– దానిని అన్‌లాక్ చేయటానికి
– ఓటీపీ అవసరం లేదు
– ముంబయి ఎన్నికల అధికారి వెల్లడి
ముంబయి : ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)ను అన్‌లాక్ చేయటానికి వన్-టైమ్ పాస్వర్డ్ అవసరం లేదని ముంబయి వాయువ్య లోక్‌సభ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారిని తెలిపారని పీటీఐ తెలిపింది. నియోజకవర్గం నుంచి కొత్తగా ఎన్నికైన ఎంపీ రవీంద్ర వైకర్ బంధువు జూన్ 4న ఈవీఎంను అన్‌లాక్ చేయటానికి ఓటీపీని జనరేట్ చేయటం కోసం ఓట్ల లెక్కింపు కేంద్రానికి ఫోన్‌ను తీసుకెళ్లినట్టు వచ్చిన వార్తాపత్రిక కథనంపై సదరు అధికారి స్పందించారు. ” ఈవీఎం అనేది స్వతంత్ర వ్యవస్థ. దానిని అన్‌లాక్ చేయటానికి ఓటీపీ అవసరం లేదు” అని రిటర్నింగ్ అధికారి వందనా సూర్యవంశీ విలేకరుల సమావేశంలో చెప్పినట్టు పీటీఐ వివరించింది. ”ఇది ప్రోగ్రామబుల్ కాదనీ, వైర్లెస్ కమ్యూనికేషన్ సామర్థ్యాలు లేవని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల రోజున కౌంటింగ్ కేంద్రానికి మొబైల్ ఫోన్ తీసుకెళ్లాడన్న ఆరోపణలపై వైకర్ బంధువు మంగేష్ పాండిల్కర్‌పై పోలీసులు బుధవారం కేసు నమోదు చేసిన విషయం విదితమే. మంగేశ్ పండిల్కర్‌పై కేసు నమోదైన తర్వాత పోలీసులు కౌంటింగ్ కేంద్రం నుంచి సెక్యూరిటీ కెమెరా ఫుటేజీని సేకరించారు. ఆ ప్రాంతంలోకి ఫోన్ తీసుకెళ్లేందుకు అతడికి అనుమతి లేదని విచారణలో తేలింది. జోగేశ్వరి అసెంబ్లీ సెగ్మెంట్‌కు చెందిన డేటా ఎంట్రీ ఆపరేటర్ దినేష్ గురవ్ వ్యక్తిగత ఫోన్ అనధికార వ్యక్తి వద్ద దొరికిందనీ, ఈ విషయంలో చర్యలు తీసుకుంటున్నామని సూర్యవంశీ చెప్పారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గానికి చెందిన వైకర్.. జూన్ 4న శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే)కి చెందిన అమోల్ కృతికర్ను ఓడించి ముంబై నార్త్-వెస్ట్ సీటును గెలుచుకున్నారు. తొలుత కృతికర్ గెలిచినట్టు కనిపించగా.. గెలుపు ఓట్ల తేడా తక్కువగా ఉన్నందున ఓట్లను రీకౌంటింగ్ చేయాలని వైకర్ డిమాండ్ చేశారు. ఈవీఎంలతో పోలైన ఓట్లను తిరిగి లెక్కించగా, వైకర్‌తో పోలిస్తే కృతికర్కు ఒక ఓటు ఎక్కువ ఉన్నట్టు తేలింది. అయితే, పోస్టల్ బ్యాలెట్లను మళ్లీ తనిఖీ చేయటం ద్వారా వైకర్ 48 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు. దీంతో వైకర్‌ను చివరికి విజేతగా ప్రకటించారు. అయితే, ఫలితాల తర్వాత కృతికర్తో పాటు ఓడిపోయిన ఇతర అభ్యర్థులు కౌంటింగ్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు.