నవతెలంగాణ – పాట్నా: బీహార్‌లోని నవాడా జిల్లాలో దుండగులు దళితుల ఇళ్లకు నిప్పుపెట్టారు. ఈ ఘటనపై కాంగ్రెస్‌నేత రాహుల్‌గాంధీ స్పందించారు. ఎన్డీయే మిత్రపక్షాలు సమాజాన్ని అణచివేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఇళ్లు, ఆస్తులను కోల్పోయిన దళిత కుటుంబాల రోదనలు.. భీకర కాల్పుల ప్రతిధ్వనులు కూడా నిద్రపోతున్న బీహార్ ప్రభుత్వాన్ని మేల్కొల్పడంలో విజయవంతం కాలేదు’ అని రాహుల్ మండిపడ్డారు. కాగా, దళితులను భయపెట్టే అరాచకవాదులకు ఎన్డీయే ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇలాంటి సంఘటనలపై ప్రధాని మోడీ మౌనం వహించడం పెద్ద కుట్రకు ఆమోద ముద్ర వేయడమేనని అన్నారు. అవమానకర నేరానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలకు పునరావాసం కల్పించడంతోపాటు వారికి పూర్తి న్యాయం చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు.
మరోవైపు బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఈ సంఘటనపై స్పందించారు. దళితులపై అఘాయిత్యాలను సహించేది లేదన్నారు. సీఎం నితీశ్ కుమార్ నిద్ర నుంచి మేల్కొని మౌనాన్ని వీడాలని అన్నారు. ‘బీహార్‌లో మూడో అతిపెద్ద పార్టీకి చెందిన ముఖ్యమంత్రి నెలల తరబడి మాట్లాడటం మానేశారు. బీహార్‌పై కానీ, నేరగాళ్లపై కానీ ఎన్డీయేకు పట్టింపు లేదు’ అని ఎక్స్‌లో మండిపడ్డారు.
ఈ ఘటనపై బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ఈ సంఘటనపై స్పందించారు. బీహార్ ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. బాధితుల పునరావాసానికి ఆర్థిక సాయం చేయాలని ఆమె కోరారు.