నవతెలంగాణ- న్యూఢిల్లీ :మాజీ ఐపీఎస్ ఆఫీసర్ సంజీవ్ భట్‌కు సుప్రీంకోర్టు మూడు లక్షల జరిమానా విధించింది. ఓ డ్రగ్స్ కేసులో పదే పదే పిటీషన్లను దాఖలు చేస్తున్నందుకు అతనికి ఆ ఫైన్ వేసింది. జస్టిస్ విక్రమ్‌నాథ్, రాజేశ్ బిందాల్‌తో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. సంజీవ్ భట్ ఇటీవల వరుసగా మూడు సార్లు కోర్టులో అభ్యర్థనలను దాఖలు చేశారని, ఒక్కొక్క దానికి లక్ష చొప్పున, అతనికి మూడు లక్షల ఫైన్ వేశారు. సుప్రీంకోర్టుకు ఎన్ని సార్లు వచ్చావని, కనీసం ఓ డజన్ సార్లు వచ్చావా అని జస్టిస్ విక్రమ్‌నాథ్ ప్రశ్నించారు. గుజరాత్ హైకోర్టు అడ్వకేట్ల సంఘం వద్ద ఆ మొత్తాన్ని డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశించింది.1996లో రాజస్థాన్‌కు చెందిన ఓ లాయర్‌ను బసన్కాంతా పోలీసులు అరెస్టు చేశారు. హోటల్ లో అడ్వకేట్ రూమ్ నుంచి డ్రగ్స్ సీజ్ చేశారు. ఆ సమయంలో బసన్కాంతా ఎస్పీగా భట్ ఉన్నారు. ఆ లాయర్‌పై తప్పుడు కేసును బనాయించినట్లు రాజస్థాన్ పోలీసులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ కేసులో భట్‌ను 2018 సెప్టెంబర్‌లో అరెస్టు చేశారు. అప్పటి నుంచి అతను జైలులోనే ఉన్నాడు. ప్రధాని మోడీని విమర్శిస్తున్నారన్న నేపథ్యంలోనే భట్‌ను ఇరికించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.