార్థుల సంఖ్య రెట్టింపు కావడం దేశంలోని అత్యుత్తమ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో అనిశ్చిత స్థితిని సూచిస్తుంది. దాదాపు 61 శాతం పోస్ట్‌గ్రాడ్యుయేట్‌లకు ఇప్పటికీ చోటు దక్కలేదు. ఇది ప్రధాన కళాశాలలు, యువ గ్రాడ్యుయేట్లు ఎన్నడూ
యువ గ్రాడ్యుయేట్టు ఎదుర్కొంటున్న ఎన్నడూ లేని విధంగా ఉద్యోగ సంక్షోభం నెలకొంది” అని ధీరజ్‌ సింగ్‌ తెలిపారు.
ఐఐటీ ఢిల్లీలో గత ఐదేండ్లలో 22 శాతం మంది విద్యార్థులకు ఉద్యోగాలు దక్కకపోగా, 2024కు వచ్చేసరికి 40 శాతం మందికి అదే పరిస్థితి ఎదురైంది. గత రెండేండ్లలో 600 మందికి ఉద్యోగాలు దక్కలేదు. 2022 నుంచి 2024 వరకు పాత తొమ్మిది ఐఐటీల్లో నమోదు చేసుకున్న విద్యార్థుల సంఖ్య 1.2 రెట్లు పెరగ్గా, ఉద్యోగాలు సాధించనివారి సంఖ్య 2.1 రెట్లు పెరిగింది. అలాగే, నూతన ఐఐటీల్లో నమోదిత విద్యార్థుల సంఖ్య 1.3 రెట్లు పెరిగింది. కానీ ఉద్యోగాలు దక్కని విద్యార్థుల సంఖ్య కూడా 3.8 రెట్లు పెరిగింది. ఈ సంక్షోభం విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. ఈ ఏడాది ఆరుగురు ఐఐటీ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోగా, అనేక మంది తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి.

Spread the love