ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు వాళ్లకేనా..?

Are EWS reservations for them?– ఇతర కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారి సంగతేంటి అంటూ ప్రశ్న
– కేంద్రానికి మధ్యప్రదేశ్‌ హైకోర్టు నోటీసులు
భోపాల్‌: ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌లపై మధ్యప్రదేశ్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్థికంగా వెనుకబడిన జనరల్‌ కేటగిరీ కులాల వారికి మాత్రమే ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌లు వర్తిస్తాయా..? అని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఇతర కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌లు వర్తించడం లేదని ‘అడ్వకేట్స్‌ యూనియన్‌ ఫర్‌ డెమోక్రసీ అండ్‌ సోషల్‌ జస్టిస్‌’ సంస్థ మధ్యప్రదేశ్‌ హైకోర్టులో పిటిషన్‌ వేసింది. ఆ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌లు కేవలం జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకే వర్తిస్తాయా..? లేదంటే ఇతర కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి కూడా వర్తిస్తాయా..? అనే విషయంలో స్పష్టత ఇవ్వాలంటూ చీఫ్‌ జస్టిస్‌ రవి విజయ మలిమత్‌, జస్టిస్‌ విశాల్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ఆరు వారాల్లో స్పందనను తెలియజేయాలని ఆదేశించింది. కాగా, ఇతర కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు వర్తించడం లేదని, పేదలపై కులం పేరుతో ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని, ఈ రిజర్వేషన్‌లను రాజ్యాంగ విరుద్ధంగా భావించి కొట్టి వేయాలని పిటిషనర్‌లు కోర్టును కోరారు.

Spread the love