ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ, స్వతంత్రంగా జీవించాలి

Everyone should live free and independent– అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు పోటీ తత్వాన్ని అలవర్చుకోవాలి
– వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి.దామోదర రాజనర్సింహ
నవతెలంగాణ-జోగిపేట
సమాజంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ, స్వతంత్రంగా జీవించాలని, అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు అన్ని రంగాల్లోనూ ముందుకెళ్లాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి. దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా అందోల్‌ గురుకుల పాఠశాలలో నాలుగు రోజులుగా జరుగుతున్న గర్ల్స్‌ పదో జోనల్‌ లెవెల్‌ గేమ్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌ మీట్‌ ముగింపు కార్యక్రమంలో గురువారం మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నారులు, విద్యార్థులే దేశ భవిష్యత్‌ నిర్మాతలు అని చెప్పారు. బాలికలు ఎందులోనూ బాలురకు తీసిపోవద్దని సూచించారు. అధైర్యం, అభద్రతకు గురికాకూడదని, నమ్మకంతో అన్ని రంగాల్లో ముందుకెళ్లాలన్నారు. ఆటల్లోనైనా, జీవితంలోనైనా గెలుపోటములు సహజ మని, క్రీడలను స్పోర్టీవ్‌గా తీసుకోవాలని చెప్పారు. మరోసారి ఆడి గెలిచేందుకు శక్తిని కూడదీసుకుని సాధన చేయాలన్నారు. ఇప్పుడు చదువుల్లో పడి క్రీడలను నిర్లక్ష్యం చేస్తున్నారని, విద్యతో పాటు కల్చర్‌, స్పోర్ట్స్‌ కూడా చాలా ముఖ్యమని, ప్రతి విద్యార్థీ తమకు నచ్చిన ఆటలు ఆడాలని చెప్పారు. క్రీడల్లో పాల్గొనే విద్యార్థులు ఫిజికల్‌గా, మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటారన్నారు. పోటీతత్వాన్ని అలవర్చుకోవా లన్నారు. ఒత్తిడిని తట్టుకునే శక్తిని, లీడర్‌షిప్‌ క్వాలిటీస్‌ను సంపాదించుకోవాలన్నారు. ప్రస్తుత రోజుల్లో జీవన విధానంలో ఇవి చాలా అవసరమ న్నారు. జీవితంలో ఎదగటానికి ఎంతగానో ఉపయోగపడ తాయన్నారు. అమ్మాయిలు చదువుల్లో, ఆటల్లో రాణించడంతో పాటు సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక, సమకాలిన అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. పాఠ్య పుస్తకాలతోపాటు చరిత్రకు సంబంధించిన పుస్తకాలు కూడా చదవాలని సూచించారు. ప్రతి స్కూల్‌లో లైబ్రరీ ఏర్పాటు చేస్తామని, అన్ని బుక్స్‌ అందజేస్తామని అన్నారు. ప్రతి స్టూడెంట్‌ లైబ్రరీకి వెళ్లాలని, మీకు నచ్చిన పుస్తకం చదవడం వల్ల జ్ఞానం పెరుగుతుందని అన్నారు. మీరు ఎదిగిన తర్వాత సమాజానికి మీ వంతు సాయం చేయాల్సిన అవసరం ఉంటుందన్నారు.
కబడ్డీ ఆడిన మంత్రి
ఇస్నాపూర్‌, వికారాబాద్‌ పాఠశాలల క్రీడాకారులకు కబడ్డీ పోటీని మంత్రి ప్రారంభించారు. ఇరుజట్లతో కలిసి కబడ్డీ ఆట ఆడారు. విద్యార్థులను ఉత్సాహపరిచారు. అంతకుముందు విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా విభాగాల్లో విద్యార్థినులకు మెమోంటోలు అందజేశారు. అనంతరం శాఖ గ్రంథాలయాన్ని మంత్రి పరిశీలించారు. కేజీబీవీ, నర్సింగ్‌ కాలేజీ పనులను పర్యవేక్షించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, గురుకుల పాఠశాలల స్టేట్‌ ఆఫీసర్‌ భీమయ్య, జోగిపేట ఆర్డీవో పాండు, రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ డైరెక్టర్‌ ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి, జోగిపేట మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ ఎం.జగన్‌ మోహన్‌ రెడ్డి, మున్సిపల్‌ చైర్మెన్‌ మల్లయ్య, వైస్‌ చైర్మెన్‌ ప్రవీణ్‌, తహసీల్దార్‌ విష్ణు సాగర్‌, కమిషనర్‌ తిరుపతి, అందోల్‌ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సద్గుణ మేరీ గ్రేస్‌, స్పోర్ట్స్‌ ఇన్‌చార్జి గణపతి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Spread the love