చర్యకు ప్రతి చర్య తప్పదు

Every action is necessary for action– బీఆర్‌ఎస్‌లో అణచివేతకు గురయ్యా.
– మంత్రి హరీశ్‌రావుపై విమర్శలు నా వ్యక్తిగతమే..
– వారం తర్వాత భవిష్యత్‌ కార్యాచరణ : మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు
– మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు
నవతెలంగాణ-సిటీబ్యూరో
బీఆర్‌ఎస్‌ పార్టీలో అణచివేతకు గురయ్యానని, ఈ విషయంపైనే మెదక్‌ కార్యకర్తలూ ఆవేదన వ్యక్తం చేశారని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమం తరావు అన్నారు. మెదక్‌ ప్రజలు తనకు రాజకీయ భిక్ష పెట్టారన్నారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా దూల పల్లిలోని ఆయన నివాసానికి శనివారం పెద్దఎత్తున మెదక్‌, మల్కాజిగిరి బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు తరలి వచ్చారు. ఇటీవల తిరుమలలో మంత్రి హరీశ్‌రావుపై మైనంపల్లి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన భవిష్యత్‌ కార్యాచరణపై నాలుగు రోజులుగా చర్చ జరుగుతోంది. బీఆర్‌ఎస్‌ అధిష్టానం మైనంపల్లి కుమారుడు రోహిత్‌కు మెదక్‌ అసెంబ్లీ టికెట్‌ నిరాకరించడంతో అనుసరించాల్సిన వ్యూహాలపై అనుచరులతో మైనంపల్లి చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఏ పార్టీలో ఉన్నా వెన్ను పోటు పొడిచే అలవాటు తనకు లేదన్నారు. ప్రాణం పోయే వరకూ మాటపైనే ఉంటానని చెప్పారు. తాను ఎప్పుడూ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలను తిట్టలేదన్న మైనంపల్లి, అంతా కలిస్తేనే తెలంగాణ సాధ్యమైందన్నారు. తాను పార్టీని ఏమీ అనలేదనీ, పార్టీ కూడా తనను ఏమీ అనలేదని చెప్పుకొచ్చారు.
వారంలో నిర్ణయం..
పార్టీలు ముఖ్యం కాదని, మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలు, అభిమానులు, కార్యకర్తలే సర్వస్వం అన్నారు. ఆస్తులు అమ్మి అయినా సరే వారిని కాపాడుకుంటానని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానన్నారు. మంత్రి హరీశ్‌రావుపై విమర్శలు తన వ్యక్తిగతమే అన్నారు. తన కుమారుడి ఇష్టాన్ని కాదనలేనని, మల్కాజిగిరి, మెదక్‌లో వారం రోజులపాటు పర్యటించి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానని స్పష్టం చేశారు. తాను వెనక్కి తగ్గే వ్యక్తిని కాదన్న మైనంపల్లి, చర్యకు ప్రతి చర్య ఉంటుందని హెచ్చరించారు. తనను వ్యక్తిగతంగా ఇబ్బంది పెడితే తాను కూడా ఇబ్బంది పెడతానని తెలిపారు. బీఆర్‌ఎస్‌లో ఓ పెద్ద నాయ కుడు తనకు ఫోన్‌ చేసి తొందర పడొద్దని చెప్పారని, ప్రజల అభిప్రాయాలను తీసుకోవాలని ఆ నాయకు డు సూచించినట్టు చెప్పారు. మీడియాతో మాట్లాడొ ద్దని ఆ నాయకుడు ఒట్టు కూడా వేయించుకున్నాడని, అందుకే వారం రోజులు ప్రజల మాండెట్‌ తీసుకుం టానన్నారు. మెదక్‌లో తన కొడుకు తిరిగి ప్రజాభిప్రాయం కోరుతాడని వెల్లడించారు. మెదక్‌ ప్రజలు ఏది చెబితే తన కొడుకు అది చేస్తాడన్నారు. తన కంటే తన కొడుకు ఎక్కువ పని చేస్తున్నాడని, ఆయన్ను ఎందుకు సెట్‌ చేయొద్దని ప్రశ్నించారు. జీవితంలో సెటిల్‌ అనేది ఉండదన్న మైనంపల్లి, తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా పోటీ చేసి ఓడానని.. ఓటమితో వెనుకాడే వ్యక్తిని కాదన్నారు. రాజకీయాల కోసం వ్యక్తిత్వం మార్చుకునే వ్యక్తిని కాదన్నారు. తనను ఎవరు ఇబ్బంది పెడితే వారిని తిడతా అని, వ్యక్తిగతంగా ఎవరినీ తిట్టను అని చెప్పుకొచ్చారు. మెదక్‌లో సొంత పార్టీ నేతలపై కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తల తో చర్చించి వారు ఇచ్చే సందేశాలతో ముందుకెళ్తా నన్నారు. పార్టీ మార్పు గురించి మల్కాజిగిరి ప్రజలు ఏది చెబితే, అది చేస్తానని చెప్పారు. ఊహాజనితమైన వార్తలు రాయొద్దని కోరారు.

Spread the love