– ప్రచారాలన్నీ ప్రధాని కేంద్రంగానే..
– ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే తీరు
– అయినా బీజేపీకి ఎదురుగాలే : రాజకీయ విశ్లేషకులు
ఈ ఏడాది ముగింపు నాటికి ఐదు రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు కొలువుదీరనున్నాయి. ఈశాన్య రాష్ట్రం మిజోరం మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రచారానికి మోడీ విస్తృతంగా పర్యటించారు. ‘మోడీ గ్యారంటీ’ అంటూ ప్రచారం చేశారు. ఎన్నికలు జరిగిన(జరగబోయే) రాష్ట్రాల్లో అక్కడి స్థానిక నేతలతో సంబంధం లేకుండా మోడీ కేంద్రంగానే అంతా తానే అన్న విధంగా ఆయన ప్రచారం సాగింది. అయినప్పటికీ.. ఆ పార్టీకి ఆశించిన ఫలితాలు వచ్చేలా కనిపించటం లేదు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణల్లో బీజేపీకి అవకాశాలు అంతగా లేవనీ, రాజస్థాన్‌లో గట్టి పోటీ ఉంటుందని రాజకీయ పరిశీలకుల అంచనాలు, పలు సంస్థల సర్వేలు వెల్లడిస్తున్నాయి.
న్యూఢిల్లీ : ఎన్నికల ప్రచార సరళి మోడీ వర్సెస్ ఆల్ అన్నట్టుగా చూపించాలన్నది బీజేపీ తాపత్రయ మని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో బీజేపీ ఘోరంగా ఓడిపోయిన కర్నాటక నుంచి ఎలాంటి పాఠాలూ నేర్చుకోలే దని చెప్తున్నారు. అక్కడ కూడా మోడీ.. బీజేపీ ప్రచారానికి నాయకత్వం వహించి ఎన్నికలను తనవైపు తిప్పుకు న్నారు. అయినప్పటికీ ఆ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నది. ఆ నష్టాన్ని మరచిపోకముందే మరోసారి ప్రస్తుత ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ తానే కేంద్ర బిందువుగా బీజేపీ తరఫున మోడీ ప్రచారానికి దిగారు. ప్రధాని హౌదాలో మోడీ ప్రజల్లో అంతా తానే అన్నవిధంగా రాజరికాన్ని ప్రదర్శించే ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీ యవిశ్లేషకులు అంటున్నారు. అందుకు ఆయన ఎన్నికల ప్రచార శైలినే వారు ఉదహరిస్తున్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలనే కాదు.. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆయన ప్రధాని హౌదాల్లో ప్రచారాలకు వెళ్లారని గుర్తు చేస్తున్నారు.
బీజేపీకి డబుల్ ప్రచారం
బహిరంగ సమావేశాల్లోనూ, ర్యాలీల్లోనూ.. చర్చ అనేది తాను కేంద్రంగా జరగాలన్నది బీజేపీ, మోడీల తాపత్రయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మోడీ తనపై ఎన్నికల దృష్టిని కేంద్రీకరించడానికి కారణం.. తనను తాను ‘అభివృద్ధి మనిషి(వికాస్‌పురుష్)’గా చూపించుకోవడమేనని చెప్తున్నారు. ఒకవేళ అవసరమనుకుంటే బీజేపీకి ఆయుధమైన మతం అనే సున్నితమైన అంశాన్ని ప్రధాని హౌదాలో ప్రస్తావించి కాషాయపార్టీకి ఓట్లు తీసుకురావటమూ ఒక వ్యూహమని రాజకీయ విశ్లేషకులు వివరిస్తున్నారు. మోడీ.. కర్నాటక ఎన్నికల్లో ‘భజరంగ్‌బలి’ అంటూ భజరంగ్‌దళ్‌కు అనుకూలంగా నినాదాలు తీసుకు వచ్చాడనీ, అయినప్పటికీ ప్రజల్లో అనుకున్నంత స్పందన రాకపోగా.. ఆ ఎన్నికల్లో కాషాయపార్టీ చతికలపడిందని వారు గుర్తు చేస్తున్నారు.
‘మోడీ మీద ఆధారపడితే బీజేపీకి నష్టమే’
మోడీ కేంధ్రంగా సాగే ఈ తరహా ప్రచారం వల్ల .. భవిష్యత్తులో బీజేపీ రాజకీయంగా తీవ్ర నష్టాన్ని ఎదురు చూడక తప్పదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీజేపీలో మోడీకి ప్రత్యామ్నాయంగా ఎవరూ లేరనీ, అసెంబ్లీ, స్థానిక ఎన్నికలకు సైతం ఆయనే రావాల్సిన పరిస్థితులు ఆ పార్టీలో ఏర్పడ్డాయని చెప్తున్నారు. అయితే, ప్రధాని స్థాయిలో ఆయన తన శక్తినంతా వినియోగించినప్పటికీ.. కాషాయపార్టీకి చేదు ఫలితాలే ఎదురవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. మోడీ వేవ్ ఉన్నదని చెప్తున్న సమయంలో 2015లో ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయిందని చెప్తున్నారు. ఆ పార్టీ 31 సీట్ల నుంచి కేవలం మూడు స్థానాలకు పడిపోయిందని గుర్తు చేస్తున్నారు. ఆ తర్వాత వచ్చిన బీహార్ ఎన్నికల్లోనూ బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయిందని అంటున్నారు.
‘ఆయన తిరుగులేని రాజకీయ శక్తి కాదు’
దేశ రాజకీయాల్లో తిరుగులేని శక్తి అంటూ బీజేపీ, దాని అనుకూల మీడియా చేస్తున్న ప్రచారాలు ఉట్టి మాటలేననీ, ఇందుకు పలు రాష్ట్రాల్లో మోడీ ప్రచారం చేస్తున్నప్పటికీ.. కాషాయ పార్టీ ఓటమిపాలవుతుండటమే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు మణిపూర్, మేఘాలయా వంటి ఈశాన్య రాష్ట్రాలలో మోడీ ప్రధాన ప్రచారకర్తగా ఉన్నప్పటికీ బీజేపీ ఓడిపోయిందంటున్నారు.
‘ఫిరాయింపులతో అధికారం’
ఆయా రాష్ట్రాల ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత కూడా కేంద్రంలో ఉన్న తన అధికార బలాన్ని ఉపయోగించి ఫిరాయింపుల ద్వారా ప్రతిపక్ష పార్టీలను విచ్ఛిన్నం చేసిన బీజేపీ విధానాన్ని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అధికార పార్టీ శాసనసభ్యులను ‘కొనుగోలు’ చేయడం ద్వారా పలు రాష్ట్రాల్లో బీజేపీ అధికారాన్ని చేజిక్కిచ్చుకున్నదని అంటున్నారు. మణిపూర్, మధ్యప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ అధికారాన్ని లాక్కున్నదని వారు గుర్తు చేస్తున్నారు. బీజేపీ అనుసరిస్తున్న తీరు ప్రజలలో ఆ పార్టీ పట్ల ద్వేశాన్ని మరింత పెరిగేలా చేస్తుందని అంటున్నారు.
‘మణిపూర్ ఎఫెక్ట్.. మిజోరాంకు మోడీ దూరం’
మోడీ తనకు ప్రతికూలంగా ఉన్న రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో ప్రచారానికి వెళ్లడనీ, ఇందకు ఈశాన్య రాష్ట్రం మిజోరామ్ ప్రత్యక్ష ఉదాహరణ అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మిజోరాంలో సైతం అసెంబ్లీ ఎన్నిలకు ఉన్నప్పటికీ.. మోడీ అక్కడ ప్రచారానికి వెనకడుగు వేశాడని అంటున్నారు. పొరుగున్న ఉన్న మణిపూర్‌లోని బీజేపీ పాలనలో జాతి ఘర్షణలు చోటు చేసుకోవటం, దానిని నియంత్రించటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం కావటంతో దాని ప్రభావం మిజోరాంలో సైతం పడిందని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ కారణంతోనే మిజోరాం ప్రచారానికి వెళ్లకుండా మోడీ తప్పించుకుంటున్నారని అంటున్నారు. మిజోరాంలో బీజేపీకి మిత్రపక్షమైన మిజోరాం ముఖ్యమంత్రి సైతం ప్రధానితో వేదిక పంచుకోవటానికి ఇష్టపడలేదని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.