ప్రజా ఆశీర్వాద సభకు సర్వం సిద్ధం

– నేడు చేవెళ్లలో బీఆర్‌ఎస్‌ బహిరంగ సభ
– రైతులే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ శ్రేణుల జనసమీకరణ
– 2 లక్షల జన సమీకరణకు ఏర్పాట్లు
– సభ ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి
– చేవెళ్ల నుంచే బీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ ఎన్నికల శంఖారావం
– హాజరుకానున్న బీఆర్‌ఎస్‌ అధ్యక్షులు మాజీ సీఎం కేసీఆర్‌
– కేసీఆర్‌ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ
పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారాన్ని బీఆర్‌ఎస్‌ చేవెళ్ల వేదికగా ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది. నేడు చేవెళ్లలో చేపట్టనున్న ‘ప్రజా ఆశీర్వాద’ ద్వారా బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ఈ సభకు చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో జన సమీకరణ చేపట్టేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. సభ విజయవంతం చేసే బాధ్యతలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డికి అప్పగించడంతో ఆమె సభ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ.. సభను విజయవంతం చేసే దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల మొదటి సభ కావడంతో చేవెళ్ల సభను ఆ పార్టీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సభకు సుమారు 2లక్షల మందికి సమీకరించాలని భావిస్తోంది. ఈ సభ ద్వారా మాజీ సీఎం కేసీఆర్‌ ఎం చెబుతారోనని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల పార్లమెంట్‌ను బీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఆ పార్టీ అధినాయకత్వం ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారిం చింది. ఆదే లక్ష్యంతో లోక్‌సభ ఎన్నికల శంఖారానాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ పట్టుబట్టినట్టు తెలుస్తోంది. చేవెళ్ల పార్లమెంట్‌లో కారు గుర్తు వరుసగా రెండు సార్లు విజయం సాధించింది. మరో సారి గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాలని కేసీఆర్‌ గట్టిపట్టు పట్టారు. అదే దిశగా ఈ ప్రాంతంలో బీసీ ఓటింగ్‌ ఎక్కువగా ఉండటంతో.. బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్‌ను బరిలో నిలిపారు. బహుజన వర్గం ఓటు బ్యాంక్‌తో గట్టేక్కెందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.
సభకు రైతులే లక్ష్యంగా ప్రణాళికలు…
చేవెళ్ల సభకు ఎక్కువగా రైతులను సమీకరించేందుకు బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్‌ ప్ర భుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు తీరుపై ఎక్కు వగా కేసీఆర్‌ ఫోకస్‌ చేయనున్నట్టు తెలుస్తోంది. రైతుబంధు, రైతుల పంటకు బోనస్‌ విషయాన్ని ప్రధాన ఎజెండగా తీసుకుని కాంగ్రెస్‌ను నిలదీయనున్నట్టు తెలు స్తోంది. కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేస్తూ.. తమ నాయకత్వంలో రైతుల సంక్షేమానికి తీసుకున్న నిర్ణయాలను రైతులు అవగాతం చేసి.. ఈ ఎన్నికల్లో రైతులను మచ్చిక చేసు కోవడానికి కేసీఆర్‌ ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. సుమారు రెండు లక్షల మందిని ఈ సభను సమీకరిం చాలని పార్టీ భావిస్తోంది. ఈ సభ ద్వారా పార్లమెంట్‌ ఎన్నికల్లో తమ బలాన్ని నిరూపించుకోవాలని చూస్తోంది. దాంతో కేసీఆర్‌ ఆ సభ ద్వారా ఎలాంటి సందేశం ఇవ్వనున్నారని క్యాడర్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కేసీఆర్‌ బహిరంగసభను విజయవంతం చేయాలి : సబితా ఇంద్రారెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ పిలుపు
చేవెళ్ల పార్లమెంటు స్థానంపై గులాబీ జెండాను ఎగురవేయడానికి బీఆర్‌ఎస్‌ శ్రేణులు సమరోత్సాహాంతో ఉన్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి, బీఆర్‌ఎస్‌ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ అన్నారు. శనివారం జరిగే కేసీఆర్‌ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ విజయమే లక్ష్యంగా నిర్వహిస్తున్న బహిరంగ సభకు లక్షలాదిగా నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి బీఆర్‌ఎస్‌ సత్తా చాటాలని సూచించారు. ఈ దిశగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి బహిరంగ సభకు తరలించాలని పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని వారు సూచించారు. సభ విజయవంతానికి అందరూ సహకరించాలని కోరారు.

Spread the love