పెద్దరికం ప్రభుత్వానికి.. ఖర్చు ప్రజలకి: మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి

నవతెలంగాణ – నవీపేట్: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరిట అభివృద్ధి చేశామని బిఆర్ఎస్ ప్రభుత్వం పెద్దరికంగా ప్రజల ఖర్చుతో ప్రచారం చేస్తుందని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి విమర్శించారు.మండలంలోని అలీ సాగర్ లిఫ్టు ఎత్తిపోతల పథకంలోని కోస్లీ, బాగేపల్లి, అలీ సాగర్ స్టేజీలను పరిశీలించారు.అలాగే మండలంలోని అభంగపట్నం ఎర్రగుంట రిజర్వాయర్ ను సైతం పరిశీలించి మీడియాతో మాట్లాడారు.బోధన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే షకీల్ రైతులకు ఉపయోగపడే ఏ ఒక్క పని చేయలేదని విమర్శించారు. వెయ్యి ఎకరాలకు రెండు తడులకు నీరు అందించే ఎర్రకుంట రిజర్వాయర్ మిగులు పనులను పూర్తి చేయాలని ఎమ్మెల్యే షకీల్ తో పాటు ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకెళ్లిన స్పందించకపోవడం రైతుల పట్ల వారికి ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనం అని అన్నారు. అసలు అభివృద్ధి చేయని వ్యక్తులు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని అందుకే తాను చేసిన అభివృద్ధిని చెప్పేందుకే పర్యటిస్తున్నానని అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగంతో పాటు విద్యా,వైద్య రంగాలకు సౌకర్యాలు కల్పించగా అస్తవ్యస్తంగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50వేల వార్షిక బడ్జెట్ తో చేసిన అభివృద్ధి రెండు లక్షల నలబై వేల కోట్ల వార్షిక బడ్జెట్ తో ఎందుకు చేయలేకపోతున్నారో చెప్పాలని అన్నారు. ప్రజలు సైతం ఎవరు ఏమి చేస్తున్నారో అవగాహనను పెంచుకోవాలని సూచించారు.మాయమాటలకు మోసపోకుండా ప్రజల కోసం వ్యవస్థ కోసం పనిచేసే వారినే గెలిపించాలని కోరారు.రానున్న ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 9 నియోజకవర్గాలు గెలవడమే గాక రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, తాహెర్ బిన్ హాందాన్, పార్టీ మండల అధ్యక్షులు సుధాకర్ రావు, మాజీ వైస్ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి,మోస్రా సాయరెడ్డి, భగవాన్, బాబు, సంజీవ్ రెడ్డి, మూస, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love