– మనిషి కాదు కళే శాశ్వతం
– కార్టూనిస్టులపై అధ్యయనం పెరగాలి :ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, దేశపతి శ్రీనివాస్, కవి సీతారాం
– కార్టూనిస్ట్ శేఖర్ మెమోరియల్ అవార్డు-2023ను అందుకున్న శంకర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రతి కార్టూనిస్టు కూడా గొప్ప సామాజిక శాస్త్రవేత్త అనీ, ఆ రంగంలో శేఖర్ గొప్పగా రాణించి పేరుప్రతిష్టలు సాధించారని పలువురు వక్తలు కొనియాడారు. ఆయన పేరుతో అవార్డు ఇస్తున్న అతని మిత్రులు, కుటుంబసభ్యులకు అభినందనలు తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో కార్టూనిస్టు శేఖర్ మెమోరియల్ అవార్డు-2023ను పామర్తి శంకర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, గోరటి వెంకన్న, ప్రెస్ అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ, కవి డాక్టర్ సీతారాం, చిత్రకారులు కూరెళ్ళ శ్రీనివాస్, బోధి ఫౌండేషన్ అధ్యక్షులు బంగారు బ్రహ్మం, శేఖర్ భార్య చంద్రకళ, సీనియర్ జర్నలిస్టు కంబాలపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఓయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.రఘు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ..తెలంగాణ ఉద్యమంలో శేఖర్ తన వంతు పాత్ర పోషించారన్నారు. శేఖర్ ‘గిదీ తెలంగాణ’ పుస్తకంలోని కార్టూన్లు తెలంగాణ ఉద్యమానికి ఎంతో దోహదపడ్డాయన్నారు. ఆయన నిరంతర అధ్యయన శీలి అనీ, తాజా రాజకీయ పరిణామాలను పరిశీలిస్తూ అప్పటికప్పుడు అద్భుతమైన కార్టూన్లను వేయడంలో ఆయన దిట్ట అని కొనియాడారు. కార్టూన్ రంగంపై పరిశోధనలు పెరగాలనీ, మంచిమంచి పుస్తకాలు రావాలని ఆకాంక్షించారు. అల్లం నారాయణ మాట్లాడుతూ.. కార్టూన్ రంగంలో శిఖరం మీద నిలబడ్డ కార్టూనిస్ట్ శేఖర్ అని కొనియాడారు. పొలిటికల్ కార్టూనిస్టుల అవస్థలు అన్నీఇన్నీ కావన్నారు. కాలంతో పోటీపడిన కార్టూనిస్టులు మాత్రమే సక్సెస్ అయ్యారన్నారు. నల్లగొండలోని ఎన్‌జీ కాలేజీ నుంచి ఎక్కువమంది కార్టూనిస్టులు రావడం ఆ పోరుగడ్డ ప్రభావం, సార్ల చైతన్యమే కారణం అయ్యి ఉండొచ్చన్నారు. ఎమ్మెల్సీ గోరటి వెంకన్న మాట్లాడుతూ..మనిషి అశాశ్వతమనీ, కళ శాశ్వతమని అన్నారు. ఒక బొమ్మ ద్వారా చెప్పాల్సిన భావం మొత్తాన్ని చెప్పడమంటే మామూలు విషయం కాదన్నారు. కార్టూన్ గీయడం కత్తిమీద సాములాంటిదేనన్నారు. సమాజాన్ని చైతన్యం చేయడమే కవులు, కార్టూనిస్టుల ప్రధాన లక్ష్యం అన్నారు. సీతారాం మాట్లాడుతూ..శేఖర్ నిరంతర అధ్యయనీ శీలి అనీ, కొత్తదనాన్ని నేర్చుకోవడం, కొత్తదారులు వెతకడం కోసం ఆయన నిరంతరం కష్టపడేశారని గుర్తుచేశారు. కార్టూన్ కూడా ఒక సాహిత్యమేనన్నారు. అకాడమిక్‌గా కార్టూన్లపై పరిశోధనలుగానీ, పీహెచ్‌డీ చేసినవారు గానీ లేకపోవడం బాధాకరమన్నారు. వనరుల పట్ల అప్రమత్తం ఉండాలనీ, భవిష్యత్ తరాలకు అందించాలనే లక్ష్యంతో శేఖర్ గీసిన కార్టూన్లు అద్భుతంగా పేలాయని చెప్పారు. కార్టూన్లను నవ్వు పుట్టించేవిగా మాత్రమే చూడొద్దన్నారు. ప్రజల కడుపును మండించడం, గుండెను రగల్చగలిగే శక్తి కార్టూన్లకు ఉంటుందన్నారు. మతాన్ని రాజకీయం నుంచి వేరు చేయాలనీ, అమలు చేయని మ్యానిఫెస్టోలు ఎందుకని రాజకీయ నేతలను ప్రశ్నిస్తూ శేఖర్ వేసిన కార్టూన్లు నిజంగా అద్భుతమైనవన్నారు. చిత్రకారులు కూరెళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ..చదుకునే సమయంలో శేఖర్‌తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.